నాయీ బ్రాహ్మణులను ఎస్సీ జాబితాలో చేరుస్తామంటూ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు నిలబెట్టుకోవాలని నాయీ బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధరణికోట లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. గురువారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తమ సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కోరారు.
రెండేళ్లుగా నాయీ బ్రాహ్మణ ఫెడరేషన్ పాలకవర్గాన్ని నియమించడం లేదని చెప్పారు. తక్షణమే పాలకవర్గాన్ని నియమించి రూ.100 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అలాగే దేవస్థానాల్లో క్షౌరవృత్తి చేసే వారిని నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో సంఘం గౌరవాధ్యక్షుడు ఎన్.శివశంకరరావు, ప్రధాన కార్యదర్శి ఎ.బాబ్జి, అమర్‌బాబు, పి.వెంకటేశ్వర్లు, యువజన నాయకుడు అట్లూరి సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.