మింగేస్తున్న మట్కా... | Matka gambling | Sakshi
Sakshi News home page

మింగేస్తున్న మట్కా...

Published Fri, Jul 18 2014 4:30 AM | Last Updated on Tue, Oct 16 2018 2:30 PM

మింగేస్తున్న మట్కా... - Sakshi

మింగేస్తున్న మట్కా...

- జిల్లాలో మట్కా జూదానికి బానిసలై బలైపోతున్న సామాన్యులు
- లక్షాధికారులవుతున్న నిర్వాహకులు
- పక్కా సమాచారమున్నా.. పట్టించుకోని పోలీసులు

 గిద్దలూరు : జిల్లాలో మట్కా జూదం చాపకింద నీరులా విస్తరిస్తోంది. కొన్నేళ్ల క్రితం జిల్లావ్యాప్తంగా ఎంతోమంది జీవితాలను నాశనం చేసిన ఈ జూదం.. తాజాగా మళ్లీ సామాన్యులను మింగేస్తోంది. పశ్చిమ ప్రకాశంతో పాటు జిల్లాలోని అనేక ప్రాంతాలకు విస్తరించి పేదల జీవితాలతో చెలగాటమాడుతోంది. దీనికి బానిసలై ఎంతోమంది సర్వం కోల్పోయి బికారులవుతుండగా నిర్వాహకులు మాత్రం లక్షాధికారులవుతున్నారు. నిర్వాహకులపై పోలీసులకు పక్కా సమాచారం ఉన్నప్పటికీ పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
 
మట్కా జూదమంటే...

ముంబై కేంద్రంగా నడిచే చట్ట విరుద్ధమైన జూదం పేరే మట్కా. ఈ జూదం ఆడేందుకు ఆన్‌లైన్ వెబ్‌సైట్‌లో లాగిన్ అవడంతో పాటు స్థానికంగా నిర్వాహకులను సంప్రదిస్తుంటారు. జూదం ఆడేవారు 10 నుంచి 99 వరకూ ఏదోక నంబర్‌ను ఎంపిక చేసుకుంటారు. దానిపై రూపాయి నుంచి లక్షల రూపాయల్లో పందెం కడతారు. రాత్రి సమయంలో ముంబై కేంద్రం నుంచి విడుదల చేసే గేమ్‌నంబర్.. ఆడేవారు ముందుగానే ఎంపిక చేసిన నంబర్ ఒకటే అయితే రూపాయికి 70 రూపాయల చొప్పున నిర్వాహకులు చెల్లిస్తారు. కనీసం మొదటి అంకె సరిపోలినా రూపాయికి 10 రూపాయల చొప్పున చెల్లిస్తారు. లేకుంటే పందెం కాసిన నగదు పోయినట్టే. ఇలా ప్రతిరోజూ ఒక నంబర్‌పై పందెం కాస్తుంటారు. దానికి సంబంధించి అసలు నంబర్‌లో మొదటి అంకెను ముంబై నుంచి రాత్రి 11 గంటల సమయంలో, రెండో అంకెను 12 గంటల తర్వాత విడుదల చేస్తారు.
 
రోజుకు రూ.25 లక్షల వరకూ పందేలు...
పూర్తిగా చట్టవ్యతిరేకమైన ఈ జూదానికి జిల్లాలోని ఎంతోమంది బానిసలు కావడంతో రోజుకు 25 లక్షల రూపాయల వరకూ జిల్లాలో పందేలు నడుస్తున్నాయి. రోజుకు ఈస్థాయిలో జిల్లావాసులు నష్టపోతుండగా నిర్వాహకులు మాత్రం లక్షల రూపాయలకు పడగలెత్తుతున్నారు. రాజకీయ నాయకుల అండదండలతో పాటు పోలీసుల సహకారంతోనే నిర్వాహకులు ఈ జూదాన్ని క్రమంగా విస్తరిస్తున్నట్లు తెలుస్తోంది. మట్కా నిర్వాహకులను కొందరు అవినీతి పోలీస్ అధికారులు ప్రోత్సహిస్తున్నారన్న విషయం జిల్లాలో బహిరంగ రహస్యంగా మారింది. దీనివల్లే గతంలో రోజుకు 10 లక్షల రూపాయల వరకూ సాగే మట్కా జూదం..ప్రస్తుతం 25 లక్షల రూపాయల వరకూ పెరిగినట్లు సమాచారం.
 
పశ్చిమానే రూ.10 లక్షల్లో పందేలు...
జిల్లాలో మట్కా జూదానికి సంబంధించి రోజుకు 25 లక్షల రూపాయల పందేలు జరుగుతుండగా, ఒక్క పశ్చిమ ప్రకాశంలోనే 10 లక్షల రూపాయల వరకూ పందేలు కాస్తున్నారు. ప్రధానంగా పశ్చిమ ప్రకాశంలోని గిద్దలూరు నియోజకవర్గంలో సగానికిపైగా గ్రామాల్లో మట్కా జూదం నిరాటంకంగా సాగుతోంది. గిద్దలూరు పట్టణంలోని పాములపల్లె రోడ్డు, కుమ్మరామంకట్ట, గాంధీ బొమ్మ సెంటర్, రాచర్ల రోడ్డు, కొంగళవీడురోడ్డు, ముండ్లపాడు, కేఎస్ పల్లె, కొత్తపల్లె, రాచర్ల మండలంలోని గుడిమెట్ట, రామాపురం, సోమిదేవిపల్లె, యడవల్లి, కొమరోలు మండలంలోని గుండ్రెడ్డిపల్లె, తాటిచర్లమోటు, కంభం ఇలా అన్ని గ్రామాల్లో మట్కా జూదం నిర్వాహకులున్నారు. రోజువారీ కూలి కోసం పనిచేసే కూలీల నుంచి ఆటోడ్రైవర్లు, ఇతర వ్యాపారస్తులు, సంపన్నులు సైతం ఎవరిస్థాయికి తగ్గుట్టు వారిస్థాయిలో రూపాయి నుంచి లక్షల రూపాయల్లో పందేలు కాస్తుంటారు. కళాశాల విద్యార్థులు సైతం ఈ జూదానికి బానిసలవుతున్నారంటే పరిస్థితిని అర్థంచేసుకోవచ్చు. ఇప్పటికే ఎంతోమంది జీవితాలను బుగ్గిపాలు చేసిన ఈ జూదానికి మరింత మంది బలైపోకముందే పోలీసులు మేల్కొని నిర్వాహకులపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement