కర్నూలు (టౌన్): ఐదు రూపాయలకే కడుపు నిండా నాణ్యమైన భోజనం అందిస్తామంటూ టీడీపీ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన అన్న క్యాంటీన్‌లు అందరి ఆకలి తీర్చడం లేదు. అసలు భోజనం టోకెన్ పట్టాలంటేనే గంటకుపైగా నిరీక్షించాల్సిన పరిస్థితి. అప్పటికీ అందరికీ టోకెన్లు ఇస్తారన్న గ్యారంటీ లేదు. దీంతో చాలా మంది క్యూలో నిల్చొని కూడా టోకెన్ అందక వెనక్కు వెళ్తున్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు టీడీపీ ప్రభుత్వం అన్న క్యాంటీన్లు ప్రారంభించింది. అధికారం చేపట్టిన తర్వాత నాలుగేళ్లు పట్టించుకోకుండా ఉండి ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఎట్టకేలకు పథకాన్ని పట్టాలెక్కించింది. అయితే డిమాండ్ మేరకు కాకుండా ప్రచారం కోసమే అన్నట్లు కొనసాగిస్తుండడం గమనార్హం. అందరికీ కాకుండా కొద్ది మందికి మాత్రమే టోకెన్లు ఇచ్చి మిగతా వారిని వెనక్కు పంపుతున్నారు. దీంతో అందరికీ కడుపు నిండా భోజనం అంటే ఇదేనా అని జనం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఎనిమిది అన్నారు.. నాల్గింటితో సరిపెట్టారు..
కర్నూలు మున్సిపాల్టీకి 8 అన్న క్యాంటీన్లు మంజూరు చేసిన ప్రభుత్వం నాల్గింటిని మాత్రమే గత జూన్‌లో ప్రారంభించింది. ఉల్చాల రోడ్డు, కల్లూరు ఇండస్ట్రియల్ ఏరియా, పాతబస్టాండ్, కలెక్టరేట్ వద్ద క్యాంటీన్లు నడుస్తున్నాయి. తక్కువ ధరకే భోజనం కావడంతో తినేందుకు జనం క్యూ కడుతున్నా నిర్వాహకులు కొందరికి మాత్రమే టోకెన్లు ఇచ్చి అయిపోయాయంటూ వెనక్కు పంపుతుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టోకెన్లు ఇచ్చిన వారికి కూడా మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని తెలుస్తోంది. టిఫిన్‌కు ఇడ్లి తప్ప ఏమీ ఉండడం లేదు.
మూడొందల మందికే టోకెన్లు..
అన్న క్యాంటీన్లలో డిమాండ్‌కు తగ్గట్టు టిఫిన్ కానీ, భోజనం కాని అందడం లేదనే విషయం స్పష్టంగా తెలుస్తోంది. పాతబస్టాండ్, కలెక్టరేట్ వద్ద ఏర్పాటు చేసిన క్యాంటీన్లకు పేదల నుంచి డిమాండ్ అధికంగా ఉంది. అందరికీ టోకన్లు అందుతాయన్న గ్యారంటీ లేకపోవడంతో పేదలు గంట ముందే వచ్చి క్యూ కడుతున్నారు. అయితే క్యూలైన్‌లో నిలిచి ఉన్నా అందరికీ టోకెన్లు రావడం లేదు. దీంతో గంటలకొద్ది క్యూలో నిల్చున్న వారు చివరకు టోకెన్ అందక వెనక్కు వెళ్తుండడం గమనార్హం.
అన్నం చాల్లేదు..
బంధువులు ఆసుపత్రిలో ఉంటే చూసేందుకు వచ్చిన. మధ్యాహ్నం రూ.5 ఇచ్చి భోజనం చేసిన. అన్నం తక్కువగా పెట్టడంతో కడుపు నిండలేదు.
–సరోజమ్మ, బుధవారపేట
గంటకు పైగా నిల్చున్నా..
కలెక్టరేట్‌లో పని ఉండి వచ్చిన. రూ. 5కే భోజనం పెడతారంటే మధ్యాహ్నం 12 గంటల నుంచి క్యూలో నిల్చున్న. టోకెన్ తీసుకుని కూర్చుంటే కొంచెం అన్నం, కొంచెం పప్పు, అరస్పూన్ చట్నీ, కూరగాయ ఇస్తున్నారు. రెండు టోకెన్లు ఇస్తే కానీ అన్నం కడుపు నిండదు.
– రాముడు, ఎమ్మిగనూరు
టోకెన్‌లు ఇవ్వడం ఆలస్యమవుతోంది..
ప్రతి ఒక్కరినీ కంప్యూటర్‌లో ఫొటో తీసి టోకెన్ ఇస్తున్నారు. దీంతో ఆలస్యమవుతోంది. మధ్యాహ్నం గంటకు పైగా క్యూలో ఉండాల్సి వస్తోంది. వృద్ధులు, మహిళలు అంతసేపు నిల్చోలేకపోతున్నారు. మరొకరిని నియమించి టోకెన్లు త్వరగా ఇస్తే పడిగాపులు కాయాల్సిన అవసరం ఉండదు. –నాగరాజు, నందికొట్కూరు
Comments
Please login to add a commentAdd a comment