సర్వే జాబితాలు గజిబిజి
- గందరగోళానికి గురవుతున్న రాజధాని ప్రాంత గ్రామాలు
- ఇంటి నంబర్లు లేదా పేర్లు వారీగా ప్రచురించాలని డిమాండ్
- ఆ తరువాతే అభ్యంతరాలు స్వీకరించాలని అధికారులకు విన్నపం
మంగళగిరి : రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ) నిర్వహించిన సామాజిక ఆర్థిక సర్వే జాబితాలు రైతులను గందరగోళానికి గురిచేస్తున్నాయి. ఆ జాబితాలో తమ వివరాలు అర్థం కాక అయోమయానికి గురవుతున్నారు. కొద్ది రోజులు కిందట సీఆర్‌డీఏ రాజధాని ప్రాంతంలో సామాజిక ఆర్థిక సర్వే నిర్వహించింది.
ఆ జాబితాలను ఆయా పంచాయతీ కార్యాలయాల నోటీసు బోర్డుల్లో ఉంచింది. దీనిపై ఈ నెల 18 వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నారు. ఇందుకోసం ఆయా గ్రామస్తులు పంచాయతీ కార్యాలయాలకు వెళ్లి తమ వివరాల కోసం జాబితాల్లో ప్రయత్నించగా, అవి తికమకగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్వే జాబితాలో రైతులు తమ పేర్లు సరి చూసుకోవాలంటే ఒక్కొక్కరికి నెల సమయం కావాలని పంచాయతీ కార్యదర్శులే వ్యాఖ్యానిస్తున్నారంటే ఆ జాబితాలు ఎంత గందరగోళంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు.
ఇంటి నంబర్లు, లేదా అక్షర క్రమంలో పేర్లు ప్రకటించినా సరిచూసుకునేందుకు సులువుగా వుండేది. ఇలా కాకుండా, ఒకే కుటుంబానికి సంబంధించిన వివరాలు వేర్వేరు చోట్ల ఉండడం గందరగోళానికి గురిచేస్తోంది. దీంతో అంత సమయం కేటాయించలేక గ్రామస్తులు వెనుదిరిగి వెళుతున్నారు. సర్వేకు సంబంధించి ఒక్కో గ్రామానికి నాలుగైదు బుక్‌లెట్‌లను తయారు చేసి పంచాయతీ కార్యాలయాలలో ఉంచారు. ఇవి కూడా ఓ ఇంటి నంబర్ నుంచి మరో ఇంటి నంబర్ వరకు ఓ బుక్‌లెట్ అనే విధానం కానీ, అక్షర క్రమం కానీ లేకపోవడంతో ఏ బుక్‌లెట్‌లో తమ పేరు వుందనేది చూసుకోవడానికే గంటల సమయం పడుతుంది.
రోజుకు పది మంది కూడా పేర్లు సరి చూసుకోవడానికి ఇబ్బందులు పడుతుంటే 18వ తేదీలోపు అభ్యంతరాలు ఎలా తెలియజేస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అంతేకాక భవిష్యత్‌లో ప్రభుత్వం రాజధాని గ్రామాలకు ఏ పథకం కేటాయించినా సర్వే జాబితా ఆధారంగానే వర్తింపచేసే అవకాశం ఉండడంతో రైతులు, కౌలు రైతులు,రైతు కూలీలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సర్వే జాబితాలను ఇంటి నంబర్ల ఆధారంగా లేదా పేర్లు వరుస క్రమంలో తయారు చేసి ప్రకటించాలని, ఆ తరువాత అభ్యంతరాలకు సమయం ఇవ్వాలని కోరుతున్నారు.