కళ్యాణదుర్గం : నమ్మించి ప్రజలను మోసం చేయడం చంద్రబాబు నైజమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి ఎల్‌ఎం మోహన్‌రెడ్డి విమర్శించారు. అంగన్‌వాడీ కార్యకర్తలను పోలీసులతో కొట్టించడం దారుణమన్నారు. మంగళవారం ఆయన పట్టణంలోని స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. మహిళల శాపానికి చంద్రబాబు మసైపోతారన్నారు. అప్పట్లో తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో అంగన్‌వాడీలను గుర్రాలతో తొక్కించి..బాష్పవాయు ప్రయోగాలు చేయించారని గుర్తు చేశారు. దీంతో ఆయన్ను ప్రజలు పదేళ్లు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారన్నారు. వైఎస్ మరణానంతరం రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు మోసపు మాటలను నమ్మిన ప్రజలు తిరిగి అధికారాన్ని కట్టబెట్టారని తెలిపారు.
ఆయన తిరిగి పాత పద్ధతులనే అవలంబిస్తూ నిత్యం అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. అప్పట్లో హంద్రీ-నీవాకు రెండుసార్లు శంకుస్థాపన చేసి మభ్య పెట్టారని గుర్తు చేశారు. అదే వైఎస్ హయాంలో రూ.5,600 కోట్లు ఖర్చు చేసి 90 శాతం పనులను పూర్తి చేశారని తెలిపారు. హంద్రీ-నీవాను ఎన్టీఆర్ మానస పుత్రికగా చెబుతున్న టీడీపీ మంత్రులు మిగిలిన పనులను పూర్తి చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సూచించారు. పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా లభిస్తే దానిని పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పట్టిసీమ ప్రాజెక్టుకు రూ.1,300 కోట్లు కేటాయించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. వీటన్నింటి పైనా వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి అసెంబ్లీలో నిలదీస్తే టీడీపీ ఎమ్మెల్యేలతో వ్యక్తిగత ఆరోపణలు చేయించడం తగదన్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో టీడీపీ నాయకులు.. పోలీసులను కూడా బెదిరిస్తున్నారని తెలిపారు. ఇక సామాన్యులకు న్యాయం, రక్షణ ఎక్కడ దొరుకుతుందని ప్రశ్నించారు. కళ్యాణదుర్గం డీఎస్పీ అనిల్ పులిపాటి స్పందించి పోలీసు వ్యవస్థను సక్రమంగా నడిపించాలని కోరారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ సేవాదల్ నాయకులు కృష్ణకుమార్, గోళ్లసూరి, రాజమెర్లిన్, హనుమంతరాయుడు, కొల్లప్ప, బాలప్ప, గురుమూర్తి, వన్నూర్‌స్వామి పాల్గొన్నారు.
నమ్మించి మోసగించడం చంద్రబాబు నైజం
Published Wed, Mar 18 2015 2:20 AM | Last Updated on Sat, Jul 28 2018 6:48 PM
Advertisement
Advertisement