నాన్నా లెయ్.. అమ్మ ఏడుస్తాంది!
తొమ్మిదేళ్ల మోహన్.. ఆరేళ్ల జశ్వంత్.. నాలుగేళ్ల అక్షయ.. మూడేళ్ల చైత్ర.. ఏడాది వయసున్న సాయి.. వీళ్లంతా మొన్నటి వరకు తండ్రితో హాయిగా గడిపిన వాళ్లు..
కానీ నేడు..! అమ్మ ఎందుకేడుస్తోందో తెలీదు..
ఎంతగా పిలుస్తున్నా నాన్నలు లేవడం లేదు.. అంతా కన్నీరుపెడుతుంటే ఏమీ తెలియని అమాయకులై అటూఇటూ చూస్తుండిపోయారు. విద్యుత్ ప్రమాదంలో తమ నాన్నలు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారన్న విషయం తెలియని చిన్నారులు ‘అమ్మా ఏమైందే.. ఏడుస్తున్నావ్.. నాన్నా లెయ్..అమ్మ ఏడుస్తాంది’ అంటూ తిరుగుతుంటే అక్కడున్న వారు కంటతడి పెడుతూ వారిని అక్కున చేర్చుకోవడం మినహా ఏమీ చేయలేని పరిస్థితి.
విడపనకల్లు/ఉరవకొండ : విడపనకల్లు మండలం చీకలగురికిలో విషాదఛాయలు అలుముకున్నాయి. శుక్రవారం జరిగిన విద్యుత్ ప్రమాదంలో కురుబ రేవణ్ణ (65), అతడి కుమారులు ఎర్రిస్వామి (36), బ్రహ్మయ్య (30), మనవడు రాజశేఖర్ (18), సమీప బంధువు వరేంద్ర (29) మృతి చెందిన విషయం తెలిసిందే. శనివారం అంత్యక్రియల సందర్భంగా ఊరు కన్నీరు పెట్టింది.
ఎంత మంది వచ్చి పరామర్శించి.. ధైర్యం చెబుతున్నా ‘ఎవరొచ్చినా మా వాళ్ల ప్రాణాలు తిరిగొస్తాయా..అమ్మా’ అంటూ కుటుంబ సభ్యులు విలపించడం అక్కడున్న వారిని కంటతడిపెట్టించింది. ఊరుఊరంతా అక్కడికొచ్చి శోకసంద్రంలో మునిగిపోయింది. ఓ వైపు భర్తలను పోగొట్టుకున్న భార్యలు రోదిస్తుండడం.. మరోవైపు తండ్రులను కోల్పోయిన చిన్నారులు అమాయకంగా కలియదిరుగుతున్న దృశ్యాలు తీవ్ర విషాదాన్ని కలిగించాయి.
‘పుట్టింటికి పోయిరా అని చెప్పి నేను తిరిగొచ్చేలోపు వెళ్లిపోయావే.. నన్ను, నా బాబును అనాథను చేశావా దేవుడా..’’ అంటూ వరేంద్ర భార్య దేవి గుండెలవిసేలా రోదించింది. ఆమె గుండె భారాన్ని..రోదనను అక్కడున్న వాళ్లలో ఎవరూ ఆపలేకపోయారు. ‘నాకు పుట్టింట్లో అమ్మానాన్నా లేరు.. ఉన్న నువ్వూ వెళ్లిపోయావే.. నేనెలా బతకాలయ్యా’ అంటూ విలపించింది.
ఇక తండ్రి మృతి చెందిన విషయం తెలియని బ్రహ్మయ్య కుమారుడు జశ్వంత్.. పత్రికలో నాన్న ఫొటో కన్పిస్తుండడంతో తదేకంగా దాని వైపు చూస్తూ అక్కడే ఉన్న పిల్లలకు దాన్ని చూపిస్తున్న దృశ్యాన్ని చూసిన స్థానికులు ‘అయ్యో.. ఎంత పనిచేశావు.. దేవుడా..’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మా..అవ్వా..బంధువులంతా దుఃఖంలో నిండిపోగా.. బ్రహ్మయ్య పెద్ద కుమార్తె అక్షయ చాక్లెట్ తినుకుంటూ.. చిన్న కుమార్తె చైత్ర తోటి పిల్లలతో ఆడుకుంటూ ఉండిపోవడం వారి అమాయకత్వానికి నిదర్శనంగా నిలిచింది.
ఎర్రిస్వామి రెండో కుమారుడు మోహన్ తన పెద్దమ్మ రోదిస్తున్న దృశ్యాన్ని చూస్తూ ఎవరితోనూ మాట్లాడకుండా అలాగే ఉండిపోవడం స్థానికుల మనసుల్ని కలచివేసింది. ఇలా ఎవరిని కదిపినా.. ఎక్కడ చూసినా తీవ్ర వేదనతో నిండిపోయిన వారే కన్పించారు. అంత్యక్రియల్లో పాల్గొనేందుకు గ్రామంలోని వారంతా కదిలివచ్చారు. రోదిస్తూ.. కంటతడి పెడుతూ తుదివీడ్కోలు పలికారు.
కంటతడి పెట్టిన మంత్రి సునీత
విడపనకల్లు మండలం చీకలగురికి గ్రామంలో విద్యుదాఘాతం జరిగిన ఐదుగురు మృత్యువాత పడిన విషయం తెలుసుకున్న మంత్రి సునీత శనివారం ఆ గ్రామానికి వెళ్లారు. మృతుల కుటుంబ సభ్యులను ఓదార్చారు. మృతదేహాలను..అక్కడి వారి రోదనలను చూసిన మంత్రి కంటతడి పెట్టారు.
‘ఇక మాకెరవరు దిక్కమ్మా..ఎంత వస్తేనేమి..మా వాళ్లు రారు కదమ్మా..’ అని మహిళలు విలపిస్తుంటే చలించిపోయిన మంత్రి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఘటన దురదృష్టకరమన్నారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చి బాధితుల్లో మనోధైర్యం నింపారు.
జెడ్పీ చైర్మన్ చమన్ సాహెబ్, వైఎస్‌ఆర్‌సీపీ నేత రాగే పరశురాం, మాజీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కూడా మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాగా ఆపద్బంధు కింద ఒక్కో కుటుంబానికి రూ.50 వేల చెక్కును అనంతపురం ఆర్డీఓ హుస్సేన్ సాహెబ్ అందించారు.