ఏపీకిచ్చిన హామీలన్నీ అమలు చేసేశాం
ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి జవాబు
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేశామని కేంద్రం స్పష్టం చేసింది. ఏపీకి కొత్తగా చేయాల్సిందేమీ లేదని కూడా తేల్చి చెప్పింది. బుధవారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వై.ఎస్. అవినాశ్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్ర ప్రణాళిక శాఖ సహాయ మంత్రి రావు ఇందర్‌జిత్‌సింగ్ ఈ విషయం తేటతెల్లం చేశారు. ఈమేరకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ప్రత్యేక ప్యాకేజీకి ఇదివరకే చట్టబద్ధత ఉందని వెల్లడించారు. ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014లో పొందుపరిచిన హామీలకు అనుగుణంగా కేంద్ర ఆర్థిక శాఖ 2016 సెప్టెంబర్ 8న ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించింది.
పెట్టుబడుల భత్యం, తరుగుదలకు సంబంధించిన రాయితీల విషయం ఇదివరకే చట్టంలో ఉందని ప్రత్యేక ప్యాకేజీలో ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం పునర్వ్యవవస్థీకరణ చట్టంలో ఆంధ్రప్రదేశ్‌కు కొన్ని హామీలు పొందుపరిచింది. 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల ద్వారా మరికొన్ని ప్రయోజనాలు సమకూరుతాయి. రాజధాని కోసం ప్రత్యేక ఆర్థిక సాయం, వెనకబడిన జిల్లాల అభివృద్ధికి నిధులు, పోలవరం సాగునీటి ప్రాజెక్టు, విద్యా సంస్థలు, ఇతర సంస్థలు, విమానాశ్రయాలు, రెవెన్యూ లోటు భర్తీ ఈ హామీల్లో ముఖ్యమైనవి. కేంద్ర ప్రభుత్వం ఈ హామీలన్నింటినీ సమర్థంగా పరిష్కరించింది. కొత్తగా చేయాల్సిందేమీ లేదు. వెనుకబడిన జిల్లాల జాబితాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకా పంపలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అర్హత కలిగిన వెనుకబడిన జిల్లాలను గుర్తించి, తరువాత కేంద్రం నోటిఫై చేసినప్పుడు అవి అమల్లోకి వస్తాయి’’ అని కేంద్ర మంత్రి పేర్కొన్నారు.