కోదాడలో రేషన్ మాఫియా | kodada ration mafia | Sakshi
Sakshi News home page

కోదాడలో రేషన్ మాఫియా

Published Mon, Oct 21 2013 2:54 AM | Last Updated on Fri, Sep 1 2017 11:49 PM

kodada ration mafia

కోదాడటౌన్, న్యూస్‌లైన్: పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. వాటిని రీ సైక్లింగ్ చేస్తూ కొందరు అక్రమార్కులు లక్షలార్జిస్తున్నారు.  ప్రతి రోజూ మూడు జిల్లాల నుంచి రేషన్ బియ్యం కోదాడకు చేరుతున్నాయి. దీంతో కోదాడ నియోజకవర్గం అక్రమ రేషన్ బియ్యానికి అడ్డాగా మారింది. దీనిపై పత్రికల్లో వార్తలు వచ్చినప్పుడు మాత్రం అధికారులు హడావిడి చేసి దాడులు చేస్తున్నారు.  రాష్ట్రంలో ఎక్కడ రేషన్ బియ్యం పట్టుబడినా దాని మూలాలు కోదాడలో ఉండటం ఆందోళన కలిగిస్తుంది. ఈ వ్యాపారం చేసే వారికి అధికార పార్టీ అండదండలు పుష్కలంగా లభిస్తుండటంతో అధికారులు నామమాత్రపు దాడులకే పరిమితమవుతున్నారు. మరో పక్క ఒకరి అక్రమ నిల్వల సమచారం మరొకరు అధికారులకు చేర వేస్తున్నారు.
 
 వందల టన్నుల రేషన్ బియ్యం
 రీసైక్లింగ్
 కోదాడలో ఆరుగురు వ్యాపారులు భారీ ఎత్తున రేషన్ బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేస్తూ రీ సైక్లింగ్‌కు పాల్పడుతున్నారు. వీరిపై ఇప్పటికే అనేకసార్లు దాడులు నిర్వహించారు. అయినప్పటికీ ఈ వ్యాపారం ఆగడం లేదు. పాత మిల్లులను అడ్డాగా చేసుకొని వీరు రేషన్ బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తున్నారు. లారీల్లో బియ్యాన్ని ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. కోదాడ మండలం కూచిపూడిలో ఓ పాత మిల్లులో అధికారులు  గడిచిన నెల రోజుల వ్యవధిలోనే రెండు సార్లు దాడులు నిర్వహించి భారీ ఎత్తున రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. అజాద్‌నగర్‌లో ఉన్న ఓ వ్యాపారిపై కూడా నెల రోజుల వ్యవధిలోనే మూడుసార్లు దాడులు చేశారు. విచిత్రమేమిటంటే దాడులు జరిగిన మరుసటి రోజు నుంచే వీరు వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు.  
 
 ఒకరిపై మరొకరు ఫిర్యాదు
 వారం రోజుల కిత్రం కృష్ణా జిల్లా కంచికచర్ల సమీపంలో 200 క్వింటాళ్ల రేషన్ బియ్యం లారీలో తరలిస్తుండగా అక్కడి అధికారులు పట్టుకున్నారు. డ్రైవర్ ఇచ్చిన సమాచారం మేరకు ఆ బియ్యంతో కోదాడ మండలం కూచిపూడికి చెందిన ఓ వ్యాపారికి సంబంధం ఉన్నదని తేలింది. శనివారం రోజు కూచిపూడిలో దాడులు చేసి 70 క్విటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నారు.
 
 మరుసటి రోజు ఆదివారం కోదాడ పట్టణంలోని రామిరెడ్డిపాలెం రోడ్డులో ఉన్న మరో వ్యాపారి నిల్వ చేసిన రేషన్ బియ్యంపై అధికారులు దాడులు చేసి 69 కింటాళ్ల బియ్యం పట్టుపడ్డాయి. కాగా ఇక్కడ బియ్యం నిల్వ చేసిన విషయాన్ని పట్టణంలోని హెచ్‌పీ బంక్ సమీపంలో ఉన్న మరో రేషన్ బియ్యం వ్యాపారి అందించాడని, అతని మిల్లుపై కూడా దాడులు చేయాల్సిందేనని అధికారులతో బాధితుడు వాగ్వివాదానికి దిగాడు. దాంతో అధికారులు అక్కడ కూడా దాడులుచేసి రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు.
 
 తిలాపాపం తలాపిడికెడు
 ఇటీవల కోదాడ పట్టణంలోని శ్రీనివాస థియేటర్ సమీపంలో అక్రమ రేషన్ బియ్యం వ్యాపారాన్ని చేస్తున్న వారిని డబ్బుల కోసం ఓ రౌడీషీటర్ బెదిరించాడు. వారు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వ్యాపారులు కూడా అధిక లాభాలు వస్తుండటంతో గుట్టు బయటపడకుండా అందరికీ పంపకాలు చేస్తూ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. కొందరు ముఠాలుగా ఏర్పడి  నెల మామూళ్లను వీరివద్ద పసూలు చేస్తూ పంపకాలు చేసుకుంటున్నారు.   
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement