ప్రేమ కోసం బలైన ఓ‘లేడి’కూన
బాపట్ల (గుంటూరు): ప్రేమ మధురమైనదని.. ప్రేమే జీవితమని.. ప్రియుడు తోడే ప్రపంచమని భావించిన ఆ యువతి చివరకు ఆ ప్రేమను పొందలేక తనకుతానే మరణశిక్ష విధించుకున్న ఉదంతం కన్నవారి కడుపు కోతను మిగిల్చింది. బాపట్ల వ్యవసాయ కళాశాలలో బీఎస్సీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న.. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన మీసాల సాయితేజస్విని (19) ప్రేమికుల రోజుకు రెండు రోజుల ముందే మృత్యువును ఆశ్ర యించింది.
బుధవారం రాత్రి ఒంటిగంట వరకు ఫోన్‌లో ప్రియుడుతో సంభాషించి ఆ యువతి గురువారం ఉదయం 10గంటలకు మృత్యువాతపడింది. కిట్టు ఆలియాస్ యోగేశ్వరరావుతో ఆ యువతి ఫోన్ సంభాషణల రికార్డులను పోలీసులు, కళాశాల యాజమాన్యం పరిశీలించాయి. ఎస్‌ఎంఎస్‌లో ప్రియుడి నుంచి నిర్దేశించిన సమయంలోపు ఫోన్ రాకపోతే తరువాత తనతో మాట్లాడేందుకు అవకాశం ఉండదని స్పష్టంగా తెలిపినట్టు సమాచారం. తనకు తానే ప్రేమ కోసం శిక్షించుకున్న ఆ ‘లేడి’కూనను చూసి సాటి విద్యార్థినులు బావురమన్నారు.
పుట్టిన రోజు బట్టలే.. పుట్టికి ఉపయోగపడ్డాయి
సాయితేజస్విని చనిపోయిన సమాచారం తెలుసుకుని పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు నుంచి వచ్చిన తల్లిదండ్రులు భాస్కరరావు, వెంకటలక్ష్మి, సోదరుడు పవన్ బోరున విలపించారు. ఈనెల 22న తన పుట్టిన రోజు కోసం తల్లిదండ్రులతో కలిసి తాను ఎంతో ముచ్చటపడి కొనుగోలు చేసిన దుస్తులు చివరకు ఆ యువతి పుట్టికి ఉపయోగపడ్డాయి. ఈనెల 7న కొవ్వూరులో జరిగిన పెళ్లికి హాజరైన సాయితేజస్వితో మధుర సృ్మతులను తండ్రి భాస్కరరావు గుర్తుచేసుకుని విలపించిన తీరు చూపరులను కలచివేసింది.