సమైక్యానికే నా ఓటు: లగడపాటి
విజయవాడ : సమైక్యాంధ్రకు మద్దతుగా విద్యార్థి జేఏసీ చేపట్టిన ర్యాలీలో విజయవాడ కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా లగడపాటి మాట్లాడుతూ తెలుగు ప్రజల మనోభావాలను తెలుసుకోకుండా రాష్ట్రాన్ని విభజించారని అన్నారు. సమైక్యానికే తన ఓటు అని లగడపాటి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ సమైక్యవాదానికి కట్టుబడేలా చేస్తామన్నారు.
ప్రతి తెలుగు గుండె చప్పుడు రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకుంటుందన్నారు. ప్రతినేత సమైక్యవాదానికి కట్టుబడినప్పుడే రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని లగడపాటి అన్నారు. బెంజి సర్కిల్ నుంచి స్టేడియం వరకూ జరిగిన ఈ ర్యాలీలో స్థానిక కాంగ్రెస్ నేతలు, సమైక్యవాదులు పాల్గొన్నారు.
కాగా 11వరోజు కూడా జిల్లావ్యాప్తంగా నిరసనలు,ఆందోళనలు, ర్యాలీలు, రాస్తారోకోలు కొనసాగుతున్నాయి. విజయవాడలో ఎల్పీజీ డీలర్లు పాదయాత్ర చేయగా, వస్త్రవ్యాపారులు పొట్టి శ్రీరాములు విగ్రహం నుంచి సబ్ కలెక్టరేట్ కార్యాలయం వరకూ ప్రదర్శన నిర్వహించారు. టాక్సీ యాజమానులు ప్రదర్శన చేశారు. అలాగే 13 జిల్లాల న్యాయవాదులు లబ్బీపేటలోని ఏఎస్ రామారావు హాల్లో సమావేశం అయ్యారు.