సాక్షి, ఏలూరు: జన్మభూమి-మన ఊరు కార్యక్రమాన్ని గురువారం నుంచి జిల్లాలో ఘనంగా నిర్వహించేందుకు యంత్రాంగం సిద్ధమైంది. 14 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. తొలిరోజు అన్ని జిల్లా, నియోజకవర్గ, మండల కేంద్రాల్లో జన్మభూమి-మన ఊరు కార్యక్రమంపై అవగాహన ర్యాలీలు నిర్వహిస్తారు. ఎన్టీఆర్ సుజల స్రవంతి పథకం ద్వారా నియోజకవర్గానికి ఒకటి చొప్పున వాటర్ ప్లాంట్ ప్రారంభించనున్నారు. ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి ర్యాలీల్లో పాల్గోనున్నారు. ఇప్పటికే అందరికీ అధికారిక ఆదేశాలు అందాయి. దీంతో ప్రతి ప్రభుత్వ విభాగంలో బుధవారం అధికారులు, సిబ్బంది ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి ఏర్పాట్లపై సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి టక్కర్ బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌తో సహా అధికారులంతా హాజరయ్యారు. తహసిల్దార్లను సైతం వీడియో కాన్ఫరెన్స్‌కు అందుబాటులో ఉంచారు. జన్మభూమి కార్యక్రమం విజయవంతానికి టక్కర్ పలు సూచనలు ఇచ్చారు. అనంతరం తహసిల్దార్‌లతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
విజయదశమి విరామం
కార్యక్రమం ప్రారంభమైన మరుసటి రోజు (3వ తేదీ) విజయదశమి సెలవు కావడంతో ఆ రోజు కార్యక్రమాలకు విరామం ఇచ్చి తిరిగి 4న మొదలుపెట్టనున్నారు. నవంబర్ 20 వరకు నిర్విరామంగా (ఆదివారం మినహా) నిర్వహించేందుకు మునిసిపల్, మండలస్థాయిలో అధికారులు షెడ్యూల్‌ను రూపొందించారు.పంచాయతీరాజ్, అర్భన్ డెవలప్‌మెంట్ విభాగాలు ఈ కార్యక్రమం నిర్వహణ బాధ్యతలు నిర్వర్తిస్తాయి. ప్రతిరోజు మండలంలోని రెండు గ్రామాల్లో రెండు బృందాలు కార్యక్రమాన్ని నిర్వహిస్తాయి. జిల్లాస్థాయిలో ప్రత్యేకాధికారిగా బి.శ్యాంబాబు, ఇన్‌చార్జిగా కలెక్టర్ కె.భాస్కర్, జిల్లా పంచాయతీ అధికారి ఎ.నాగరాజువర్మ సహాయకారిగా వ్యవహరిస్తారు. మున్సిపాలిటీల్లో కమిషనర్లు, మండలస్థాయిలో ఎంపీడీవోలు ఇన్‌చార్జిలుగా ఉంటారు.
కార్యక్రమం జరిగేదిలా..
‘మా తెలుగుతల్లి’ గీతంతో మొదలుపెట్టి జన్మభూమి-మా ఊరు’ కార్యక్రమంపై ముఖ్యమంత్రి సందేశాన్ని చదివి వినిపిస్తారు. ఉదయం సమయంలో ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్లు, ఐదు క్యాంపెయిన్లపై దృష్టిసారిస్తారు. అనంతరం పింఛన్లు పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం భోజన విరామం అనంతరం విద్యుత్ సరఫరాపై చర్చిస్తారు. వైద్య శిబిరాలు నిర్వహిస్తారు. సాయంత్రం ఆ ప్రాంతానికి సంబంధించిన పూర్తి వాస్తవ సమాచారంతో విజన్ డాక్యుమెంట్ తయారుచేస్తారు.
నేటి నుంచి ‘జన్మభూమి-మన ఊరు’
Published Thu, Oct 2 2014 2:07 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM
Advertisement
Advertisement