ఒంగోలు టౌన్: భూ హక్కుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో విజయవాడలో బుధవారం జరగాల్సిన ర్యాలీ, ధర్నాలో జిల్లా నుంచి నాయకులు పాల్గొనకుండా పోలీసులు అర్ధరాత్రి అరెస్టులు చేయడం దారుణమని సీపీఎం జిల్లా కార్యదర్శి పూనాటి ఆంజనేయులు ఒక ప్రకటనలో విమర్శించారు. భూ బ్యాంకు పేరుతో ప్రభుత్వం రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కుంటుందని విమర్శించారు. పట్టాదారు రైతులకు ఎంత నష్టపరిహారం ఇస్తారో చెప్పకుండా, 2013 భూసేకరణ చట్టాన్ని ప్రస్తావించకుండా అన్ని గ్రామాల్లో సర్వేలు పూర్తి చేసిందన్నారు. ఈ చర్యలను వ్యతిరేకిస్తూ రైతాంగం ఐక్యమై విజయవాడలో ర్యాలీ, ధర్నా చేసేందుకు సిద్ధమైతే అర్ధరాత్రి పోలీసులు నాయకుల ఇళ్లకు వెళ్లి భయభ్రాంతులకు గురిచేసేలా అరెస్టులు చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. పౌరుల హక్కులకు భంగం కలిగించే వ్యవహరించడాన్ని ఆక్షేపించారు. ఈ చర్యలను ప్రజాతంత్రవాదులు ఖండించాలని పూనాటి ఆంజనేయులు కోరారు.