సాక్షి, గుంటూరు: గుంటూరు నగరపాలకసంస్థ (జీఎంసీ) కార్యాలయం లో శనివారం ఒక్కసారిగా కలకలం రేగింది. ఏసీబీ అధికారుల మూకుమ్మడి రాకతో నగరపాలకసంస్థ ఉన్నతాధికారులు ఉక్కిరిబిక్కిరయ్యారు. నగరపాలకసంస్థ పూర్వ కమిషనర్ కె.వెంకటేశ్వర్లు హయాంలో జరిగిన అవినీతి, అక్రమాలపై ఏసీబీ అధికారులు దర్యాప్తును మమ్మురంచేశారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా ఏసీబీ ఆడిటర్లు, తూర్పు, పశ్చిమగోదావరి, గుంటూరు జిల్లాల ఏసీబీ ఉన్నతాధికారులు పెద్దఎత్తున రికార్డులు స్వాధీనం చేసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి... కమిషనర్‌గా కె.వెంకటేశ్వర్లు పనిచేసిన సమయంలో పెద్దఎత్తున అవినీతి, అక్రమాలు చోటుచేసుకున్నాయని, దీనిపై దర్యాప్తు జరిపించాలని హరిబా బు అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు.
దీనిపై విచారించిన హైకోర్టు రెండు నెలల్లో ద ర్యాప్తు పూర్తిచేసి నివేదిక అందజేయాలని ఏసీబీ, విజిలెన్స్ అధికారులను ఆదేశించింది. మూడు నెల లు గడుస్తున్నా దర్యాప్తులో ఎటువంటి పురోగతిలేదని హరి బాబు ఈనెల 10న మళ్లీ హైకోర్టును ఆశ్రయించాడు. ఏసీబీ అధికారులపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేయడంతోపాటు దర్యాప్తును వేగవంతంచేసి నివేదిక అందజేయాలని ఆదేశించిం ది. దీంతో హైదరాబాద్ నుంచి ఉన్నతాధికారుల పర్యవేక్షణలో ఏసీబీ ప్రత్యేక బృందాలు తొలుత గుంటూరు ఏసీబీ కార్యాలయంలో విచారణ జరిపించాలని నిర్ణయించినా రికార్డులు పరి శీలించడానికి అనువుగా ఉంటుందని నగరపాలకసంస్థలోనే దర్యాప్తును చేపట్టారు. వెంకటేశ్వర్లు హయాంలో ఇంజినీరింగ్, ప్రజారోగ్యం, రెవెన్యూ, పట్టణ ప్రణాళికావిభాగాల్లో ఇప్పటికే గుంటూరు ఏసీబీ అధికారులు దర్యాప్తు చేశారు.
దీని ఆధారంగా ప్రత్యేక బృందాలు నగరపాలకసంస్థ ఉన్నతాధికారులను విభాగాల వారీగా పిలిపించి విచారించాయి. ఇంజినీరింగ్ విభాగంలో చెల్లింపులకు సంబంధించి చాలా అంశాలకు బిల్లులు లేవని గుర్తించారు. అభివృద్ధి పనులు, వాటర్ ట్యాంకర్ల వినియోగానికి నిధుల ఖర్చులో సైతం గోల్‌మాల్ జరిగినట్లు గుర్తించారు. నగరపాలకసంస్థ ఆడిటింగ్ విభాగం అధికారుల సహకారంతో ఏసీబీ ఆడిటింగ్ అధికారులు అన్ని విభాగాల ఫైళ్లను తనిఖీచేశారు. పట్టణ ప్రణాళికా విభాగంలో పెద్దఎత్తున అక్రమాలు జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.
ప్రధానంగా వెంకటేశ్వర్లు బదిలీకి ముందు 168 జీవోను ఉల్లంఘించి నిర్మించిన భవనాలకు సైతం ఆక్యుపెన్సీ సర్టిఫికెట్టు ఆయన మంజూరు చేసినట్లు గుర్తించారు. అనధికార నిర్మాణాలు, నిబంధనలు పాటించకుం డా కొన్ని భవనాలకు అనుమతులు మంజూరుచేసినట్లు గుర్తిం చారు. ఇందులో పెద్దఎత్తున సొమ్ము చేతులు మారినట్లు అనుమానిస్తున్నారు. ప్రజారోగ్యవిభాగంలోనూ అక్రమాలు జరి గినట్లు తేల్చారు. కొంతమంది కార్మికులు రెండు డివిజన్లలో పనిచేస్తున్నట్లు చూపించి నిధులు స్వాహాచేసినట్లు రికార్డుల్లో కనిపెట్టారు. రెవెన్యూ విభాగంలో గతంలో ఉన్న అధికారులు వెంకటేశ్వర్లుకు సహకరించి, నిబంధనలు పాటించకుండా పన్నులు విధించినట్లు తేల్చారు. మొత్తం 36అంశాలపై ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇంజినీరింగ్, పట్టణ ప్రణాళిక, రెవెన్యూ, అకౌంట్స్, ప్రజారోగ్యం, వాటర్‌ట్యాంకర్ల కాంట్రాక్టరు ఇలా ప్రతి అధికారిని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.
నేడు కొనసాగనున్న దర్యాప్తు
నగరపాలకసంస్థలో ఏసీబీ అధికారులు ఆదివారం సైతం దర్యాప్తును కొనసాగించనున్నారు. అన్ని విభాగాల ఉన్నతాధికారులను ప్రశ్నించిన ఏసీబీ అధికారులు ఆదివారం మరికొంతమందిని ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. దర్యాప్తులో రాజమండ్రి, ఏలూరు ఏసీబీ డీఎస్పీలు వెంకటేశ్వర్లు, వెంకటేశ్వరరావు, గుంటూరు ఏసీబీ సీఐలు నర్సింహారెడ్డి, సీతారాంలతోపాటు హైదరాబాద్ నుంచి ఏసీబీ ఆడిటర్‌లు పాల్గొన్నారు.
జీఎంసీలో ఏసీబీ దర్యాప్తు
Published Sun, Jul 13 2014 12:24 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement