సంతోష్ మృతదేహం
రోడ్డు ప్రమాదంలో మృత్యువాత
మద్నూర్(జుక్కల్) : పెద్ద దిక్కు లేని అక్క కుటుంబానికి అండగా ఉండేందుకు వచ్చిన తమ్ముడు అర్ధాంతరంగా మృత్యువాత పడ్డాడు. ఎడ్ల బండిపై వెళ్తుండగా గుర్తు తెలియని ఢీకొట్టడంతో దుర్మరణం చెందాడు. ఈ ఘటన మద్నూర్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఎస్సై కాశీనాథ్, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. జుక్కల్‌కు చెందిన కౌలాస్‌వార్ సంతోష్ (28)కు భార్య, ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. మద్నూర్‌లో ఉండే అతని అక్క ఈరవ్వ భర్త మృతి చెందగా, ఆ కుటుంబానికి అండగా ఉండేందుకు భార్య, పిల్లలతో కలిసి మద్నూర్‌కు వచ్చాడు. మూడేళ్లుగా ఇక్కడే ఉంటున్న సంతోష్ వ్యవసాయ పనులు చేస్తున్నాడు.
రోజులాగే, ఆదివారం కూడా పొలానికి వెళ్లిన అతడు సాయంత్రం వేళ ఎడ్ల బండిపై తిరిగి వస్తుండగా, గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన సంతోష్‌ను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమివ్వగా, వారు వచ్చి మద్నూర్ ఆస్పత్రికి తరలించారు. సంతోష్ తలకు, ఛాతీకి తీవ్ర గాయాలు కాగా, రెండు కాళ్లు, చేతులు విరిగిపోయి తీవ్ర రక్తస్రావం కావడంతో వైద్యులు నిజామాబాద్ ఆస్పత్రికి రిఫర్ చేశారు. దీంతో అతడ్ని నిజామాబాద్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. అక్కకు చేదోడువాదోడుగా ఉందామని వచ్చి, ఇలా మృతి చెందడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. సంతోష్ మృతితో రెండు కుటుంబాలు పెద్ద దిక్కు కోల్పోయాయని విలపించారు. కేసు దర్యాప్తులో ఉంది.