జూలై 14 నుంచి 25 వరకు గోదావరి పుష్కరాలు
గోదావరి పుష్కరాలు వచ్చే సంవత్సరం జూలై 14 నుంచి 25వ తేదీ వరకు జరుగుతాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు తెలిపారు. 14వ తేదీ ఉదయం 6.26 గంటలకు పుష్కరాలు ప్రారంభం అవుతాయన్నారు. ఈ పుష్కరాల కోసం మొత్తం 254 రేవులు నిర్మిస్తామని, గోదావరి పరిసరాల్లో 327 దేవాలయాలను ఆధునికీకరిస్తామని ఆయన వివరించారు.
ఈ ఉత్సవాలకు మొత్తం 900 కోట్ల రూపాయలు ఖర్చుచేస్తామని, అందులో 600 కోట్లు కేంద్రం నుంచి సాయంగా అందుతాయని తెలిపారు. రాజమండ్రి, కొవ్వూరు ఘాట్-లలో గోదావరి తల్లికి మహాహారతి ఏర్పాటు చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బిజీగా ఉండటం వల్లే టీటీడీ బోర్డు నియామక ప్రక్రియ ఆలస్యం అవుతోందని మాణిక్యాలరావు చెప్పారు. ఇక శంషాబాద్ విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్కు ఎన్టీఆర్ పేరు పెట్టడం సమంజసమేనని, దీన్ని వ్యతిరేకించడం సరికాదని ఆయన అన్నారు.