కడగళ్ల వాన
- కనీవినీ ఎరుగని బీభత్సం
- మూడు దశాబ్దాలుగా ఎన్నడూ లేనంత ఉధృతం
- ఈదురుగాలులతో భారీ వర్షం
- అడుగు ఎత్తున పేరుకుపోయిన వడగళ్లు
- కాశ్మీర్‌ను తలపించిన అరకులోయ
- అంధకారంలో టౌన్‌షిప్
- పిడుగు పాటుకు అనంతగిరిలో70 మేకలు మృతి: ఒకరికి అస్వస్థత
అరకులోయ, న్యూస్‌లైన్: ఏకధాటిగా వర్షం పడితేనే, వానకు హోరుగాలులు, ఉరుములు, మెరుపులు, పిడుగులు తోడైతేనే భయమేస్తుంది. గుండె జలదరిస్తుంది. మరి అంత భారీ వర్షానికి బీభత్సకర రీతిలో వడగళ్లు తోడైతే.. ఆ పరిస్థితి ఎంత కలవరపెడుతుం ది! వెన్నులో ఎలా వణుకు పుడుతుంది! శనివారం అరకు వాసులకు ఈ ఆందోళనకర పరి ణామం అనుభవమైంది. అరకులోయను శనివా రం నాటి వడగళ్లవాన అతలాకుత లం చేసింది.
అరకులోయతో పాటు పరిసర గ్రామాల్లోనూ పెద్ద ఎత్తున వడగళ్లు పడ్డాయి. మునుపెన్నడూ లేనివిధంగా ఈదురుగాలులతో కుండపోతగా వర్షం పడింది. 5.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఈ పరిణామాలతో అరకు వాసులు బెంబేలెత్తిపోయారు. రేకుల ఇళ్లల్లోని వా రు ప్రాణభీతితో సన్‌షేడ్‌ల కింద తల దాచుకున్నారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఏకధాటిగా ఈదురుగాలులతో వాన కురిసింది. పెద్దపెద్ద శబ్దాలతో పిడుగులు పడ్డాయి.
దాంతో ఏం జరుగుతుందో ఏమోనని ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. మూడు దశాబ్దాలుగా ఈ స్థాయిలో వడగళ్లు పడడం ఏనాడూ చూడలేదని పెద్దలు చెప్పారు. అరకులోయలోని కొండవీధి, స్టేట్‌బ్యాంక్, రజకవీధిలలో వడగళ్లు సుమారు అడుగు ఎత్తున పేరుకుపోవడంతో కాలు పెట్టడానికి కూడా కష్టంగా మారింది. అవి కరగడానికి రెండు గంటల సమయం పట్టవచ్చని స్థానికులు అంటున్నారు. కుండపోతగా పడిన వర్షం నీరు, వడగళ్ల కారణంగా కొండవీధిలోని వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
సాయంత్రం వాన తగ్గుముఖం పట్టాక వాటిని తొలగించే పనిలో పడ్డారు. వడగళ్లు పేరుకుపోయి అరకులోయ పట్టణం, పరిసర ప్రాంతాలు కాశ్మీర్‌ను తలపించాయి. కనుచూపు మేరా కమ్మేసిన వడగళ్ల వల్ల నేలంతా తెల్లని దుప్పటి పరిచినట్టు కనిపించింది. ఈ వర్షానికి టమాటా, క్యాబేజీ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, అలాగే మామిడి పిందెలలో సహా మొత్తం రాలిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అంధకారంలో అరకులోయ :
వడగళ్లు, ఈదురుగాలులకు అరకులోయ ప్రాంతంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. చెట్లు కొమ్మలు పడి తీగలు తెగిపడడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విశాఖపట్నం-అరకు ఘాట్‌రోడ్డులో ప్రయాణికులు, ద్విచక్రవాహనదారులు ఇక్కట్లకు గురయ్యారు. అరకు మెయిన్‌రోడ్డులో నడవడానికి పాదచారులు అష్టకష్టాలకు గురయ్యారు.
పిడుగు పాటుకి 70మేకలు మృతి: ఒకరికి అస్వస్థత
అనంతగిరి: పిడుగులు పడి మండలంలోని కోనాపురం పంచాయతీ కితలంగిలో 70 మేకలు చనిపోయాయి. ఒకరు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గ్రామ సమీపంలో కిల్లోఅప్పన్న అనే గిరిజనుడు మేకలను కొండనుంచి ఇంటికి తోలుకొస్తుండగా ఉరుములు మెరుపులతో కుండపోతగా వర్షం పడింది. సమీపంలోని చింత చెట్టు కిందికి వాటిని తీసుకెళ్లాడు. అదే సమయంలో ఆ చెట్టుపై పిడుగుపడి మేకలన్నీ చనిపోయాయి. కాపరి అప్పన్న పిడుగు శబ్ధానికి కుప్పకూలిపోయాడు. స్థానికుల సమాచారం మేరకు 108 వచ్చేసరికి అతడు స్పృహలోకి వచ్చాడు. ప్రస్తుతం క్షేమంగా ఉన్నాడు.