మినుమును వదలని పల్లాకు తెగులు
మందులు పనిచేయవంటున్న వ్యవసాయ నిపుణులు
రబీలోనూ రైతుకు ఎదురుదెబ్బ
నగరం/కర్లపాలెం: తీవ్ర వర్షాభావ పరిస్థితులు, సాగునీటి సమస్య కారణంగా ఖరీఫ్‌లో ఎదురైన నష్టాల్ని రబీలో పూడ్చుకుందామని ఆశించిన రైతులకు ఎదురుదెబ్బ తగిలింది. రబీలో వేసిన మినుము పంటకు ఈ ఏడాదీ పల్లాకు(ఎల్లో మొజాయిక్) తెగులు ఆశించడంతో దిక్కుతోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. ముందు జాగ్రత్తలే తప్ప, ఈ తెగులు సోకిన తర్వాత ఎలాంటి మందులు పనిచేయవని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.
ఖరీఫ్‌లో వరి సాగుచేసిన రైతులతోపాటు, ఏ పంటా సాగుచేయని డెల్టా ప్రాంత రైతులు కూడా గత నవంబర్ నెలాఖరున మినుము సాగు చేశారు. రేపల్లె నియోజకవర్గం లోని నగరం మండలంలో ఈ సారి నాలుగు వేల ఎకరాలకుపైగా విస్తీర్ణంలో మినుము వేశారు. కర్లపాలెం మండలంలో 300 హెక్టార్లలో ఇనుము, పెసర పైర్లు సాగుచేశారు. అపరాలకు మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉండటం, మద్ధతు ధర ఆశాజనకంగా ఉండటంతో రైతులు మొక్కజొన్న, జొన్నలకు బదులుగా మినుముసాగుపై ఆసక్తి కనబర్చారు. ప్రస్తుతం పంట 50-60 రోజుల దశలో ఉంది. ఈ సమయంలో పంటకు పల్లాకు తెగులు సోకింది. మొక్కలు పిచ్చి తలలు వేసి కాపు లేకపోవడం, ఆకులు పసుపు వర్ణంలోకి మారి, ఎండుదశకు చేరడంతో ఏం చేయాలో తెలియక రైతులు సతమతమవుతున్నారు.
ముందు జాగ్రత్తే మేలు..
పల్లాకు తెగులు రాకుండా రైతులు ముందు జాగత్తలు తీసుకోవాలని, తెగులు సోకిన పంటపై ఎన్ని మందులు పిచికారీ చేసినా ప్రయోజనం ఉండదని వ్యవసాయశాఖ నిపుణులు చెబుతున్నారు.పల్లాకు తెగులు తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. తెల్లదోమను నివారిస్తే తెగులు సోకే అవకాశం తక్కువ. దీని నివారణకు ఎసిఫేట్ 1.5గ్రా మందును లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి. విత్తిన 15 రోజులు తర్వాత దోమ నివారణకు మందు పిచికారి చేయాలి. ఈ మందును వేపనూనెలో కలిపి పిచికారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
పల్లాకు తెగులును తట్టుకునే పీవీ 31, ఎల్‌పీజీ 752 రకాలు వంగడాలు సాగు చేసుకోవాలి. తెగులు ఆశించిన మొక్కలను తొలిదశలోనే గుర్తించి, వాటిని తొలగించి దూరప్రాంతాలలో పడవేసి తగులబెట్టాలి. పల్లాకు తెగులు ఎక్కువగా ఉంది...
మినుము పైరులో పల్లాకు తెగులు ఎక్కువగా ఉంది. మొక్కలు పిచ్చి తలలు వేసి పూత పిందె వేయటం లేదు. ఎకరానికి రెండు మూడు బస్తాలు కూడా దిగుబడి వచ్చేలా లేదు. పురుగు మందులు పిచికారీ చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు.
- ఆట్ల నాగేశ్వరరెడ్డి, రైతు ఎం.వి.రాజుపాలెం
అన్నదాతకు.. ఆశాభంగం
Published Sat, Jan 23 2016 3:06 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM
Advertisement
Advertisement