అప్పన్న సన్నిధిలో సినీ ప్రముఖులు
సింహాచలం, న్యూస్‌లైన్ : సింహాచల శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామిని ప్రముఖ సినీ దర్శకుడు రాఘవేంద్రరావు, నటుడు మోహన్‌బాబు దంపతులు సోమవారం దర్శించుకున్నారు. ఆలయ ధ్వజస్తంభం వద్ద వీరికి దేవస్థానం ఈవో కె.రామచంద్రమోహన్ స్వాగతం పలికారు. అనంతరం వీరంతా కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకుని బేడా చుట్టూ ప్రదక్షిణ చేశారు. వీరి పేరిట స్వామి అంతరాలయంలో అర్చకులు అష్టోత్తర పూజను నిర్వహించారు. గోదాదేవి సన్నిధిలో కుంకమార్చన చేశారు. ఆశీర్వచనం అందజేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం స్వామి ప్రసాదాన్ని ఏఈవో ఆర్.వి.ఎస్. ప్రసాద్ అందజేశారు. వారికి ఆలయ శిల్పసంపద విశిష్టతను ఈవో వివ రించారు.
అందరి క్షేమాన్ని ఆశించాలి : మోహన్‌బాబు
తన క్షేమమే కాకుండా అందరి క్షేమాన్ని ప్రతి ఒక్కరూ ఆశించాలని నటుడు మోహన్‌బాబు అన్నారు. స్వామి దర్శనానంతరం ధ్వజస్తంభం వద్ద ఆయన్ని కలిసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆయనతో కరచాలనం చేసేందుకు అభిమానులు పోటీపడ్డారు. అందరికీ అభివాదం చేసిన మోహన్‌బాబు అందరి క్షేమాన్ని ప్రతి ఒక్కరూ కోరుకోవాలని అన్నారు. ప్రస్తుతం ‘పాండవులు-పాండవులు తుమ్మెద’ చిత్రంలో నటిస్తున్నానని వచ్చే నెలలో సినిమా విడుదల అవుతుందన్నారు. భగవంతుని సన్నిధిలో రాజకీయాలు మాట్లాడడం సబబు కాదని ఈ సందర్భంగా విలేకర్లు అడిగిన ఒక ప్రశ్నకు సమాధానం చెప్పారు.