కాంగ్రెస్‌ను వీడను: సీఎం కిరణ్‌ | I Can't quit congress: CM Kiran Kumar Reddy | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ను వీడను: సీఎం కిరణ్‌

Published Sat, Sep 28 2013 1:57 AM | Last Updated on Sat, Jun 2 2018 4:41 PM

కాంగ్రెస్‌ను వీడను: సీఎం కిరణ్‌ - Sakshi

కాంగ్రెస్‌ను వీడను: సీఎం కిరణ్‌

* పార్టీ లేకుంటే నాకు భవిష్యత్తే లేదు
* ఎవరూ రాజీనామా చేయొద్దు
* విభజన సమస్యలు తీరేవి కావు
* వీటి పరిష్కారానికి రెండో ఎస్సార్సీ వేయాలి
* విభజిస్తే నీటి యుద్ధాలేనని కోర్‌ కమిటీకే చెప్పా
* అయినా రాజకీయ నిర్ణయం తీసుకున్నారు

సాక్షి, హైదరాబాద్‌: రాజకీయ ప్రయోజనాల కోసం కాంగ్రెస్‌ పార్టీ విభజన నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి ఎన్‌.కిరణ్‌కుమార్‌రెడ్డి చెప్పారు. రాష్ట్ర విభజన వల్ల ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతాయని, వాటిని పరిష్కరించడం కూడా సాధ్యం కాదని అన్నారు. ఆ సమస్యల పరిష్కారం కోసం రెండో ఎస్సార్సీ వేయాలని ఆయన కోరారు. రాష్ట్ర భవిష్యత్‌ కోసం సీఎం పదవిని వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నానే తప్ప కాంగ్రెస్‌ను మాత్రం వదులుకోనని తెలిపారు. కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ తెలంగాణ ఏర్పాటుపై నిర్ణయం ప్రకటించిన అనంతరం తొమ్మిది రోజులకు దానిపై నోరు విప్పిన కిరణ్‌... మళ్లీ దాదాపు 50 రోజుల తర్వాత శుక్రవారం రెండోసారి తన క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సుదీర్ఘంగా మాట్లాడారు.

తన భవిష్యత్తంతా కాంగ్రెస్‌తోనే ముడిపడి ఉందని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీని వదులుకునే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్‌ పార్టీ వల్ల, సోనియాగాంధీ వల్లే తాను సీఎం అయ్యానని చెప్పారు. విభజన పేరుతో కాంగ్రెస్‌ పార్టీ పొరపాటు నిర్ణయం తీసుకుందన్నారు. ఇందులో తన భాగస్వామ్యం లేదని చెప్పారు. తాను సీఎంగా ఉండగా విభజన జరగకూడదనే ఉద్దేశంతోనే హైకమాండ్‌పై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేస్తున్నానన్నారు. విభజన వల్ల జరిగే నష్టంపై సీమాంధ్రతో పాటు తెలంగాణ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు.

తక్షణం సమ్మెను విరమించి విధుల్లో చేరాలని ఏపీ ఎన్జీవోలను కోరారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, కేంద్ర, రాష్ట్ర మంత్రులెవరూ ఈ సమయంలో రాజీనామా చేయొద్దని కిరణ్‌ కోరారు. ‘‘రాజీనామా చేస్తే పార్లమెంటులో, శాసనసభలో అభిప్రాయం చెప్పే అవకాశం కోల్పోతారు. పదవుల్లో ఉంటూనే పోరాటం చేయాలి’’ అని సూచించారు. విభజన వల్ల జరిగే నష్టాలు, ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టుల్లో తలెత్తే వివాదాలు, సమైక్య రాష్ట్ర ఆవశ్యకత, దిగ్విజయ్‌సింగ్‌ ఇటీవలి వ్యాఖ్యలు, తదితరాలపై ఆయన గంటకు పైగా మాట్లాడారు. అందులోని ముఖ్యాంశాలు...

సమ్మె విరమించండి
‘‘58 రోజులుగా ఏపీ ఎన్జీవోలు సమ్మె చేస్తుండటంతో సీమాంధ్రలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. విద్యార్థుల చదువులు ఆగిపోయాయి. కార్యాలయాలు మూతపడ్డాయి. ఉద్యోగులు జీతాల్లేక అల్లాడుతున్నారు. పని చేయకపోవడంతో ఉద్యోగులకు సంబంధించి రూ.1,000 కోట్ల జీతాలు ఆగిపోయాయి. మీ ఉద్యమంతో కేంద్రం దృష్టిని, రాష్ర్ట ప్రజల దృష్టిని ఆకర్షించారు. ఇక చాలు. వెంటనే విధుల్లో చేరండి’’

కాంగ్రెస్‌ను వదులుకునే ప్రసక్తే లేదు
‘‘నేను కాంగ్రెస్‌లోనే పుట్టాను. కాంగ్రెస్‌లోనే పెరిగాను. కాంగ్రెస్‌ వల్లే సీఎం కాగలిగాను. కాంగ్రెస్‌ లేకుంటే నాకు భవిష్యత్తే లేదు. కాంగ్రెస్‌ పట్ల నాకు చిత్తశుద్ధి ఉంది. సోనియాగాంధీ, కాంగ్రెస్‌ లేకుంటే నేను సీఎం అయ్యేవాడినే కాదు. కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచన కూడా నాకు లేదు. ఒకవేళ కాంగ్రెస్‌ను వీడి పార్టీ పెడితే మహా అయితే సీఎం అవుతానేమో! ఇప్పటికే ఆ పదవిలో కొనసాగుతున్నాను కదా! ప్రధాని పదవి తప్ప ఇంతకంటే పెద్ద పదవి లేదు కదా! ఇంకా కొత్త పార్టీ ఎందుకు? నాకు కాంగ్రెస్‌ పార్టీ కావాలి. నా తండ్రి కూడా జై ఆంధ్రా ఉద్యమంలోనూ సమైక్యవాదిగానే ఉన్నారు. సమైక్యం కోసం సీఎం పదవిని వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నానే తప్ప పార్టీని వదులుకోను. చంద్రబాబు మాదిరిగా పదవి కోసం గడ్డి కరిచే వ్యక్తిని కాదు. రోజుకో మాట మాట్లాడే మనిషినీ కాదు. అయితే సమైక్యం కావాలా, కాంగ్రెస్‌ కావాలా ఎంచుకొమ్మనే పరిస్థితి రాకూడదనే అనుకుంటున్నా’’

సమైక్యాంధ్ర సీఎంనే
‘‘నేను సీమాంధ్రకే కాదు రాష్టమ్రంతటికీ సీఎంనని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్‌ పదేపదే చెబుతున్నారు. అవును... నేను సమైక్యాంధ్రకే ముఖ్యమంత్రిని. దిగ్విజయ్‌ అలా అంటున్నప్పుడల్లా సమైక్యం కోసం ఇంకా గట్టిగా, కసిగా పోరాడాలన్పిస్తోంది. నా సీఎం పదవి శాశ్వతం కాదు. దిగ్విజయ్‌సింగ్‌ పదవీ శాశ్వతం కాదు. ‘అన్నీ మేం చూసుకుంటాం’ అని రాజకీయ ప్రకటన చేసినంత మాత్రాన సమస్యలు పరిష్కారం కావు. కేంద్రం దిగి రావాలి. 58 రోజులుగా జరుగుతు న్న సీమాంధ్ర ఉద్యమంలోకి రాజకీయ పార్టీల నేతలను రానీవడం లేదంటే అక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవాలి’’

విభజన నిర్ణయమే పొరపాటు
‘‘హైకమాండ్‌ తీసుకున్న రాష్ట్ర విభజన నిర్ణయమే పొరపాటు. అయినా వాళ్లు రాజకీయంగా నిర్ణయం తీసుకున్నారు. విభజన వల్ల తలె త్తే సమస్యలు ఎప్పటికీ పరిష్కరించలేనివి. ఒక సమస్యను పరిష్కరించబోయి మరిన్ని పెద్ద పెద్ద సమస్యలు సృష్టించాలనుకోవడం పరిష్కారమే కాదు. ఇందులో నా పొరపాటు లేదని చెప్పడానికి, ప్రజలను అప్రమత్తం చేయడానికే ఇదంతా చెబుతున్నా. పార్టీ రాజకీయ నిర్ణయమే తీసుకుంది. ఈ సమస్యలను పరిష్కరిస్తూ ఏ విధంగా ముందుకు వెళుతుందో చెప్పాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది’’
నెహ్రూ, ఇందిర వేసిన బంధాలు శిలాశాసనాలు కావా?: ‘‘సీడబ్ల్యూసీ తీర్మానం శిలాశాసనమని మా పార్టీ వాళ్లు అంటున్నారు. సీడబ్ల్యూసీ నిర్ణయం శిలాశాసనసమైతే ఆనాడు నెహ్రూ వేసిన బంధం నీటి మూటేనా? ఇందిరాగాంధీ వేసిన ముడులన్నీ ఉత్తుత్తివేనా? అయినా ఆంధ్రప్రదేశ్‌ ఒక్క రోజులో ఏర్పడిన రాష్ట్రం కాదు. ఎన్నో ఏళ్లు పోరాడితే ఏర్పడిన భాషాప్రయుక్త రాష్టమ్రిది’’

