గోదావరి డెల్టాలో రబీ వరి రైతుల నీటి కష్టాలు మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వరి చేలు పాలుపోసుకుంటున్నందున నీటి విడుదల పెంచాల్సి వస్తుంది. మరోవైపు ఎండలు పెరుగుతున్నందున ఆవిరయ్యే నీటి పరిమాణమూ పెరిగే అవకాశముండడంతో చేలకు తరచూ తడులు పెట్టాల్సి ఉంటుంది. ఈ సమయంలో సీలేరు నుంచి నీటి విడుదల క్రమంగా తగ్గుతుండడం రైతులను, అధికారులను కలవరానికి గురి చేస్తోంది.
అమలాపురం : ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటి మట్టం క్రమేపీ తగ్గుముఖం పడుతోంది. మూడు రోజుల క్రితం 8,350 క్యూసెక్కులుగా ఉన్న ఇన్‌ఫ్లో శుక్రవారం సాయంత్రానికి 7,850 పడిపోయింది. దీనితో మూడు డెల్టాలకు నీటి విడుదలను తగ్గించారు. తూరుడెల్టాకు 2,500 క్యూసెక్కుల నుంచి 2,300కు, మధ్యడెల్టాకు 1,600 నుంచి 1,500కు, పశ్చిమ డెల్టాకు 4,250 నుంచి 4,050కి తగ్గించారు. అయితే ముందు ముందు నీటి రాక మరింత పడిపోయే ప్రమాదముంది. ఈనెల 20 నుంచి సీలేరు నుంచి వచ్చే నీటి పరిమాణం తగ్గుతోంది. వేసవి అవసరాల దృష్ట్యా ఏప్రిల్, మే నెలల్లో విద్యుత్ ఉత్పత్తి కోసం సీలేరు ప్రాజెక్టు అధికారులు ముందస్తు జాగ్రత్త తీసుకోవడంతో నీటి విడుదల ఇంతకన్నా పెరిగే అవకాశం లేదని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడున్న ఇన్‌ఫ్లోలో సీలేరు వాటా తీసివేయగా సహజ జలాలు బాగా తక్కువ కావడగం గమనార్హం. నీటి రాక తగ్గితే సాగునీటి ఇక్కట్లు పెరిగే అవకాశముంది.
తగు ప్రణాళిక లేకుంటే నష్టమే..
తూర్పు, మధ్యడెల్టాలతోపాటు పిఠాపురం బ్రాంచ్ కెనాల్ ఎగువ ప్రాంతాల్లో వరి చేలు పాలు పోసుకుంటున్నాయి. మధ్య, శివారు ప్రాంతాల్లో మరో పదిపదిహేను రోజుల్లో పాలుపోసుకునే దశకు వస్తాయి. ఈ సమయంలో చేలల్లో నీటిని 5 సెంటీమీటర్ల చొప్పున ఉంచుతారు. దీని వల్ల నీటి వినియోగం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం డెల్టా ప్రధాన పంటకాలువలకు 110 డ్యూటీ (ఒక క్యూసెక్కు 110 ఎకరాలకు చొప్పున) విడుదల చేస్తున్నారు. పాలుపోసుకునే దశలో కనీసం 90 డ్యూటీ చొప్పున విడుదల చేయకుంటే శివారు చేలకు నీరందదు. ఇప్పటికే శివారుల్లో చేలు ఎండిపోయే దుస్థితి నెలకొంది. పాలుపోసుకునే దశలో ఆశించిన స్థాయిలో నీరందించకుంటే ధాన్యం గింజల్లో తాలుతప్పలు ఎక్కువగా వచ్చే అవకాశమున్నందున రైతులు దిగుబడిని కోల్పోయే ప్రమాదముంది.
ఇప్పుడు డెల్టా కాలువలకు ఇస్తున్న 7,850 క్యూసెక్కులను కనీసం 10 వేలకు పెంచకుంటే రైతులు నీటి కోసం మరిన్ని పాట్లు పడాల్సి వస్తుంది. డెల్టాలో మూడు దశల్లో రబీ సాగు జరుగుతున్నందున రోజుకు 9 వేల నుంచి 10 వేల క్యూసెక్కుల మధ్య నెల రోజుల పాటు అందించాల్సి ఉంటుంది. పోనీ బ్యారేజ్ వద్ద నిల్వ ఉన్న నీటిని ఇస్తారా అంటే అక్కడ పాండ్ లెవెల్ తగ్గడం అధికారులను కూడా కలవరపరుస్తోంది. బుధవారం సాయంత్రానికి పాండ్ లెవిల్ 13.10 మీటర్ల నుంచి 13.05 మీటర్లకు పడిపోయింది.
శుక్రవారం సాయంత్రానికి ఇది 13.01కి తగ్గడం మరింత ఆందోళన కలిగిస్తోంది. పాండ్ లెవెల్ 12.05కు తగ్గితే పరిస్థితి మరింత దిగజారుతుంది. పాండ్ లెవెల్ తగ్గితే విడుదల చేసిన నీటిలో గ్రావిటీ తగ్గి శివారుకు చేరడం ఆలస్యమవుతుంది. సీలేరు నుంచి వచ్చే నీటిని పెంచడంతోపాటు సమర్థమెన నీటి యాజమాన్య పద్ధతులు పాటించకుంటే రబీలో డెల్టా రైతులు నష్టపోయే ప్రమాదముంది. అలాగే మార్చి 31 తరువాత కూడా నీటి సరఫరా చేయాల్సి ఉన్నందున తగు ప్రణాళిక సిద్ధం చేయకున్నా ఇదే పరిస్థితి నెలకొంటుంది.
సీలేరు నుంచి నీటి విడుదల ఇలా (క్యూసెక్కుల్లో)
18వ తేదీ : 5,219
19వ తేదీ : 4,930
20వ తేదీ : 5,900
21వ తేదీ : 4,300
22వ తేదీ : 3,800
23వ తేదీ : 3,975
24వ తేదీ : 4,113
25వ తేదీ : 4,100
26వ తేదీ : 4,031.62
నీటి కష్టాలు.. తడిసిమోపెడు
Published Sat, Feb 28 2015 12:22 AM | Last Updated on Sat, Sep 2 2017 10:01 PM
Advertisement
Advertisement