తరుముతున్న కరువు | Dry crops | Sakshi
Sakshi News home page

తరుముతున్న కరువు

Published Mon, Oct 6 2014 3:22 AM | Last Updated on Fri, Oct 19 2018 7:22 PM

తరుముతున్న కరువు - Sakshi

తరుముతున్న కరువు

అసలే అప్పుల బరువు.. ఆపై
 
ఎండిపోతున్న పంటలు మండుతున్న అన్నదాత గుండెలు
 
►  బ్యాంకు రుణాలు రాక ప్రైవేటు అప్పులు తెచ్చి సాగుచేస్తున్న వైనం
   తీరా పంటలు చేతికి వచ్చే సమయంలో రాష్ట్రంలో వర్షాలు మాయం
   అడుగంటిన భూగర్భ జలాలు.. బోర్లు, బావుల్లోనూ చుక్క నీరు లేదు
    కోస్తా, సీమల్లో ఎండలు భగభగ.. మాడుతున్న మెట్ట పంటలు
   పెట్టుబడులైనా దక్కే పరిస్థితి లేదు... అప్పులు చెల్లించే దారీ లేదు
    మాఫీ కాని బ్యాంకు రుణాలు.. తీర్చలేని ప్రైవేటు అప్పుల భారం
   తర్వాత పంటకు పెట్టుబడి కష్టమే.. మళ్లీ అప్పుల ఊబిలోకి రైతన్న

 
 
 కృష్ణవేణి పరవళ్లతో నాగార్జునసాగర్ ఆయకట్టుకు నీటిని విడుదల చేస్తున్నా దాహార్తితో ఉన్న పొలాలు ఎక్కువగా నీటిని పీల్చుకోవటంతో వరినాట్లు ఆలస్యంగా సాగుతున్నాయి. కాలువ చివరి భూములున్న రైతులు నీళ్ల కోసం రోజుల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
 
కృష్ణమ్మ ఉప్పొంగి ఈసారి శ్రీశైలం పూర్తిగా నిండింది. కానీ.. కరువుతో గొంతెండుతోన్న రాయలసీమకు మాత్రం నీరందడం లేదు. శ్రీశైలం నిండాక పోతిరెడ్డిపాడు నుంచి 44 వేల క్యూసెక్కుల నీటిని రాయలసీమకు తీసుకెళ్లడానికి అవకాశం ఉన్నా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది.
 
అన్నదాతకు ఇప్పుడు కష్టాల మీద కష్టాలు వచ్చిపడుతున్నాయి. ఇప్పటికే అప్పుల బరువుతో కుదేలవుతుండగా రైతన్నను కరువు తరుముకొస్తోంది. ఒకవైపు.. వ్యవసాయ రుణాలను సర్కారు మాఫీ చేస్తుందన్న ఆశలు నెరవేరలేదు. ఆ అప్పుల భారం, దానిపై అపరాధ వడ్డీ భారం పెరిగిపోతున్నాయి. మరోవైపు.. పాత అప్పులు తీరకపోవటంతో వ్యవసాయానికి బ్యాంకులు కొత్త అప్పులూ ఇవ్వట్లేదు. ఇంకోవైపు.. సర్కారు పంటల బీమా అయినా పైసా కూడా విదల్చలేదు. ఖరీఫ్ సాగు కోసం ప్రైవేటు వ్యాపారుల నుంచి రూ.ఐదు, రూ.పది వడ్డీకి అప్పులు తెచ్చుకుని పంటలు వేశారు. అవి చేతికి వస్తే.. తర్వాత సాగుకు పెట్టుబడులైనా వస్తాయని ఆశించారు. కానీ.. ఆ ఆశలు కూడా కరువు     కారణంగా ఆవిరైపోతున్నాయి. పంట చేతికొచ్చే దశలో వర్షాలు కనుమరుగవటంతో పంటలు ఎండిపోతున్నాయి. వర్షాలు లేకపోవడంతో భూగర్భ జలాలూ అడుగంటాయి. ఫలితంగా.. కాలువల ద్వారా పారుదల ఉన్న పొలాలు మినహా.. వర్షాధార పంటలు, బోర్లు, బావుల కింద సాగవుతున్న పైర్లకు తడి కట్టే పరిస్థితి లేకుండా పోయింది. ఈ పంటలు చేతికందకపోతే వాటి కోసం తెచ్చిన అప్పులు, వడ్డీలు తిరిగి చెల్లించే పరిస్థితీ ఉండదు. మళ్లీ సాగుకు పెట్టుబడి కోసం పైసా పుట్టే అవకాశమూ ఉండదు. వెరసి.. ఒకవైపు ఎప్పుడు మాఫీ అవుతాయో ఎంతవరకు మాఫీ అవుతాయో తెలియని బ్యాంకు రుణాలకు ఈ ప్రైవేటు అప్పుల భారం కూడా తోడై.. పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయే దుస్థితి దాపురించింది. ఇక ఏం చేయాలో దిక్కుతోచని దుస్థితిలో ఆంధ్రప్రదేశ్ రైతాంగం విలవిలలాడుతోంది.

ఎండిపోతున్న పంటలు...

రాష్ట్రంలోని వర్షాధారిత ప్రాంతాల్లో తొలకరింపుల తర్వాత సజ్జ, జొన్న, మొక్కజొన్న లాంటి మెట్ట పంట వేస్తారు. రెండు, మూడు మంచి వర్షాలు కురిస్తే.. పంట చేతికొచ్చినట్లే. ఈ ఏడాది తొలకరి సమయంలో వర్షాలు ఊరించడంతో మెట్ట పంటలను రైతులు పెద్ద ఎత్తున సాగుచేశారు. సజ్జ లాంటి పంటలకు పెట్టుబడులు కాస్తంత తక్కువే. సకాలంలో వర్షాలు కురిస్తే రైతు ఎకరాకు రూ. 15 వేల నుంచి రూ. 20 వేల వరకూ లాభం కళ్లజూసే అవకాశముంటుంది. ఈ రాబడినే తర్వాత వరికి పెట్టుబడిగా పెడతాడు. కానీ ఈ ఏడాది తొలకరి తర్వాత వర్షాలు లేకపోవడంతో మెట్ట పంటలు ఎండిపోతున్నాయి. లాభం సంగతి దేవుడెరుగు.. పైరుకు పెట్టిన పెట్టుబడైనా వచ్చే పరిస్థితీ కనిపించడం లేదు.
 
ఆవిరవుతున్న ఆశలు...

కంకి పట్టిన తర్వాత ఎండలు లేకుండా చల్లని వాతావరణం ఉంటే ఎంతో కొంత పంట చేతికొస్తుంది. కానీ.. రాయలసీమ, కోస్తా జిలాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఫలితంగా వర్షాకాలంలోనూ చినుకు రాలకపోవడంతో ఎండాకాలాన్ని తలపిస్తోంది. రాయలసీమలో సాధారణం కంటే కనీసం 5 డిగ్రీల సెంటీగ్రేడ్ అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కోస్తా జిల్లాల్లో 4 డిగ్రీల సెంటీగ్రేడ్ అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఎండ వేడిమి, ఉక్కపోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఎండల తీవ్రతకు కంకిపట్టిన పంట కూడా ఎండిపోతుంటే రైతులు విలవిల్లాడిపోతున్నారు. ఆఖరున ఏదో విధంగా కష్టపడి ఒక తడి కట్టాలని రైతులు ప్రయత్నిస్తున్నా.. భూగర్భ జలాలూ అడుగంటి, బావుల్లో చుక్కనీరు లేకుండా ఎండిపోవటంతో ఏమీ చేయలేని నిస్సహాయస్థితిలో పడిపోయారు. మెట్ట పంటల మీద పూర్తిగా ఆశలు వదులుకుంటున్నారు.
 
మళ్లీ అప్పుల ఊబిలోకి...

ఎన్నికలకు ముందు టీడీపీ హామీ ఇచ్చిన మేరకు పంట రుణాలు మాఫీ అయితే ఆర్థిక భారం నుంచి కొంతైనా బయటపడతామని రైతులు ఆశించారు. కానీ.. సర్కారు చ్చిన హామీ మేరకు బ్యాంకు రుణాల మాఫీ జరగక డిఫాల్టర్ల జాబితాలో చేరారు. ఆ రుణాలపై వడ్డీ భారమూ పెరుగుతోంది. ఈ రుణ మాఫీ వ్యవహారాన్ని సర్కారు ఇంతవరకూ కొలిక్కి తేలేదు. దీంతో బ్యాంకులు రైతులకు కొత్త పంట రుణాలు ఇవ్వట్లేదు. పైగా.. పాత రుణాలను ఐదేళ్లలో విడతల వారీగా మాఫీ చేస్తామని ప్రభుత్వం చెప్తోంది. ఎంతవరకూ మాఫీ అయితే అంత మొత్తం తిరిగి రైతులకు రుణాలు ఇచ్చేలా బ్యాంకులను ఒప్పిస్తామంటోంది. అది ఎంత మాఫీ అవుతుంది.. ఎప్పుడు మాఫీ అవుతుంది.. అపరాధ వడ్డీ సంగతి ఏమిటి.. బ్యాంకులు కొత్త రుణాలు ఇస్తాయా లేదా.. అన్నది ఇంకా అయోమయంగానే ఉంది. దీనిపై ఎప్పటికి స్పష్టత వస్తుందో తెలియని పరిస్థితి. ఎటొచ్చీ రుణాలు తీరే వరకూ వాటి భారం రైతుదే. మరోవైపు.. పంటల బీమా అయినా పైసా ఇవ్వలేదు. దీంతో ప్రైవేటు వడ్డీ వ్యాపారుల నుంచి భారీ వడ్డీలకు అప్పులు చేసి ఇప్పుడు పంటలు సాగు చేస్తున్నారు. కరువు కారణంగా ఈ పంటలు ఎండిపోతుండటంతో.. ఈ ప్రైవేటు అప్పులు చెల్లించే దారీ ఉండదు. ఒకవైపు బ్యాంకు రుణాలు, మరోవైపు ప్రైవేటు అప్పులు, ఈ రెండిటీపైనా వడ్డీలు.. రైతన్నపై భారం పెరిగిపోతుంది. ఖరీఫ్ ఆఖరులో వర్షాలు కురిస్తే.. వరి పంట సాగుకు మళ్లీ అప్పు చేయడం మినహా రైతుకు మరో దారిలేదు. దీంతో అన్నదాత మళ్లీ అప్పుల ఊబిలో కూరుకుపోయే పరిస్థితులు ప్రమాదఘంటికలు మోగిస్తున్నాయి.
 
((నోట్: బాక్స్))
 సాగర్ ఆయకట్టులో ఆలస్యంగా వరినాట్లు..

కృష్ణా నది ఎగువ ప్రాంతం, కర్నూలు జిల్లాలో భారీ వర్షాల వల్ల ఈ సంవత్సరం కృష్ణమ్మ పరవళ్లు తొక్కింది. ఫలితంగా కృష్ణా ప్రాజెక్టుల్లో నీరు పుష్కలంగా ఉంది. ప్రాజెక్టుల కింద నీళ్లు విడుదల చేస్తున్నా.. ఎండలు మండిపోతుండటంతో చివరి ఆయకట్టుకు నీరు సరిగా అందని పరిస్థితి నెలకొంది. ఒకపక్క ఎండలు మండిపోతుండడం.. పలు ప్రాంతాల్లో వారాల తరబడి వర్షాలు సమృద్ధిగా కురవకపోవడం వంటి కారణాలతో పంట భూములు తడవడానికే ఎప్పటి కంటే ఎక్కువ మొత్తంలో నీటిని పీల్చుకుంటున్నాయి. నాగర్జునసాగర్ ఆయకట్టు ప్రాంతంలో కాలువ ద్వారా నీటిని విడుదల చేస్తున్నప్పటికీ భూములు ఎక్కువగా నీళ్లు పీల్చుకుంటున్న కారణంగా వరినాట్లు ఆలస్యంగా సాగుతున్నాయి. కాలువ చివరిన భూములున్న రైతులు నీళ్ల కోసం రోజుల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక.. కృష్ణా నది ప్రాజెక్టుల నుంచి నీళ్లు అందే పట్టణాలు మినహా.. మిగతా పట్టణాల్లో తాగునీటికీ కరువు ఎర్పడింది. భూగర్భజలాలు అడుగంటడం, కుంటలు, వాగులు ఎండిపోవడంతో తాగునీటి సరఫరా పథకాలు నీళ్లు సరఫరా చేసే పరిస్థితులు లేకుండాపోతున్నాయి.
 .
 .
 ((నోట్: బాక్స్))
 కృష్ణమ్మ పరవళ్లున్నా.. సీమ గొంతు తడవని దైన్యం

 అదృష్టం కొద్దీ ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాల వల్ల ఈ ఏడాది కృష్ణానది పొంగి ప్రవహించింది. శ్రీశైలం జలాశయం పూర్తిగా నిండింది. వరద దాదాపు నెల రోజుల పాటు కొనసాగింది. కానీ.. కరువుతో గొంతెండుతోన్న రాయలసీమకు మాత్రం నీరందడం లేదు. శ్రీశైలం నుంచి మిగులు జలాలను రాయలసీమకు తరలించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. శ్రీశైలం నిండిన తర్వాత పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి 44 వేల క్యూసెక్కుల నీటిని రాయలసీమకు తీసుకెళ్లడానికి అవకాశం ఉంది. విద్యుత్ ఉత్పత్తి కోసం వినియోగించే మరో 4,500 క్యూసెక్కుల నీరు దీనికి అదనం. శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్ (ఎస్‌ఆర్‌ఎంసీ) ద్వారా మొత్తం 48,500 క్యూసెక్కుల నీటిని తీసుకెళ్లడానికి అవకాశం ఉన్నా.. పోతిరెడ్డిపాడు నుంచి నీళ్లు తెసుకెళ్లే కాలువల్లో చిన్న చిన్న పనులు పెండింగ్‌లో ఉండటం వల్ల ఏడెనిమిది వేల క్యూసెక్కులకు మించి నీటిని తీసుకెళ్లడానికి అవకాశం లేకుండా పోయింది. పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడానికి గరిష్టంగా రూ. 14 కోట్లు అవసరమని సాగునీటి శాఖ అధికారులు ఈ ఏడాది కూడా ప్రభుత్వానికి నివేదించారు. కానీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో సీమకు నీరందలేదు. ఫలితంగా కరువు కోరల నుంచి బయటపడే అవకాశాన్ని రాయలసీమ కోల్పోయింది.


(నోట్: బాక్స్)
 ఈ ఖరీఫ్‌లో వర్షపాతం లోటు 32 శాతం

 జూల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఖరీఫ్ సీజన్‌గా పరిగణిస్తారు. ఈ ఖరీఫ్‌లో ఆంధ్రప్రదేశ్‌లో సాధారణ వర్షపాతం కంటే 32.2 శాతం తక్కువగా నమోదయింది. ఈ ఏడాది ఖరీఫ్‌లో జిల్లాల వారీగా వర్షపాతం వివరాలివీ...
http://img.sakshi.net/images/cms/2014-10/61412546286_Unknown.jpg
 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 ఈ ఖరీఫ్‌లో పంటల సాగు ఇలా...

 రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్‌లో 14.82 లక్షల హెక్టార్లలో వరి, 16,119 హెక్టార్లలో జొన్న, 24,592 హెక్టార్లలో సజ్జ, 86,329 హెక్టార్లలో మొక్కజొన్న, 27,089 హెక్టార్లలో రాగి సాగు చేశారని వ్యవసాయ శాఖ లెక్కలు కట్టింది. జిల్లాల వారీగా సాగు విస్తీర్ణం (హెక్టార్లలో) వివరాలు ఇవీ...
http://img.sakshi.net/images/cms/2014-10/61412546356_Unknown.jpg
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement