తెలంగాణ విభజన నిర్ణయం తర్వాత పూర్తిగా కుంటుపడిన పరిపాలన
తెలంగాణ విభజన నిర్ణయం తర్వాత పూర్తిగా కుంటుపడిన పరిపాలన
Published Thu, Aug 8 2013 1:47 AM | Last Updated on Thu, Sep 27 2018 5:56 PM
తెలంగాణ విభజన నిర్ణయానంతర పరిణామాలు రాష్ట్రంలో ప్రభుత్వ పరిపాలనపై తీవ్ర ప్రభావం చూపించాయి. ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డి పాలనకు కేంద్రమైన సచివాలయానికి రావడమే మానేశారు. విభజన నిర్ణయం వెలువడింది మొదలు బుధవారం వరకు ఆవైపే కన్నెత్తి చూడలేదు. ఇక సీమాంధ్ర ప్రాంతాలకు చెందిన మంత్రులూ సచివాలయానికి రావడం లేదు. అనిశ్చితితో కూడిన పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణ మంత్రుల్లోనూ ఒకరిద్దరు తప్ప మిగతావారు తమ కార్యాలయాలకు రావడం కానీ, రోజువారీ కార్యకలాపాల్లో పాల్గొనడం కానీ చేయడం లేదు. దీంతో ప్రభుత్వపరమైన ఎలాంటి సమీక్షలు, విధానపర నిర్ణయాలు జరగడం లేదు. పలు శాఖల సమీక్ష పూర్తిగా నిలిచిపోయింది. వందలాది ఫైళ్లు పెండింగ్‌లో పడిపోయాయి. గోదావరి వరద బాధితులను పట్టించుకున్న నాథుడే లేడు. సీఎం కనీసం ఏరియల్ సర్వేకు కూడా పూనుకోకపోవడం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం.
ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు కేవలం కోర్టు కేసులు, అత్యవసరమైన ఫైళ్లు మాత్రమే చూస్తున్నారు. ఆందోళనలు జరుగుతున్న సీమాంధ్ర జిల్లాల నుంచి సచివాలయంలోని వివిధ శాఖలకు కావాల్సిన సమాచారం రావడం ఆగిపోయింది. అక్కడ ఉద్యోగులంతా వీధుల్లోకి రావడంతో ఆ పరిస్థితి తలెత్తింది. సచివాలయంలోని సీమాంధ్ర ఉద్యోగులు, అధికారులు సైతం ప్రతిరోజూ ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఏదో ఒక ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటంతో సెక్రటేరియట్ ధర్నాచౌక్‌లా మారింది. రాష్ట్ర విభజనపై కొనసాగుతున్న చర్చలతో ఫైళ్లు, ప్రజా సమస్యలను పట్టించుకునేవారే కరువయ్యారు. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి ఆగమేఘాల మీద ఉత్తర్వులు జారీ చేసిన సర్కారు ఇప్పుడా ఉద్యోగాల ఊసే ఎత్తడం లేదు. విభజన నిర్ణయం నేపథ్యంలో నోటిఫికేషన్లు జారీ చేయాలా..? లేదా..? అని పలు విభాగాలు అడుగుతుంటే వివరణ ఇచ్చేవారే కరువయ్యారు. ఆగస్టులో రచ్చబండ, ఇందిరమ్మ కలలు కార్యక్రమాల దన్నుగా మునిసిపల్, మండల, జిల్లా పరిషత్ ఎన్నికలకు వెళ్లాలని భావించిన సర్కారుకు విభజన నిర్ణయంతో ఎదురుదెబ్బ తగిలింది.
కానరాని సంక్షేమం...
ఆగిపోయిన సబ్సిడీ
సచివాలయం పనితీరు మందగించిన కారణం గా సంక్షేమ శాఖలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా యి. జిల్లాల్లో, కమిషనరేట్ కార్యాలయాల్లో సిబ్బంది విధుల్లో పాల్గొంటున్నందున సాధారణ కార్యకలాపాలకు అంతరాయం కలగకపోయినా, కీలకమైన కొన్ని నిర్ణయాలు మాత్రం జరగడం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగ, మహిళా వర్గాలకు ఆర్థిక సాయం చేసే కార్యక్రమం రూపకల్పన కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశం జరగకపోవడంతో ఎంత మేర సబ్సిడీ, ఆర్థిక సాయం అందించాలన్న అంశం తేలలేదు. మొత్తం 6 లక్షల మందికి ఈ ఏడాది వివిధ ఆర్థిక సహాయ కార్యక్రమాల కింద లబ్ధి చేకూర్చాల్సి ఉంది. కానీ... సబ్సిడీ విషయం ఇంతవరకు తేలలేదు. చేనేత కార్మికులకు లక్ష రూపాయల వరకూ వడ్డీలేని రుణాలు అందిస్తామని సీఎం ప్రకటించారు. ఇందుకు అనుగుణంగా చేనేతశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా ముందుకు కదలడం లేదు.
భారీగా తగ్గిన సందర్శకుల సంఖ్య
సచివాలయానికి సీఎం, మంత్రులు రాకపోవడం తో సందర్శకుల సంఖ్యా గణనీయంగా తగ్గింది. సాధారణంగా రోజూ 2,500 నుంచి 3,000 మంది వరకు వస్తారు. విభజన నిర్ణయం నేపథ్యంలో నెలకొన్న పరిస్థితులతో గత నెల 31న 273 మంది, ఈ నెల 1న 349 మంది, 2న 371 మంది, 5న 368 మంది, 6న 405 మంది, 7వ తేదీన 500 మంది మాత్రమే వివిధ పనుల నిమిత్తం సచివాలయాన్ని సందర్శించారు.
నిలిచిన మునిసిపల్ ఎన్నికల ప్రక్రియ
పురపాలక శాఖ మంత్రి మహీధర్‌రెడ్డి రాజీనామా చేసి సచివాలయానికి రావడం లేదు. మునిసిపల్ ఎన్నికలకు సంబంధించి వార్డులు/డివిజన్ల రిజర్వేషన్ల ఖరారు నోటిఫికేషన్లు రావాల్సి ఉన్నా.. సీమాంధ్ర ప్రాంతంలో అవేవీ జరగడంలేదు. గ్రామీణాభివృద్ధి శాఖలోనూ అదే పరిస్థితి. మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సునీతా లక్ష్మారెడ్డిలు కూడా సచివాలయంవైపు తొంగి చూడడం లేదు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి జానారెడ్డి సచివాలయానికి వచ్చివెళ్తున్నా.. సమీక్షా కార్యక్రమాలు పెట్టుకోవడం లేదు. 2,677 గ్రామ కార్యదర్శుల పోస్టుల భర్తీ ఉంటుందా..? లేదా? అన్న అంశంపై సందిగ్ధత కొనసాగుతోంది.
పింఛన్ల కోసం పేదల ఎదురుచూపులు
విభజన ప్రభావం రచ్చబండ కార్యక్రమంపై పడింది. ఈ నెల 8 నుంచి 18 వరకు రచ్చబండ కార్యక్రమం నిర్వహించాలని గత నెల 24న మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది. అర్హులైన 32.16 లక్షల మంది పేదలకు రేషన్‌కార్డులు, పింఛన్లు, ఇంది రమ్మ ఇళ్లు మంజూరు చేయాలని నిర్ణయించారు. అయితే ఇప్పుడు రచ్చబండ కార్యక్రమం నిర్వహించాలా వద్దా అనే అంశంపై సీఎం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు.
పోస్టులేవీ: పంచాయతీ ఎన్నికలకు ముందు అన్ని రంగాల్లో 54 వేల పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. సీఎం దీనిపైనా నిర్ణయం తీసుకోవడం లేదు. జిల్లా ఎంపిక కమిటీల ద్వారా 20,508 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. ఏపీపీఎస్సీ ద్వారా 12 వేల పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. వివిధ రంగాల్లో మరో 22,000 పోస్టులు భర్తీ చేయాల్సి ఉంది. రాష్ట్ర విభజన ప్రకటన నేపథ్యంలో పోస్టుల భర్తీని ఆపాలని, విభజన ప్రక్రియ తర్వాతే భర్తీ చేయాలని తెలంగాణ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కోరాయి. అయితే పోస్టుల భర్తీ చేయాలా వద్దా అనే విషయంపై స్పష్టత ఇవ్వాల్సిందిగా నియామక విభాగాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరాయి. దీనిపై ముఖ్యమంత్రి నిర్ణయాన్ని ప్రకటించడం లేదు. ఏపీజెన్‌కోలో 1,105 ఖాళీల భర్తీకి అంగీకరించాలని ప్రతిపాదనలు పంపింది.
ఒక్క పరిశ్రమా రావడం లేదు!
కొత్త పరిశ్రమలకూ బ్రేక్ పడింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెడతామంటూ ఒక్క పరిశ్రమ నుంచి కూడా ప్రతిపాదనలు రావట్లేదని పరిశ్రమలశాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. వాస్తవానికి గత నాలుగేళ్లుగా రాష్ట్రానికి పరిశ్రమల రాక బాగా తగ్గిపోయింది. అయితే ప్రస్తుతం పరిస్థితుల నేపథ్యంలో ఒక్క పారిశ్రామికవేత్త కూడా రాష్ట్రంవైపు తొంగి చూడటం లేదని ఈ వర్గాలు వివరించాయి. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల కిలోమీటర్ల మేర ప్రధాన రహదారులు దెబ్బతిన్నాయి. వీటి శాశ్వత మరమ్మతులకు రూ.625 కోట్లు అవసరమని ఆర్‌అండ్‌బీ శాఖ ప్రభుత్వానికి నివేదించింది. శాఖకు మంత్రి లేకపోవడం, పర్యవేక్షించాల్సిన ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడంతో.. ఒక్కపైసా కూడా నిధులు అందలేదు.
4 లక్షల మంది
విద్యార్థుల ఎదురుతెన్నులు
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి దాదాపు 1,20,000 మంది విద్యార్థులు అర్హత సాధించి వెబ్ కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. నోటిఫికేషన్ ప్రకారం ఈనెల 3 నుంచి ఈ ప్రక్రియ మొదలుకావాల్సి ఉండగా.. సీమాంధ్రలో ఆందోళనల ఫలితంగా ఈ ప్రక్రియను వాయిదావేశారు. ఇక దాదాపు 3 లక్షల మంది విద్యార్థులు ఇంజనీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఎదురుచూస్తున్నారు. కోర్టు కేసుల కారణంగా ఇంతవరకు కౌన్సెలింగ్ జరగకపోగా తాజాగా సమైక్యాంధ్ర ఆందోళనల నేపథ్యంలో ఇప్పటికే ఐసెట్ వెబ్ కౌన్సెలింగ్ వాయిదాపడిన నేపథ్యంలో ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్ కూడా ప్రారంభమయ్యేలా లేదు.
Advertisement