ఉద్దానంలో కొబ్బరే కాదు... వరి కూడా పండుతుంది. ఇక్కడ వ్యవసాయశాఖ అధికారులు కూడా పనిచేస్తున్నారు. వారంతా ఇక్కడి రైతుకు అవసరమైన సలహాలు... సూచనలు అందిస్తున్నారు. కానీ ప్రకృతి ప్రకోపించినపుడు ఇక్కడ వరిపండించే రైతులు తీవ్ర నష్టాలు చవిచూస్తున్నా... సర్కారు అందించే పరిహారానికి నోచుకోవడంలేదు. సాంకేతిక కారణాలు చూపుతూ వేలాది రైతులను నిట్టనిలువునా ముంచేస్తున్నారు.
కవిటి : ఉద్దానం ప్రాంతం కవి టి మండలంలో దాదాపు 2500 హెక్టార్లలో వరిపండించే రైతులున్నారు. వీరందరికీ గడచిన కొన్నేళ్లుగా అందరిలానే రుణవి తరణ చేస్తూ వడ్డీరాయితీలను అందిస్తూ వస్తున్నారు. కానీ రుణమాఫీ దగ్గరకొచ్చేసరికి మాత్రం ప్రభుత్వం వెన్నుపోటు పొడిచింది. కనీసం ఈ ప్రాంత రైతుల మొర వినలేదు. సరిగ్గా రెండేళ్ల క్రితం పై-లీన్ తుఫాన్ రూపంలో ప్రకృతి ఉద్దానం రైతు నడ్డివిరిచింది. పీకల్లోతు అప్పుల్లో ఉన్న అన్నదాతను గత ఖరీఫ్, రబీ సీజన్లు తెగుళ్ల రూపంలో ముంచేశాయి. సరిగ్గా అదే సమయాన(2014లో) ఎన్నికలు రావడం ప్రస్తుత ముఖ్యమంత్రి,నాటి ప్రతిపక్ష నేత ఎన్నికల ప్రచారంలో రుణమాఫీ ప్రకటన గుప్పించడం. ఆ తర్వాత రైతుల ఓట్లు దండుకొని గద్దెనెక్కడం చకచకాజరిగిపోయాయి. అధికారం చేజిక్కించుకొన్న తర్వాత రుణమాఫీ కొబ్బరికి వర్తించదంటూ ప్లేటు ఫిరాయించేశారు. అయితే అప్పటికే బ్యాంకులనుంచి అప్పులు తెచ్చిన రైతులు మాఫీ కోసం ఆశపడి వడ్డీలు సైతం చెల్లించలేదు. దీంతో తెచ్చిన అప్పులకు చక్రవడ్డీలు పడి తడిసిమోపెడయ్యాయి. ఇదిలా ఉంటే కొబ్బరికి వర్తించకపోతే కనీసం వరికైనా వర్తిస్తుందని ఆశించారు. అక్కడా వీరికి మొండిచెయ్యే ఎదురైంది.
సాంకేతిక కారణాలంటూ...
ఏటా ముంపు సమయాల్లో ఆయా ప్రాంతాల్లో వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పర్యటనలు చేస్తున్నారు. రైతులపై సానుభూతి చూపిస్తున్నారు. కానీ ఏవో సాంకేతిక కారణాలు చూపి రైతులను ఆదుకునేందుకు ముందుకు రావడంలేదు. ఇక్కడ వరిపండిస్తున్నా... రెవెన్యూ రికార్డుల్లో మెట్టప్రాంతంగా నమోదై ఉన్నందున ఇక్కడి రైతులకు రుణమాఫీ వర్తించదని తేల్చిచెప్పేస్తున్నారు. తమ అసమర్థతను, చేతగాని తనాన్ని అన్నదాత నెత్తిన రుద్దేస్తున్నారు. అన్ని అర్హతలూ ఉన్నప్పటికీ అధికారుల వైఫల్యం వల్ల ఉద్దానం రైతులు బలైపోయారు. ఎన్నోసార్లు ఎంతోమందికి మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయింది. కనీసం అన్నదాత గోడు వినే నాథుడే కరువయ్యాడు. ఈ చిన్నలోపాన్ని సవరించి రైతులకు మేలు చేయాల్సిన రెవెన్యూ యంత్రాంగం చేష్టలుడిగిన కారణంగా ఈ ప్రాంతరైతుల బతుకే కుప్పకూలింది.
ఉద్దానానికి వర్తించదా...?
Published Tue, Aug 11 2015 1:25 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement