సాహూరే.. | attempt to sell the names of different receivers | Sakshi
Sakshi News home page

సాహూరే..

Published Sat, May 2 2015 12:58 AM | Last Updated on Sun, Sep 3 2017 1:14 AM

సాహూరే..

సాహూరే..

సీసీఎస్ బృందానికి చెమటలు పట్టిస్తున్న గజదొంగ
రకరకాల రిసీవర్ల పేర్లు చెప్పి ఏమార్చే యత్నం
ముంబయి, పూణె చుట్టూ  తిరుగుతున్న పోలీసులు

 
 విజయవాడ సిటీ : గజదొంగ ప్రకాష్‌కుమార్ సాహూ సీసీఎస్ పోలీసులకు చుక్కలు చూపిస్తున్నాడు. చోరీ సొత్తు రికవరీ కోసం సాహూను వెంటపెట్టుకుని వెళ్లిన సీసీఎస్ పోలీసులు ముంబయి, పూణె మధ్య చక్కర్లు కొడుతున్నారు. రోజుకో రిసీవర్ పేరు చెబుతుండటంతో సొత్తు రికవరీ కోసం వెళ్లిన సీసీఎస్ పోలీసులు అష్టకష్టాలు పడుతున్నట్టు తెలిసింది.
 
గతంలోనూ ఇదే పంథా

మార్చి 25వ తేదీన ప్రసాదంపాడులోని సాయిబాబా మందిరంలో 40 కిలోల వెండి, ఇతర సామగ్రిని సాహూ చోరీ చేశాడు. ఇది గుర్తించిన పోలీసులు కొద్దిరోజుల కిందట అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, సాహూ పట్టివేత విషయం రిసీవర్లకు తెలియడంతో కొందరు అప్రమత్తమయ్యారు. చోరీ సొత్తు ముంబయి, పూణెలో విక్రయించినట్లు సీసీఎస్ అధికారుల విచారణలో సాహూ అంగీకరించడంతో రికవరీ కోసం ప్రత్యేక బృందం సాహూను వెంటబెట్టుకుని ముంబయి వెళ్లింది. అక్కడ అతను చెప్పినట్టుగా రిసీవర్లు లేకపోవడం, పదేపదే పేర్లు మార్చడంతో పోలీసులకు రికవరీ కష్టంగా మారింది. ముంబయి, పూణెలోని పలువురు ఉత్తరాది వ్యాపారుల పేర్లు చెబుతున్న సాహూ వారిని చూపించకుండా ఏమార్చే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. గతంలో దుర్గమ్మ ఆలయంలో జరిగిన చోరీ కేసులో కూడా సీఐడీ పోలీసులను సాహూ ఇలాగే బోల్తా కొట్టించాడు. 1998లోనే శ్రీకాకుళం జిల్లాలోని అరసవెల్లి సూర్య దేవాలయం, ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ ఆలయాల్లో చోరీ జరిగింది. రోజుల వ్యవధిలో జరిగిన రెండు చోరీల్లోనూ గ్యాస్ కట్టర్లే ప్రధాన ఆధారం. భక్తుల మనోభావాలకు సంబంధించిన కేసులు కావడంతో దర్యాప్తు బాధ్యతను సీఐడీ పోలీసులకు అప్పగించగా సాహూను అరెస్టు చేశారు. అప్పట్లో కూడా పూటకో సమాచారం ఇస్తూ సాహూ సీఐడీ పోలీసులను ఇబ్బందులకు గురిచేశాడు.

సాయి మందిరాలే టార్గెట్టా..?

మొదటి నుంచి దేవాలయాలనే చోరీలకు ఎంచుకునే సాహూ ఎక్కువగా సాయిబాబా మందిరాల్లోనే ఈ ఘాతుకాలకు పాల్పడుతున్నాడని సీసీఎస్ వర్గాల సమాచారం. మన రాష్ట్రంతో పాటు కేరళలోని కొన్ని దేవాలయాలను మినహాయిస్తే ఇప్పటివరకు చేసిన 40కిపైగా నేరాల్లో సాయిబాబా మందిరాలే అధికంగా ఉన్నట్టు పోలీసులు చెబుతున్నారు. బాబా మందిరాల్లో అపారమైన సంపద, నామమాత్ర భద్రతా చర్యలను దృష్టిలో పెట్టుకుని చోరీలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఇప్పటివరకు చేసిన అన్ని చోరీల్లోనూ గ్యాస్‌కట్టర్‌తో తలుపులు, గేట్లు తొలగించుకుని లోపలికి ప్రవేశించాడు. పైగా సాహూకు స్థానిక నేరస్తుల సహకారం ఉంటోందని భావిస్తున్న పోలీసులు ఆ దిశగా దర్యాప్తు చేసినా ఫలితం లేకుండాపోయింది.

ఉత్తరాది వ్యాపారులకే విక్రయం

సాహూ చోరీ చేసిన దేవుళ్ల కిరీటాలు, ఇతర నగలు గంటల వ్యవధిలోనే ముక్కలుగా చేస్తాడు. గుర్తించేందుకు వీల్లేకుండా చేసి తర్వాత ముంబయి, పూణెలోని ఉత్తరాది వ్యాపారులకు అమ్ముతాడు. కొన్నింటిని కరిగించి అమ్ముతుంటాడు. దేవతల నగలుగా ఆనవాళ్లు లేకుండా చేసి వ్యాపారులకు అనుమానం రాకుండా విక్రయించడంలో సాహూ సిద్ధహస్తుడు. కొందరు వ్యాపారులకు అతను విక్రయించేది దొంగసొత్తు అని తెలిసి కూడా తక్కువ ధరకు వస్తుండటంతో కొంటున్నట్లు సమాచారం.
 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement