‘స్థానికత’ నిబంధనలు మార్చలేరు
తెలంగాణ సర్కారుపై ఏపీ విద్యా మంత్రి గంటా ఆగ్రహం
దీనిపై అవసరమైతే కోర్టుకు వెళతాం
మా విద్యార్థులకు ఫీజు
రీయింబర్స్‌మెంట్ వారిష్టం
ఒకవేళ ఇవ్వకుంటే ఆ బాధ్యత మాదే
హైదరాబాద్: ఫీజుల చెల్లింపు విషయంలో తెలంగాణ ప్రభుత్వం పలు రకాల ఆలోచనలు చేస్తున్నట్లు వస్తున్న కథనాలపై ఏపీ సర్కారు తీవ్రంగా స్పందించింది. ఈ విషయంలో విద్యార్థులకు అన్యాయం జరిగితే ఊరుకోబోమని, భవిష్యత్తులో ఉద్యోగాల విషయంలోనూ ఇదే వాదన చేసే ప్రమాదముందని ఏపీ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. ఇంతవరకు దీనిపై తమకు అధికారికంగా సమాచారం రాలేదని, తెలంగాణ ప్రభుత్వం నిర్ణయాన్ని బట్టి అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని మంత్రి చెప్పారు. శుక్రవారం ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేసిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. త ండ్రి స్థానికత అంటూ, 1956కు ముందు స్థిరపడిన వారికేనంటూ కథనాలు వస్తున్నాయని... అయితే స్థానికత నిర్ధారణ విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వులు, ముల్కీ నిబంధనలు, ప్రత్యేక విధానాలు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. వాటిని మార్చే అధికారం తెలంగాణ ప్రభుత్వానికి లేదన్నారు. ఇలాంటి నిబంధనల వల్ల రెండు, మూడు దశాబ్దాలుగా తెలంగాణలో స్థిరపడిన వారు అటు తెలంగాణలో, ఇటు ఆంధ్రప్రదేశ్‌లో స్థానికులు కాకుండా పోతారన్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఫీజు చెల్లింపు విషయం తెలంగాణ సర్కారు ఇష్టమని చెబుతూనే... వారు ఇవ్వడమే సరైందని అభిప్రాయపడ్డారు. ఒకవేళ తెలంగాణ ప్రభుత్వం ఇవ్వకపోతే తమ విద్యార్థుల బాధ్యతను తాము తీసుకుంటామన్నారు.
ఈ ఏడాదే ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలు..
ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో కేంద్రం 11 జాతీయ స్థాయి విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తోందని మంత్రి చెప్పారు. ఇందులో భాగంగా ఈ ఏడాదే ట్రిపుల్ ఐటీలో ప్రవేశాలు చేపడతామన్నారు. ఏయూలో వీటి తరగతులు నిర్వహిస్తామని, వచ్చే ఏడాదికి భవన నిర్మాణాలు చేపడతామన్నారు. ఇందుకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ కూడా అంగీకారం తెలిపారని వెల్లడించారు.
రెండేళ్ల మార్కులతోనే జేఈఈ ర్యాంకులు!
ఇంటర్‌లో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల మార్కులను పరిగణనలోకి తీసుకుని జేఈఈ మెయిన్ ర్యాంకులు ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించినట్లు ఏపీ విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు రెండేళ్ల మార్కులను పంపించాలంటూ కేంద్ర మానవ వనరుల మంత్రిత్వ శాఖ నుంచి లేఖ కూడా వచ్చినట్లు పేర్కొన్నారు. ఈ విషయంలో పలువురు విద్యార్థులు కోర్టును ఆశ్రయించగా.. కేంద్రం తన వైఖరి చెప్పాలంటూ హైకోర్టు గురువారం ఆదేశించిన సంగతి తెలిసిందే. జేఈఈ మెయిన్ ర్యాంకుల నిర్ధారణలో 12వ తరగతి/తత్సమాన కోర్సుల మార్కులనే పరిగణనలోకి తీసుకుంటామని గత డిసెంబర్‌లో జారీ చేసిన నోటిఫికేషన్‌లో సీబీఎస్‌ఈ స్పష్టం చేసింది. అయితే రాష్ట్రంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం రెండూ బోర్డు పరీక్షలే అయినందున రెండేళ్ల మార్కులను పరిగణనలోకి తీసుకోవాలని ఫస్టియర్‌లో ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
దీనికి సెకండియర్‌లో ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు అంగీకరించడంలేదు. పైగా ఇందులో రాష్ట్రం నుంచి పరీక్షకు హాజరైన వారి మధ్య పోటీ ఉండనుంది. రాష్ట్రం నుంచి పరీక్ష రాసిన వారి 12వ తరగతిలోని మార్కులకు 40 శాతం వెయిటేజీ ఇస్తూ నార్మలైజేషన్ చేసి తుది ర్యాంకులను సీబీఎస్‌ఈ ఖరారు చేస్తుంది. ఫలితంగా ఇంటర్ ఫస్టియర్‌లో ఎక్కువ మార్కులు పొంది, జేఈఈపైనే దృష్టిపెట్టి సెకండియర్‌లో తక్కువ మార్కులు సాధించిన విద్యార్థులు వెనకబడిపోయే పరిస్థితి ఉంది.