సాపాటు లేదు..సాయం లేదు..
బియ్యం..నిత్యావసరాల ఊసులేదు
ఇస్తామన్న రూ.2 వేల జాడలేదు
పస్తులతో అలమటిస్తున్న ‘గంగపుత్రులు’
నిద్ర లేచింది మొదలు పొద్దుగుంకే వరకు సముద్రంతో సహజీవనం చేస్తారు. నడి సంద్రంలోకి వెళ్లి వేటాడటం.. తెచ్చిన మత్స్యసంపదను అమ్ముకోవడమే వీరికి తెలిసిన విద్య. వేటకెళ్తేనే వీరికి పూటగడుస్తుంది. వేటకెళ్లని నాడు పస్తులే. ఏటా ఏప్రిల్-మే నెలల్లో సంతానోత్పత్తి కాలంలో అమలులోకి వచ్చే వేటనిషేధం వీరి పాలిట ఆశని పాతమే అవుతుంది. ఇలాంటి సమయంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు పత్తాలేకుండా పోతే వీరి పరిస్థితి అగమ్య గోచరమే.
విశాఖపట్నం: విశాఖ మహానగరంతో పాటు జిల్లాలోని ఎనిమిది మండలాల్లో తీరం ఉంది. 134 కిలోమీటర్ల తీర ప్రాంతంలో 62 మత్స్యకార గ్రామాలున్నాయి. సుమారు లక్షా 20 వేల మంది మత్స్యకారులున్నారు. వీరిలో సుమారు 35వేలమంది పూర్తిగా చేపలవేటే జీవనోపాధిగా జీవిస్తున్నారు. 650 మెక నైజ్డ్ బోట్లు, 1500కు పైగా ఇంజన్ బోట్లు ఉన్నాయి. వందలాదిగా తెప్పలు,నావలు ఉన్నాయి. వేట నిషేధ సమయంలో మెకనైజ్డ్, ఇంజన్ బోట్లు లంగరేయాల్సిందే. మెకనైజ్డ్ బోటుపై 8 నుంచి 10 మంది, ఇంజన్ బోటుపై ఆరు నుంచి ఎనిమిది మంది వరకు మత్స్యకారులు పని చేస్తుంటారు. ఇక పరోక్షంగా మరో 10వేల నుంచి 15వేల మంది వరకు జీవనోపాధి పొందుతుంటారు. ప్రతీ ఏటా ఏప్రిల్-15వ తేదీ నుంచి మే-31వ తేదీ వరకు వేట నిషేధం అమలులో ఉండేది. గతేడాది వరకు 47రోజులు పాటు ఉండే వేటనిషేధ సమయాన్ని ఈ ఏడాది నుంచి ఏకంగా 61రోజులకు పెంచారు. గతంలో నిషేధ సమయంలో కుటుంబానికి 31 కిలోల బియ్యంతో సరిపెట్టేవారు. ఏటా నిషేధ సమయంలో జీవనోపాధి కోల్పోయే మత్స్యకారుల జాబితాలు మారుతుంటాయి. కొన్ని సార్లు పెరుగుతుంటాయి.. మరి కొన్ని సార్లు తగ్గుతుంటాయి.
అలాంటిది గతేడాది మంజూరైన సాయం ఈ ఏడాది పంపించడం.. ఈ ఏడాది సాయం వచ్చే ఏడాది పంచిపెట్టడం పరిపాటిగా మారిపోయింది. గతేడాది నిషేధ సమయంలో జీవనోపాధి కోల్పోయిన మత్స్యకారులకు నేటికీ బియ్యం పంపిణీ జరగలేదు. ఇక ఈ ఏడాది నుంచి నిషేధసమయం పెంచడంతో బియ్యం స్థానంలో నగదు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కుటుంబానికి రూ.2వేల చొప్పున వారి బ్యాంకు ఖాతాలోనే జమచేయనున్నారు. నిషేధం అమలు లోకి వచ్చిసగం రోజులు గడిచినా అది ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉంది. మెకనైజ్డ్, ఇంజన్ బోట్లపై ఆధారపడి జీవించే సుమారు ఐదువేల మంది మత్స్యకారులతో పాటు వీటిపై పరోక్షంగా ఆధారపడిజీవించే మరో 15వేల మంది మత్స్యకారులకు లబ్ధి చేకూర్చే విధంగా రూ.4కోట్లతో జిల్లా మత్స్యశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఆర్థిక లోటు కారణంగా ఈ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చలేదు. దీంతో సాపాటు లేక..సాయం లేక గంగపుత్రులు ఈ ఏడాది పస్తులతో అలమటించాల్సిన పరిస్థితి దాపురించింది.