చిత్తూరు కార్పొరేషన్‌తో పాటు మదనపల్లె, పుత్తూరు, పలమనేరు, పుంగనూరు, శ్రీకాళహస్తి, నగరి మున్సిపాల్టీల్లో మొదటి రోజు జాతీయ పార్టీలు అయిన కాంగ్రెస్, బీజేపీ నుంచి ఒక్కనామినేషన్ కూడా వేయలేదు. రెండవ రోజు చిత్తూరులో కాంగ్రెస్ తరపున రెండు నామినేషన్లు వేశారు.
ఆరు మున్సిపాల్టీల్లో 169 వార్డులకు, చిత్తూరులో 50 డివిజన్లకు ఎన్నికలు నిర్వహిస్తుండగా అభ్యర్థులు ప్రాంతీయ పార్టీల వైపు చూస్తున్నారు. ప్రధానంగా వైఎస్సార్ సీపీ, టీడీపీ టిక్కెట్లకు డిమాండ్ ఉంది. ఈ రెండు పార్టీల్లో టిక్కెట్లు దొరకని వారు స్వతంత్రంగా బరిలో దిగేందుకు సిద్ధపడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ టిక్కెట్టు కోసం ఎవరూ ఆసక్తి చూపటం లేదు.
పత్తాలేని మున్సిపల్ కో-ఆర్డినేటర్లు
పీసీసీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణ మున్సిపాల్టీ ఎన్నికల కోసం నియమించిన కో-ఆర్డినేటర్లు ఇప్పటి వరకు పత్తాలేరు. కాంగ్రెస్ పార్టీ తరపున కౌన్సిలర్లుగా, కార్పొరేటర్లుగా నిలిచేందుకు ఎవరూ ముందుకు రాలేదు. చిత్తూరులో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న సీకే.బాబు రాజీనామా చేయడంతో ఇక్కడ కాంగ్రెస్ చుక్కానిలేని నావలా మారింది.
మదనపల్లె మున్సిపాల్టీలో షాజహాన్‌బాష వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ తరపున పోటీ చేయాలనే దానిపై తర్జనభర్జన పడుతున్నారు. ఇక్కడ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పట్ల మైనార్టీలు ఆసక్తి చూపడం లేదు. ఇక శ్రీకాళహస్తి, పుత్తూరు, పుంగనూరు మున్సిపాల్టీల్లో సరేసరి.
బీజేపీకి గడ్డు పరిస్థితి
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మోడి ఫీవర్‌తో నెట్టుకురావాలని చూసిన బీజేపీకి ఎదురుదెబ్బ తగులుతోంది. చిత్తూరు కార్పొరేషన్‌లో అన్ని డివిజన్లకు అభ్యర్థులను పెట్టగలిగే పరిస్థితి కనిపించడం లేదు. ఈ పార్టీ తరపున పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. మున్సిపాల్టీల్లోనూ అక్కడక్కడా ఒకటీ అరా నామినేషన్లు వేయడం మినహా ఇంతవరకు బీజేపీ అభ్యర్థిత్వాల కోసం ఆశావహులు ఎవరూ పరుగులు దీయడం లేదు. బీజేపీ తరపున నిలబడితే ఉపయోగం లేకపోగా, తామే ఆ పార్టీ ప్రచారానికి ఉపయోగపడాల్సి వస్తుందని అభ్యర్థులు వెనుకంజ వేస్తున్నారు.