90 రోజుల్లో సమగ్ర స్క్రీనింగ్‌: సీఎం జగన్‌ | CM YS Jagan Review Meeting On Corona Control Measures | Sakshi
Sakshi News home page

కరోనా నియంత్రణపై సీఎం వైఎస్ జగన్ సమీక్ష

Published Mon, Jun 22 2020 3:27 PM | Last Updated on Mon, Jun 22 2020 7:24 PM

CM YS Jagan Review Meeting On Corona Control Measures - Sakshi

సాక్షి, అమరావతి: ‘104’ వాహనాల ద్వారా రాష్ట్రంలో ప్రతి కుటుంబ ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని అధికారులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. కరోనా నియంత్రణ చర్యలపై సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష జరిపారు. ఈ సమావేశానికి మంత్రి ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్‌, వైద్య, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి జవహర్‌రెడ్డి, నోడల్ ఆఫీసర్ కృష్ణబాబు హాజరయ్యారు. 90 రోజుల్లో సమగ్ర స్క్రీనింగ్‌కు సీఎం ఆదేశించారు. ‘104’ వాహనాల్లో కోవిడ్‌ శాంపిల్‌ సేకరణ సేకరించాలని తెలిపారు. షుగర్‌, బీపీ లాంటీ వాటికి పరీక్షలు చేయడంతో పాటు అక్కడే మందులివ్వాలని సూచించారు. అవసరమనుకున్న వారిని పీహెచ్‌సీకి రిఫర్ చేయాలన్నారు. ‘104’ సిబ్బందితో పాటు, ఏఎన్‌ఎంలు, ఆశావర్కర్లు, వాలంటీర్లను అనుసంధానం చేసి ప్రతినెలలో ఒక రోజు తప్పనిసరిగా అన్ని గ్రామాలకు ‘104’ వాహనం వెళ్లాలన్నారు. ప్రస్తుతం చేస్తున్న కోవిడ్‌ పరీక్షల్లో హేతుబద్ధమైన, పటిష్టమైన వ్యూహాన్ని అనుసరించాలని సీఎం పేర్కొన్నారు. (సీఎం వైఎస్‌ జగన్‌పై పెరిగిన ప్రజామద్దతు)

నిర్దేశించిన విధానాన్ని బలోపేతం చేయాలి
‘‘కంటైన్‌మెంట్‌ జోన్లలో 50 శాతం, మిగతా చోట్ల 50 శాతం కోవిడ్‌ పరీక్షలు నిర్వహించాలి. కొన్ని పరీక్షలు సెల్ఫ్‌ రిపోర్టింగ్‌ చేసుకునేవారికి కేటాయించాలి. ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చేవారికి వారికి కోవిడ్‌ పరీక్షలు చేయాలి. అలాగే వైరస్‌ వ్యాపించడానికి అవకాశం ఉన్న ఇతర రంగాల్లో పరీక్షలు చేయాలని’’ సీఎం జగన్‌ ఆదేశించారు. ఒక వ్యక్తికి కరోనా సోకిందన్న అనుమానం రాగానే, ఏం చేయాలన్న దానిపై ఇప్పటివరకు నిర్దేశించిన విధానాన్ని బలోపేతం చేయాలన్నారు. లోకల్‌ ప్రోటోకాల్‌ ను రూపొందించి, ప్రతి ఇంటికీ వెళ్లినప్పుడు ఎస్‌వోపీని ఆ ఇంటికి తెలియజేయాలన్నారు. అలాగే టెలిఫోన్‌ నంబర్‌ కూడా ఇవ్వాలని సీఎం సూచించారు. (నాన్నే నాకు స్ఫూర్తి : సీఎం వైఎస్‌ జగన్‌)

ప్రతి ఇంటికి అవగాహన కల్పించాలి
‘‘రాబోయే 90 రోజుల్లో ప్రతి ఇంటికీ అవగాహన కల్పించి, నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలి. ప్రతి పీహెచ్‌సీలో కోవిడ్‌ శాంపిల్‌ కలెక్షన్‌ సెంటర్‌ ఉండాలి. కరోనా సోకినట్లు నిర్ధారణ అయితే ఏం చేయాలన్న దానిపై ప్రతి గ్రామ సచివాలయంలో కూడా ఒక హోర్డింగ్‌ పెట్టి అందులో వివరాలు ఉంచాలి. అందులో ఫోన్‌ నంబర్, ఎవర్ని సంప్రదించాలి, పరీక్షలకు ఎక్కడకు వెళ్లాలన్న కనీస వివరాలు ఉంచాలి. సబ్‌ సెంటర్లు వచ్చిన తర్వాత ప్రతి గ్రామస్థాయిలోకూడా వైద్య సేవలు అందుతాయి. పట్టణ ప్రాంతాల్లో జనాభాను దృష్టిలో ఉంచుకుని అర్బన్‌ హెల్త్‌ సెంటర్లను ప్లాన్‌ చేయాలి. అర్బన్‌ ప్రాంతాల్లో కోవిడ్‌ నివారణకు ప్రత్యేక వ్యూహాన్ని తయారు చేయాలి. అర్బన్‌ ప్రాంతాల జనాభా ప్రాతిపదికన, అవసరమైన ప్రాంతాల్లో అర్బన్‌ హెల్త్‌సెంటర్‌ ఏర్పాటు చేయాలని’’ సీఎం పేర్కొన్నారు.

వైద్య ఆరోగ్య శాఖలో రిక్రూట్‌మెంట్‌పై సీఎం ఆరా
వర్షా కాలంలో జ్వరాలు ఎక్కువగా వస్తాయని, సన్నద్ధంగా ఉండాలని అధికారులకు  సీఎం ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖలో రిక్రూట్‌మెంట్‌పై సీఎం ఆరా తీశారు. కేసులు అధికంగా ఉన్న ప్రాంతాల్లో అవగాహన, ప్రచారాన్ని బాగా పెంచాలన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి రిపోర్టు చేసేలా ఉండాలని, వీటికి సమీప ప్రాంతాల్లో టెస్టింగ్‌ సదుపాయం, మెడికేషన్‌ అందుబాటులో ఉంచాలన్నారు. శానిటేషన్‌పైన కూడా దృష్టి పెట్టి, ప్రజలకు అవగాహన కలిగించేలా హోర్డింగ్స్‌ పెట్టాలని తెలిపారు. 1.42 కోట్ల ఆరోగ్య కార్డుల్లో 1.20 కోట్ల పంపిణీ పూర్తి అయ్యాయని, మిగతా పంపిణీ కూడా పూర్తి చేయాలన్నారు. అనంతరం ప్రతి మనిషి ఆరోగ్య వివరాలను ఆరోగ్య కార్డులో నమోదు చేయాలని సీఎం ఆదేశించారు. 104, 108 కొత్త వాహనాలు జులై 1కి ప్రారంభమవుతాయన్నారు. ఆరోగ్యశ్రీ కిందకు కోవిడ్‌ను తొలిసారిగా తీసుకువచ్చింది మనమేనని తెలిపారు. మనుషులకైనా, పశువులకైనా, ఆక్వారంగంలో వినియోగించే ఔషధాలకైనా  డబ్ల్యూహెచ్‌వో, జీఎంపీ ప్రమాణాలు ఉండాలని, ఈ మేరకు ఉత్తర్వులు జారీచేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement