సైకిల్ ఎక్కేందుకు ససేమిరా!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాజకీయ అరంగేట్రానికి ఆరాట పడుతున్న నేతలు ఓ వైపు. వచ్చే ఎన్నికల్లో చావో రేవో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్న నేతలు మరోవైపు. దీంతో గెలుపు అవకాశాలున్న పార్టీల కోసం నాయకులు వెతుకులాటలో ఉన్నారు. అయితే సొంతంగా పోటీ చేయడం, లేదంటే పొత్తులు కుదుర్చుకోవడం లక్ష్యంగా పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా టీడీపీ, బీజేపీ పొత్తుపై ఆయా పార్టీల శ్రేణులు క్షేత్ర స్థాయిలో మల్లగుల్లాలు పడుతున్నాయి.
ఇప్పటికే జిల్లాలో లీడర్, కేడర్ లేని పార్టీగా తయారైన తెలుగుదేశం వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తుతో కొంతైనా కలిసి వస్తుందనే భావనలో ఉంది. నరేంద్ర మోడీ, నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావం ఉంటుందని అంచనా వేస్తున్న స్థానిక నేతలు టీడీపీతో పొత్తుకు విముఖత చూపుతున్నారు. రెండు పార్టీలు పొత్తు కుదుర్చుకోవడంపై రాష్ట్ర స్థాయిలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నా, జిల్లా నుంచి మాత్రం పొత్తు వద్దనే సందేశాలు పంపుతున్నారు.
ఇప్పటి వరకు జిల్లా రాజకీయాల్లో నామమాత్ర పోషించిన బీజేపీ వచ్చే ఎన్నికల్లో మాత్రం ఫలితాలపై భారీ అంచనాలనే పెట్టుకుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, నరేంద్ర మోడీ ప్రభావం, నాలుగు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు తదితర అంశాలు కలిసి వస్తాయనే అంచనా పార్టీ శ్రేణుల్లో కనిపిస్తోంది. 1985లో రామాయంపేట ఎమ్మెల్యేగా ఆర్.శ్రీనివాస్‌రెడ్డి బీజేపీ పక్షాన గెలుపొందారు. 1999లో సంగారెడ్డి ఎమ్మెల్యేగా కె.సత్యనారాయణ, మెదక్ ఎంపీగా ఆలె నరేంద్ర పార్టీ తరఫున గెలుపొందారు. 1985, 1999, 2004లోనూ బీజేపీ, టీడీపీ ఎన్నికల పొత్తు కుదుర్చుకుని పోటీ చేశాయి. పొత్తుతో ఇరు పార్టీలు 1999లో గరిష్టంగా లబ్ధిపొందినా, 2004లో మాత్రం పూర్తిగా దెబ్బతిన్నాయి. 2009లో టీడీపీ మహా కూటమి పేరిట పొత్తు కుదుర్చుకోగా, బీజేపీ మాత్రం ఒంటరి పోరాటం చేసినా ఫలితం దక్కలేదు.
బలోపేతం దిశగా పావులు
‘తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ జిల్లాలో క్రమేపీ బలహీన పడుతూ వచ్చింది. పార్టీకి జిల్లా నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఏకైక ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు వచ్చే ఎన్నికల్లో పొరుగునే ఉన్న రంగారెడ్డి నుంచి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం జిల్లాలో టీడీపీ పరిస్థితి కేడర్, లీడర్ లేని పార్టీగా తయారైంది. ఈ నేపథ్యంలో టీడీపీతో పొత్తు పెట్టుకుని వారికి ఊపిరి పోయడం మినహా బీజేపీకి ఒరిగేదేమీ లేదని’ పార్టీ ముఖ్య నేత ఒకరు వ్యాఖ్యానించారు. పార్టీలో దీర్ఘకాలంగా పనిచేస్తున్న నాయకత్వాన్ని గుర్తించాల్సిన బాధ్యత బీజేపీ అగ్ర నాయకత్వంపై వుంది. అదే సమయంలో తెలుగుదేశం పార్టీలో మిగిలి ఉన్న కేడర్, లీడర్లను బీజేపీలో చేర్చుకుంటే మరింత బలోపేతం కావచ్చని పార్టీ నేతలు విశ్లేషించుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో టీడీపీకి చెందిన ఒకరిద్దరు మాజీ ఎమ్మెల్యేలు కూడా మంతనాలు సాగించినట్లు బీజేపీ ముఖ్య నేతలు చెప్తున్నారు. ప్రస్తుతం పొత్తుల అంశం తెరమీదకు రావడంతో గతంలో చేరికపై ఆసక్తి చూపిన టీడీపీ నేతలు ప్రస్తుతం పునరాలోచనలో ఉన్నట్లు బీజేపీ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లారు. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఒంటరి పోరు మాత్రమే ఉంటుంది. నియోజకవర్గాల వారీగా అభ్యర్థులను వెతకాలనే ఆదే శాలు’ పార్టీ నుంచి అందాయని బీజేపీ బాధ్యులు వెల్లడించారు. 2009లో కాంగ్రెస్ నుంచి మెదక్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన నరేంద్రనాథ్ బీజేపీలో చేరడం ఖాయమైంది. మరో 15 రోజుల్లో టీడీపీకి చెందిన ముగ్గురు ముఖ్య నేతలు తమ పార్టీలోకి వస్తారని బీజేపీ నేతలు చెప్తున్నారు. ఈ మేరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్వయంగా మంతనాలు జరిపారని పార్టీ వర్గాలు ‘సాక్షి’కి వెల్లడించాయి.