సాక్షి,విజయవాడ : దసరా మహోత్సవాలకు ఇంద్రకీలాద్రి ముస్తాబైంది. అమ్మవారి దర్శనానికి రాష్ట్రం నలుమూలలు నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు. శనివారం నుంచి తొమ్మిది రోజుల పాటు పది అలంకారాల్లో అమ్మవారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రిని రంగురంగుల విద్యుత్తు దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు.
ఈ కాంతుల మధ్య అమ్మవారి స్వర్ణశిఖరం ధగధగలాడుతోంది. ఎన్టీటీపీఎస్ ఉద్యోగుల సమ్మె వల్ల కొండపై విద్యుత్తు దీపాలకు అంతరాయం కలగకుండా ఉండేందుకు ఆలయ అధికారులు భారీ జనరేటర్‌ను ఏర్పాటు చేశారు. ఇంద్రకీలాద్రికి చేరుకునే నలు దిక్కులా భారీ హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారు. జాతీయ రహదారిపై స్వాగత తోరణాలు కట్టారు.
సమైక్యాంధ్ర ఉద్యమం ఉధృతంగా సాగుతున్నప్పటికీ దుర్గమ్మ దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తారని ఆలయ అధికారులు భావిస్తున్నారు. ఆ అంచనాలతో సకల సౌకర్యాలు కల్పించారు. ఆనవాయితీ ప్రకారం శుక్రవారం సాయంత్రం నగర పోలీసు కమిషనర్ బి.శ్రీనివాసులు అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. వీటిని ఉత్సవాల తొలిరోజున అమ్మవారికి అలంకరిస్తారు.
తొమ్మిది రోజుల్లో పది అలంకారాలు
ఏటా దసరా ఉత్సవాలు పది రోజులు జరుగుతాయి. ఈ ఏడాది మాత్రం తొమ్మిది రోజుల్లోనే ముగుస్తాయి. శరన్నవరాత్రి ఉత్సవాల్లో అష్టమి రోజున దుర్గాదేవిగా, నవమి నాడు మహిషాసురుడ్ని చంపిన మహిషాసురమర్దనీదేవిగా అమ్మవారు దర్శనం ఇస్తారు. ఈసారి ఈ రెండు తిథులు ఒకే రోజు 12వ తేదీ శనివారం వచ్చాయి. దీంతో అదే రోజు ఉదయం దుర్గాదేవిగా, మధ్యాహ్నం నుంచి శ్రీ మహిషాసుమర్దనీదేవిగా అలంకరించనున్నారు. అంటే ఆ రోజు అమ్మవార్ని రెండు అలంకారాల్లో భక్తులు దర్శించుకోవచ్చు. ఆఖరు రోజున శ్రీ రాజరాజేశ్వరీ రూపంలో అమ్మవారు దర్శనమిస్తారు. ఇలా ఒకే రోజు రెండు తిథులు రావడం అరుదుగానే జరుగుతుందని పండితులు చెబుతున్నారు.
నేడు స్వర్ణకవచాలంకృత కనకదుర్గాదేవిగా దర్శనం
తొలిరోజున అమ్మవారు స్వర్ణకవచాలంకృత కనకదుర్గమ్మగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. మెలిమి బంగారపు వన్నే కలిగిన పట్టుచీర ధరించి చేతిలో త్రిశూలం ధరించి శిరస్సుపై సూర్యచంద్రులు, భుజాలపై శంకుచక్రాలతో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. తెల్లవారు జామున స్నపనాభిషేకం జరిపి అమ్మవారికి ప్రత్యేక అలంకారం చేస్తారు. అనంతరం ఉదయం అమ్మవారి ప్రధాన ఉత్సవమూర్తులను భవానీదీక్షా మండపానికి తీసుకుని వచ్చిన అనంతరం దర్శనానికి భక్తుల్ని అనుమతిస్తారు.
ప్రత్యేక బస్సులు
నగరంలో సమైక్య బంద్, ఉద్యమకారుల రాస్తారోకోలు, ధర్నాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో భక్తులు ఇంద్రకీలాద్రికి చేరుకోవడం కొంత కష్టమే. ఆర్టీసీ బస్సులు తిరగనందున ఆలయ అధికారులు భక్తుల కోసం ప్రత్యేకంగా ప్రైవేటు బస్సుల్ని ఏర్పాటు చేశారు. ఈ బస్సులను రైల్వేస్టేషన్ నుంచి కొండవరకూ నడుపుతారు.
నేటి నుంచి దసరా ఉత్సవాలు
Published Sat, Oct 5 2013 1:52 AM | Last Updated on Sat, Sep 29 2018 5:52 PM
Advertisement