నాలుగేళ్ల పాప కిడ్నాప్
సాక్షి, రాజమండ్రి :నాలుగేళ్ల పాప కిడ్నాప్ ఘటన బుధవారం రాజమండ్రిలో కలకలం సృష్టించింది. తల్లితండ్రుల్ని బెంబేలెత్తించి, పోలీసులను ఉరుకులు పెట్టించింది. చివరకు కిడ్నాపర్లు పాపను విడిచిపెట్టడంతో కథ సుఖాంతమైంది. పోలీసులు కిడ్నాప్‌కు దారితీసిన పరిస్థితులపై విచారణ ప్రారంభించారు. సీతానగరం జూనియర్ కళాశాలలో లెక్చరర్‌గా పనిచేస్తున్న పందిరి సదా సాంబశివరావు, రాజమండ్రి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాంట్రాక్టు లెక్చరర్‌గా పనిచేస్తున్న విజయలక్ష్మిల కుమార్తె మేఘన నగరంలోని హర్షవర్ధన ప్లే స్కూల్‌లో నర్సరీ చదువుతోంది. బుధవారం సాయంత్రం నాలుగున్నరకు ఇద్దరు యువకులు వచ్చి మేఘన తల్లితండ్రులు ఆ పాపను తీసుకురమ్మన్నారని చెప్పడంతో ఆయా సంబంధిత టీచర్ అనుమతి తీసుకుని పాపను వారితో పంపించింది. అలా తీసుకెళ్లిన వాళ్లు సాయంత్రం 5.10 గంటలకు ‘మీ అమ్మాయిని కిడ్నాప్ చేశాం. రూ.రెండు లక్షలు ఇస్తే విడిచి పెడతా’మని తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. కలవరపడ్డ వారు రాజమండ్రి క్రైం పోలీసులకు తెలిపారు. మీడియాకు, పోలీసులకు సమాచారమిస్తే పాపను చంపేస్తామని కిడ్నాపర్లు బెదిరించడంతో తల్లడిల్లిన వారు విషయాన్ని ప్రచారం చేయొద్దని మీడియాను వేడుకున్నారు.
విజయవాడ రమ్మని...
దుండగులు తల్లిదండ్రులకు చేసిన ఫోన్ కాల్స్ ఆధారంగా వారి ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నించారు. రైల్వేస్టేషన్ సమీపంలోని పాఠశాల నుంచి కిడ్నాపర్లు బాలికను జాతీయ రహదారి మీదుగా రావులపాలెం తీసుకువెళ్లినట్టు గుర్తించారు. ముందుగా రూ.రెండు లక్షలు అడిగిన దుండగులు తర్వాత తాడేపల్లిగూడెం నుంచి మరోసారి ఫోన్ చేసి కనీసం రూ.లక్షయినా ఇవ్వాలని, విజయవాడ బెంజ్ సర్కిల్ వద్దకు డబ్బులు తేవాలని కోరారు. పోలీసుల సూచనతో.. తల్లిదండ్రులు వారితో ఒప్పదం కుదుర్చుకుంటున్నట్టు మాట్లాడారు. రాత్రి 7.30 గంటలకు కిడ్నాపర్లు మళ్లీ ఫోన్‌చేసి పాపను నల్లజర్ల సమీపంలోని ప్రకాశరావుపాలెం వద్ద విడిచి వెళ్లినట్టు చెప్పి ఫోన్ పెట్టేశారు. అదే గ్రామంలో ఉన్న సాంబశివరావు బంధువులకు, అక్కడి పోలీసులకు వివరాలు తెలిపారు. ఈలోగా ఆందోళనలో చిక్కుకున్న పాప రోడ్డుపై వాహన చోదకులను ఆపి తనను అమ్మానాన్నల వద్దకు తీసుకువెళ్లాలని అభ్యర్థించింది. స్థాని కులు పాప వివరాలు తెలుసుకుంటుండగా సాంబశివరావు బంధువు ఓంకార్ అక్కడకు చేరుకుని అనంతపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
అయినవాళ్ల పనేనా..?
పాప కిడ్నాపర్లను ఉద్దేశించి ‘మామయ్య’ అని సంబోధిస్తుండడంతో ఇది కుటుంబంతో దగ్గర సంబంధాలు ఉన్న వ్యక్తులు చేసిన పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. విషయం పోలీసులకు, మీడియాకు తెలిసిపోవడంతో భయపడి, బంధువులు ఉన్న గ్రామంలో వదిలివేసినట్టు భావిస్తున్నారు. అర్బన్ ఎస్పీ హరికృష్ణ పాప ఆచూకీ ప్రయత్నాలను స్వయంగా పరిశీలించారు. క్రైం డీఎస్పీ త్రినాథరావు ఆధ్వర్యంలో సీఐ సత్యనారాయణ కేసు దర్యాప్తు చేపట్టారు. కాగా పాపను ఎవరు ఎందుకు కిడ్నాప్ చేశారో తల్లితండ్రులు కూడా చెప్పలేకపోతున్నారు.