ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: స్త్రీ శిశుసంక్షేమ శాఖ పరిధిలోని ప్రొద్దుటూరు అర్బన్, రూరల్ ఐసీడీఎస్ ప్రాజెక్టులలో వసూళ్ల పర్వం సాగుతోంది. ఈ ప్రాజెక్టులకు రూ. లక్షల బకాయిల బిల్లులు ప్రస్తుతం మంజూరయ్యాయి. ఎంతో కష్టపడి తామే ఈ బిల్లులను మంజూరు చేయించామని, ఇందుకుగానూ మామూళ్లు ఇవ్వాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. తమకు అనుకూలంగా ఉన్న కొంతమంది అంగన్వాడీ కార్యకర్తలకు వసూళ్ల బాధ్యతను అప్పగించారు.
ప్రొద్దుటూరు అర్బన్ ప్రాజెక్టు పరిధిలో 196 అంగన్‌వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. గతంలో ఈ అంగన్‌వాడీ కేంద్రాలకు కేవలం రూ.750 మాత్రమే అద్దె చెల్లిస్తుండగా గత ఏడాది ఏప్రిల్ నుంచి పట్టణ ప్రాంతాల్లో అద్దెను రూ.3వేల వరకూ పెంచుతూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. దీంతో అంగన్వాడీ కార్యకర్తలు గత ఏడాది ఏప్రిల్, మేనెలల్లోనే కేంద్రాలను కొత్తభవనాల్లోకి మార్చారు. ఇందుకుగానూ అడ్వాన్స్‌లతో పాటు అద్దెభారం మోస్తూ వచ్చారు. యూనియన్ నేతలు పలుమార్లు వత్తిడి చేయడంతో అంగన్‌వాడీ అద్దె భవనాలకు గత ఏడాది ఆగస్టు నుంచి నవంబర్ నెల వరకూ నాలుగు నెలల బకాయిలను చెల్లించారు. వీటితో పాటు పెరిగిన వేతనాలు, ఇతర బిల్లులు కూడా ఇటీవల మంజూరయ్యాయి.
ఈ ప్రకారం ప్రాజెక్టుకు *52 లక్షల బిల్లులు మంజూరయ్యాయి. ఇందుకు గానూ ప్రతికార్యకర్తనుంచి రూ. 300 ప్రకారం సుమారు *50 వేలు వసూలు చేశారు. నిబంధనల ప్రకారమైతే అంతబాడుగ రాదని, తామే బిల్లులు మంజూరు చేయించామని మరికొందరితో అదనంగా వసూలు చేస్తున్నారు. అలా ఇవ్వకపోతే మిగిలిన బకాయిలు రావని హెచ్చరిస్తున్నారు. అంగన్‌వాడీ కార్యకర్తల ఇళ్ల వద్దకు వెళ్లి మరీ మామూళ్లు వసూలు చేస్తుండటం గమనార్హం. కాగా అంగన్‌వాడీ కార్యకర్త, ఆయా ఇళ్లల్లో కేంద్రాలను నడుపుతున్న వారికి బిల్లులు మంజూరు చేయడంతోపాటు తక్కువ అద్దె చెల్లించేవారికి కూడా కమీషన్ల కోసం కక్కుర్తి పడిన అధికారులు ఎక్కువ బాడుగను మంజూరు చేయించారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి.
నిబంధనల ప్రకారం పెరిగిన అద్దె ఇవ్వాల్సి ఉండగా ఐసీడీఎస్ అధికారులు అలాంటివేమీ లేకుండా తమ ఇష్టప్రకారం మంజూరు చేశారు. తమకు నచ్చినవారికి నచ్చిన విధంగా అధికారులు అద్దె మంజూరు చేశారని కార్యకర్తలే ఆరోపిస్తున్నారు. సీనియర్ అసిస్టెంట్ బాష, సీడీపీఓ రాజేశ్వరిదేవీని వివరణ కోరగా తాము ఎలాంటి వసూళ్లు చేయలేదని తెలిపారు.
రూరల్ ప్రాజెక్టులోనూ ఇదే తంతు
అర్బన్ ప్రాజెక్టు తరహాలోనే ప్రొద్దుటూరు రూరల్ ప్రాజెక్టు అధికారులు కూడా వ్యవహరిస్తున్నారు. గత సీడీపీఓ మేరీ ఎలిజబెత్ కుమారి అవినీతి ఆరోపణలపై సస్పెండయ్యారు. దీంతో శ్రీదేవిని సీడీపీఓగా నియమించారు. ఇక్కడ కూడా వసూళ్ల పర్వం మొదలైంది. ప్రాజెక్టు పరిధిలో 307 కేంద్రాలు మరో21 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ కేంద్రాలకు అద్దెబకాయిలతో పాటు ఫైర్‌వుడ్ చార్జీలు మంజూరు అయ్యాయి. ఇందుకు గానూ ప్రతి కార్యకర్త *500 చొప్పున కమీషన్ ఇవ్వాలని ఇప్పటికే అధికారులు ఆదేశించారు. ఈప్రకారం వీరికి *1.50 లక్ష వసూలు కానుంది. ఈ విషయంపై సీడీపీఓ శ్రీదేవిని వివరణ కోరగా అలాంటిదేమీ లేదన్నారు.
మా వాటా మాకివ్వండి
Published Thu, Jan 9 2014 4:42 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
Advertisement