అవకాశాలు కోల్పోతారు
‘‘జిల్లా యూనిట్‌, జోనల్‌ వ్యవస్థ వల్ల 1.6 లక్షల మంది ఉద్యోగులు ఇతర ప్రాంతాల్లో ఉన్నారు. విభజన జరిగితే బదిలీలు, ప్రమోషన్లలో వారికి నష్టం జరుగుతుంది. ఉద్యోగ విరమణ చేసిన వారంతా హైదరాబాద్‌లోనే నివసిస్తున్నారు. వారికి పెన్షన్లు ఎవరిస్తారు? హైదరాబాద్‌కు ఏటా 10.5 శాతం మంది వలస వస్తున్నారు. వీరిలో 15 శాతం ఉద్యోగాల కోసం, 57 శాతం వ్యాపారం, ఉపాధి కోసం, 24 శాతం చదువుల కోసం వస్తున్నారు. విద్యా, వైద్య సంస్థలన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. విభజన జరిగితే సీమాంధ్ర యువత అవకాశాలు కోల్పోతుంది’’

విడిపోతే జల యుద్ధాలే
‘‘విభజన జరిగితే జల యుద్ధాలు తప్పవు. ఇరు ప్రాంతాల్లోనూ సాగునీటి రంగం దెబ్బతింటుంది. కోట్లాది మంది రైతులకు నష్టం వాటిల్లుతుంది. ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోతుంది. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడకపోయి ఉంటే కృష్ణా, గోదావరి నదులపై ఒక్క సాగునీటి ప్రాజెక్టు ఏర్పాటయ్యేది కాదు. తెలంగాణ, సీమాంధ్ర సరిహద్దులోనే శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులను నిర్మించారు. విడిపోతే కొత్తగా ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేం. ఉన్నవాటిని పూర్తి కూడా చేయలేం.

సమైక్య రాష్ట్రంలో అన్నీ ఆలోచించి ఇరు ప్రాంతాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు పోగలుగుతున్నాం. రాష్ట్రం విడిపోతే అది సాధ్యమవుతుందా? ఇదంతా గమనించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆనాడే ఆయా ప్రాజెక్టులకు సంబంధించి టెండర్లు పిలిచారు. అయితే పలు కారణాల వల్ల అవి పెండింగ్‌లో ఉండిపోయాయి (ఈ సందర్భంగా కిరణ్‌ పలుమార్లు మంచినీళ్లు తాగారు. ‘నీటి గురించే నీళ్లు తాగాల్సి వస్తోంది. భవిష్యత్తులో ఇబ్బంది రాకూడదనే ఇదంతా చెబుతున్నా, నీళ్లు తాగుతున్నా’ అంటూ చమత్కరించారు)’’"

అందుకే వైఎస్‌ నాడు రోశయ్య కమిటీ వేశారు
‘‘విభజనవల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముందుగానే గ్రహించారు. వాటిని ఎలా పరిష్కరించాలనే దానిపై రోశయ్య కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. ఆ సమస్యలను పరిష్కరించాకే విభజనపై ముందుకు వెళ్లాలనే ఉద్దేశంతోనే కమిటీ వేశారు. విభజన వల్ల తలెత్తే సమస్యలు పరిష్కారం కావు. అందుకే రెండో ఎస్సార్సీ వేసి ముందుకు పోవాలని కోరుతున్నా. కానీ తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు హైకమాండ్‌ రాజకీయ నిర్ణయం తీసుకుంది. దీన్ని పునఃసమీక్షించాలని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతున్నా’’.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement