సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు మీమాంసలో పడ్డాయి. బుధవారం సుప్రీంకోర్టులో జరిగిన పరిణామం ఈ ఎన్నికలు జరుగుతాయో లేదో అనే డైలమాలో పడేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించలేమని ఎన్నికల సంఘం సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో... ఎందుకు నిర్వహించలేరో కారణం చెపుతూ రీషెడ్యూల్‌కు దాఖలు చేసుకోవాలని కోర్టు సూచించింది. దీంతో జిల్లా రాజకీయ నాయకులతో పాటు అధికార యంత్రాంగంలో కూడా తాత్కాలికంగా స్తబ్దత నెలకొంది. మళ్లీ ఈ కేసును శుక్రవారం విచారిస్తామని, ఈలోపు రీషెడ్యూల్ దాఖలు చేయాలని సుప్రీంకోర్టు చెప్పడంతో ఇప్పుడు అందరి దృష్టి ఆరోజుపై పడింది.
ఊరటేనా?
తాజా పరిణామంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు తప్పకుండా వాయిదా పడతాయనే అభిప్రాయం జిల్లా రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఓవైపు మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ సాగుతుండగా, మరోవైపు సార్వత్రిక ఎన్నికలు కూడా ముంచుకొస్తున్న తరుణంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సిద్ధమవడం అన్ని పార్టీలకు ఇబ్బందిగానే మారింది. అయినా ఎన్నికల సంఘం షెడ్యూల్ ఇచ్చిన కారణంగా రాజకీయ పక్షాలు తమ పనిని ప్రారంభించాయి. జిల్లాలో జరుగుతున్న నాలుగు మున్సిపాలిటీలతో పాటు ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడ్డాయి.
రాజకీయ పక్షాలు పని అయితే ప్రారంభించాయి కానీ.... స్థానిక ఎన్నికల ఫలితంపై అందరిలో టెన్షన్ ఉంది. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం సార్వత్రిక ఎన్నికలు జరగడానికి 20 రోజుల ముందే జిల్లాలోని అన్ని ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు ఫలితాలు కూడా వస్తాయి. ఈ ఫలితాలు అసెంబ్లీ, పార్లమెంటు అభ్యర్థుల గెలుపోటములను ప్రభావితం చేస్తాయేమోననే సందేహం అన్ని పార్టీల్లో నెలకొంది. రిజర్వేషన్ల వారీగా అభ్యర్థుల ఎంపిక కసరత్తు కూడా నియోజకవర్గ స్థాయి నేతలకు తలనొప్పిగానే మారింది. సార్వత్రిక ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఎంపిక విషయంలో వచ్చే అభిప్రాయభేదాలు తమ తలరాతలను మారుస్తాయనే భయం కూడా వారిలో వ్యక్తమవుతోంది.
ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు కనుక ఎన్నికల సంఘం కోరినట్టు మే17 తర్వాత ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరుపుకునేందుకు అనుమతినిస్తే ఒకరకంగా రాజకీయ పార్టీలు ఊపిరి పీల్చుకుంటాయనే చెప్పవచ్చు. అయితే, సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే ఎన్నికలు జరిగితే ఎలా అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికలలో అధికార పార్టీకి కొంత సానుకూలంగా ఉంటుందని, ఎన్నికల తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి మంచి ఫలితాలు వస్తాయేమోననే భయం ఉన్నా... ప్రస్తుతానికి ఎన్నికలు వాయిదా పడితేనే మేలనే భావనలో జిల్లా రాజకీయ నాయకులున్నారు.
అంతా సిద్ధమయింది
మరోవైపు ఎన్నికల నిర్వహణ కోసం అధికార యంత్రాంగం అంతా సిద్ధం చేస్తోంది. కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేశ్, జేసీ సురేంద్రమోహన్‌లు ఎన్నికల నిర్వహణపై బిజీగా ఉన్నారు. జిల్లాలో 640 ఎంపీటీసీ స్థానాలు, 46 జెడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిపేందుకు అంతా సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే రిజర్వేషన్ల ఖరారు, పోలింగ్ కేంద్రాల ఎంపిక పూర్తయింది. ఎన్నికలకు నోడల్ అధికారులను కూడా నియమించారు. ఓటర్ల తుది జాబితా తయారయింది. బ్యాలెట్ పేపర్‌ను కూడా సిద్ధం చేశారు. గుర్తులను ఎన్నికల సంఘం ఖరారు చేస్తే నామినేషన్ల దాఖలును బట్టి బ్యాలెట్ పేపర్ల ముద్రణ కూడా ప్రారంభించే యోచనలో అధికార యంత్రాంగం ఉంది.
ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉంటుందనే దానిపై అధికారగణం ఉత్కంఠతో ఉంది. పనిలో పనిగా ఈ ఎన్నికలు కూడా పూర్తి చేసేస్తే ఓ పని అయిపోతుందన్న భావన కొందరు అధికారుల్లో ఉండగా...ఎన్నికలు తాత్కాలికంగా వాయిదా పడితే మిగిలిన రెండు ఎన్నికలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు వెసులుబాటు లభిస్తుందనే అభిప్రాయం మరికొందరు అధికారుల్లో ఉంది. ఈ పరిస్థితుల్లో శుక్రవారం సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పు కోసం ఎన్నికల ఆశావాహులతో పాటు జిల్లా ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
డైలమా!
Published Thu, Mar 13 2014 2:45 AM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
Advertisement
Advertisement