ఇకపై గుడ్ మీల్స్ | good meals in govt.schools | Sakshi
Sakshi News home page

ఇకపై గుడ్ మీల్స్

Published Mon, Aug 5 2013 4:19 AM | Last Updated on Thu, Mar 28 2019 6:18 PM

good meals  in govt.schools

 సాక్షి, మంచిర్యాల : బీహార్ రాష్ట్రంలోని పాఠశాలలో విషతుల్య మధ్యాహ్న భోజనం తిని 22 మంది విద్యార్థులు చనిపోయిన సంఘటనతో రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచింది. దీంతో మన రాష్ట్రంలోని  పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని పకడ్బందీగా నిర్వహించాలని నిర్ణయించింది. ప్రస్తుతం వర్షాకాలం కాబట్టి పారి శుధ్యం లోపించి వ్యాధులు ప్రబలే అవకాశం ఉండటం తో పాఠశాల వాతావరణంపై ప్రత్యేక దృష్టి సారించిం ది. ఇకపై జిల్లాలోని అన్ని మండలాల ఎంఈవోలు, ఎంపీడీవోలు, ఈవోపీఆర్డీలు రోజు కనీసం ఒక పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనం రుచి చూడడంతోపాటు పాఠశాల, పరిసర ప్రాంతాల పారిశుధ్యంపై దృష్టిసారించాలని ఆదేశించింది. పక్షం  రోజులకోసారి నివేదిక  తెప్పించుకొని, తమకు పంపాలని పాఠశాల విద్యాశాఖ డీఈవోకు సూచించింది. పథక పర్యవేక్షణ బాధ్యత ఎంఈవోలపైనే ఉందని ఆ మేరకు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతోన్న విద్యార్థుల కోసం ప్రభుత్వం మద్యాహ్న భోజన పథకం అమలవుతోంది. జిల్లా వ్యాప్తంగా 3,913 స్కూళ్లల్లో 2,71,244 మంది విద్యార్థులు పధకం ద్వారా లబ్ధిపొందుతున్నారు.
 
 అమలు కాని నాటి జీవో..
 మధ్యాహ్న భోజన పథక పర్యవేక్షణకు సంబంధించి ప్రభుత్వం 10 మార్చి, 2011లో విడుదల చేసిన జీవో 21లో పలు సూచనలు చేసింది. కానీ అధికారుల అలసత్వం, ప్రభుత్వ ఉదాసీన వైఖరితో అమలుకు నోచుకో లేదు. బీహార్ సంఘటనపై సీరియస్ అయిన కేంద్ర ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకం అమలవుతున్న రాష్ట్రాల నుంచి నమూనాలు సేకరించి, ఆహార నాణ్యతను పరీక్షించాలని శాస్త్ర, పారిశ్రామిక పరిశోధన మండలిని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పకడ్బందీ చర్యలకు సిద్ధమైంది. నెలకోసారి మండల స్థాయిలో జరిగే స్టీరింగ్, మానిటరింగ్ కమిటీలో మధ్యాహ్న భోజనంపైనా చర్చించాలని సూచించింది.
 
 అధికారులు గమనించాల్సినవి..
     {పభుత్వ పాఠశాలల్లో పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.
     ఆహార ధాన్యాలు, పప్పు, ఇతర పదార్థాల నిల్వ, నాణ్యత  పరిశీలించాలి.
     ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంకును బ్లీచింగ్ పౌడర్‌తో శుభ్రం చేయించాలి.
     వంట వండే ముందు, తర్వాత వంట పాత్రలు శుభ్రంగా కడుగుతున్నారా? లేదా గమనించాలి.
     భోజన నిర్వాహకుల వ్యక్తిగత శుభ్రత కూడా చూడాలి.
     భోజనం తినే విద్యార్థుల వివరాలు, హాజరుశాతం, బియ్యం, బిల్లులు, విజిట్ చేసి రాసిన రిమార్క్స్ అన్ని రికార్డులు సక్రమంగా ఉండేలా చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement