-
జడ్‌పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికలసంఘం అఖిలపక్ష భేటీ
-
సార్వత్రిక ఎన్నికలు, విద్యార్థుల పరీక్షల మధ్య స్థానిక ఎన్నికలు సరికాదన్న ప్రధాన పార్టీలు
-
ఈ పరిస్థితి రావటానికి కారణం గత ప్రభుత్వ నిర్వాకమేనంటూ ధ్వజం
-
మునిసిపల్ ఎన్నికల ఫలితాలనూ వాయిదా వేయాలని వినతి
-
స్థానిక ఎన్నికలను యథావిధిగా కొనసాగించాలన్న సీపీఎం, సీపీఐ
సాక్షి, హైదరాబాద్: ఒకవైపు లోక్‌సభ, శాసనసభ ఎన్నికలు జరుగుతుండగా.. అదే సమయంలో విద్యార్థులందరికీ పరీక్షలు కొనసాగుతుండగా.. పంచాయతీరాజ్ (జడ్‌పీటీసీ, ఎంపీటీసీ) ఎన్నికలు నిర్వహించటం సరికాదని.. ఈ ఎన్నికలను వాయిదా వేయాలని వామపక్ష పార్టీలు మినహా రాజకీయ పార్టీలన్నీ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని కోరాయి. సీపీఐ, సీపీఎం మాత్రం ప్రకటించిన షెడ్యూలు ప్రకారమే ఎన్నికలు నిర్వహించాలని సూచించాయి. సార్వత్రిక ఎన్నికల సమయంలో రాష్ట్రంలో పంచాయతీరాజ్ ఎన్నికలను నిర్వహించటం ఇబ్బందికరంగా ఉందని, వీటిని వాయిదా వేస్తే బాగుంటుందని బుధవారం సుప్రీంకోర్టుకు నివేదించిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. ఈ ఎన్నికల వాయిదా అంశంపై రాజకీయ పార్టీల అభిప్రాయాలు తెలుసుకునేందుకు గురువారం హైదరాబాద్‌లోని బుద్ధభవన్‌లో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది. సకాలంలో ఎన్నికలు నిర్వహించటానికి వీలుగా పంచాయతీరాజ్ నియోజకవర్గాల రిజర్వేషన్ల జాబితా ఇవ్వాలని గత ప్రభుత్వాన్ని పలుమార్లు కోరినా జాబితా ఇవ్వలేదని అందువల్లనే ఎన్నికలు నిర్వహించలేకపోయామని పార్టీలకు వివరించింది. రాష్ట్రంలో పరిస్థితులను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకుని వచ్చే సమయం కూడా లేకపోవడంతో.. కోర్టు ఆదేశాల మేరకు ఎన్నికల నిర్వహణకు నోటిఫికేషన్ జారీ చేశామని చెప్పింది. ఈ సమావేశానికి హాజరైన ఆయా పార్టీల నేతలు.. మూడు నాలుగేళ్లుగా స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించకుండా గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ధ్వజమెత్తారు. రాష్ట్ర ఎన్నికల సంఘం మెడపై కత్తిపెట్టి ఎన్నికల తేదీలు ప్రకటించేలా సుప్రీంకోర్టు ఆదేశించటం సరికాదని, స్థానికంగా ఉన్న ఆచరణాత్మక పరిస్థితుల అంచనాతో తీర్పునివ్వాలని అభిప్రాయపడ్డారు. అలాగే.. సార్వత్రిక ఎన్నికల సమయంలో మునిసిపల్ ఎన్నికల ఫలితాలను ప్రకటించటం ఎగ్జిట్ పోల్ వంటిదేనని.. కాబట్టి ఆ ఫలితాలను కూడా వాయిదా వేయాలని పలు పార్టీలు రాష్ట్ర ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశాయి. సమావేశంలో ఏ పార్టీ ఏం చెప్పిందంటే...
ఎన్నికలను రీషెడ్యూల్ చేయాలి
స్థానిక సంస్థలకు సకాలంలో ఎన్నికలు నిర్వహించకుండా ఈ పరిస్థితి రావటానికి గత ప్రభుత్వ నిర్వాకమే కారణం. సాకులు చెప్తూ ఎన్నికలు వాయిదా వేసింది. స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని మా పార్టీ కోరుతోంది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో నిర్వహించటం పద్ధతి కాదు. సాధారణ ఎన్నికలు, విద్యార్థులకు పరీక్షలు ఉన్న సమయంలో ఎన్నికలు సరికాదు. ఎన్నికల వాయిదాకు రాష్ట్ర ఎన్నికల సంఘమే చొరవ తీసుకోవాల్సింది. ఈ ఎన్నికలను రీషెడ్యూల్ చేయాలి.
- ఎం.వి.మైసూరారెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్
‘మునిసిపల్’ ఫలితాలు ఎలా ప్రకటిస్తారు?
సాధారణ ఎన్నికలు, మరోవైపు విద్యార్థులకు పరీక్షల సీజన్.. ఈ సమయంలో ఎన్నికలు సరికాదు. రైతులు కూడా పంటలతో బీజీగా ఉంటారు. సాధారణ ఎన్నికల ముందు మునిసిపల్ ఫలితాలు ఎగ్జిట్‌పోల్ లాంటిదే అవుతుంది. ఒకవైపు ప్రీపోల్ సర్వేలను నిషేధిస్తుంటే.. ఈ ఎన్నికల ఫలితాలు ఎలా ప్రకటిస్తారు?
- కమలాకర్‌రావు, కాంగ్రెస్
ఇప్పుడు స్థానిక ఎన్నికలు సరికాదు
రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా నిస్సహాయ స్థితిలో మునిసిపల్, జడ్‌పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చింది. సాధారణ ఎన్నికలు, రాష్ట్ర విభజన అంశాల్లో అధికారులు, సిబ్బంది బిజీగా ఉన్నారు. ఈ సమయంలో స్థానిక ఎన్నికలు సరికాదు.
- మండవ వెంకటేశ్వరరావు, టీడీపీ
స్థానిక ఎన్నికలు, ఫలితాలు వాయిదా వేయాలి
ఎన్నికల ముందస్తు సర్వేలను నిషేధిస్తుంటే.. ఇప్పుడు మునిసిపల్, పంచాయతీ ఫలితాలు ఎగ్జిట్‌పోల్ మాదిరిగా ఉంటాయి. మునిసిపల్ ఫలితాలు నిలిపివేసి, పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయాలి.
- ఇంద్రసేనారెడ్డి, బీజేపీ
సాధారణ ఎన్నికల తర్వాత నిర్వహించాలి
సాధారణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని స్థానిక ఎన్నికలు వాయిదా వేయాలి. స్థానిక ఎన్నికలకు పార్టీల మేనిఫెస్టో ప్రజల్లోకి వెళ్లే అవకాశం లేదు. సాధారణ ఎన్నికల తరువాత నిర్వహించాలి.
- వై.వి.రామారావు, లోక్‌సత్తా
ఎన్నికలతో మాకు ఇబ్బంది లేదు...
రాష్ట్ర ఎన్నికల సంఘం మెడపై కత్తిపెట్టి, న్యాయస్థానాలే ఎన్నికల షెడ్యూల్ తేదీ ప్రకటించడం సరికాదు.. ఇది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఇలా ఎన్నికలు రావటం కొన్ని పార్టీలకు ఇబ్బందేమో కాని.. మాకు కాదు. కోర్టులు ఆచరణాత్మకమైన తీర్పులు ఇవ్వాలి.
- కె.నారాయణ, సీపీఐ
యథావిధిగా నిర్వహించాలి...
మేము ఎన్నికలు వాయిదా వేయాలని కోరలేదు. యథావిధిగా ఎన్నికలు నిర్వహించాలి.
- వై.వెంకటేశ్వరరావు, సీపీఎం