నక్కపల్లి(విశాఖ) : వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి రోడ్డుపై ఆటో కోసం వేచి చూస్తున్న అన్నాచెల్లెల్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వారిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ విషాద సంఘటన గురువారం విశాఖ జిల్లా నక్కపల్లిలో జాతీయరహదారి-16పై జరిగింది.
వివరాల్లోకి వెళ్తే.. తూర్పుగోదావరి జిల్లా తణుకు సమీపంలోని వేల్చూరుకు చెందిన నక్క మోహన్‌రావు, రమణమ్మ దంపతులకు నక్క రాజేష్(18), నక్క మహిమారత్నం(10) సంతానం. వీరు బతుకుదెరువు కోసం వైజాగ్‌లో ఎలుకల బోన్లు తయారు చేసి అమ్ముకుంటున్నారు. ఈ క్రమంలోనే గురువారం ఎలుకల బోన్లు అమ్మి తిరిగి ఇంటికి వెళ్లేందుకు తల్లితో కలిసి పిల్లలిద్దరూ ఆటో కోసం ఎదురుచూస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో అటువైపు వేగంగా వచ్చిన కారు పిల్లలిద్దరినీ ఢీ కొట్టి, రోడ్డుపై ఉన్న ఆటోను సైతం ఢీకొంది. ఈ ప్రమాదంలో అన్నా, చెల్లెలు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఆటోలో ఉన్న మరో ముగ్గురికి గాయాలయ్యాయి. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.