నేటి నుంచి స్థానిక సమరం
-
నేడు విడుదలకానున్న పంచాయతీరాజ్ నోటిఫికేషన్..
-
ఏప్రిల్ 6వ తేదీన పోలింగ్, 8న ఓట్ల లెక్కింపు
-
1,096 జెడ్‌పీటీసీ, 16,589 ఎంపీటీసీ స్థానాలకు జరగనున్న ఎన్నికలు
-
146 మునిసిపాలిటీలు, 10 కార్పొరేషన్లకు నేడు జిల్లాల్లో నోటిఫికేషన్లు జారీ
-
నేటి నుంచే నామినేషన్ల స్వీకరణ..
-
ఉపసంహరణ గడువు ఏప్రిల్ 18, పోలింగ్ 30న సార్వత్రిక ఎన్నికల
-
సమరానికి ముందే స్థానిక పోరును ముగించే ప్రణాళిక
-
తీవ్ర ఒత్తిడిలో అధికార యంత్రాంగం.. ఎన్నికల నిర్వహణ కత్తి మీద సామే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సోమవారం నుంచి స్థానిక సంస్థల ఎన్నికల జాతర మొదలవుతోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందుగానే.. స్థానిక సంస్థల కోసం సమరానికి తెరలేస్తోంది. ఇప్పటికే ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలకు సోమవారం నుంచి నామినేషన్ల ఘట్టం ప్రారంభం కానుంది. పంచాయతీరాజ్ ఎన్నికలకు కూడా సోమవారం నాడే షెడ్యూల్‌తో పాటు నోటిఫికేషన్‌ను కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారికంగా విడుదల చేయనుంది. ఇప్పటికే షెడ్యూలు విడుదలైన అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు ముందే.. మునిసిపల్, పంచాయతీరాజ్ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేసే దిశగా ఎన్నికల సంఘం ప్రణాళిక సిద్ధం చేసింది. దీంతో రాష్ట్ర అధికార యంత్రాంగమంతా ఈ ఎన్నికల ఏర్పాట్లలో తలమునకలవుతోంది. ఒకవైపు.. పాఠశాలలు, కాలేజీల విద్యార్థులకు వార్షిక పరీక్షలకు ఏర్పాట్లు చేస్తూనే.. విభజనకు సంబంధించిన కసరత్తులో ఉన్న అధికార యంత్రాంగం.. ఇంకోవైపు సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సన్నద్ధమవుతూనే స్థానిక ఎన్నికలను నిర్వహించాల్సి రావటంతో తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటూ సతమతమవుతోంది. ఇంత పని ఒత్తిడిలో ఎన్నికలు సజావుగా జరిగేలా నిర్వహించటం పాలనా యంత్రాంగానికి కత్తిమీద సాముగా మారుతోంది. ఇక సార్వత్రిక ఎన్నికలకు ముందు కొద్ది రోజుల వ్యవధిలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలు.. ఆ తర్వాత జరగబోయే శాసనసభ, లోక్‌సభ ఎన్నికలపైనా ప్రభావం చూపుతాయనే ఆందోళన రాజకీయ పార్టీల్లో వ్యక్తమవుతోంది. పైగా రాష్ట్ర విభజన నిర్ణయం తెలంగాణ, సీమాంధ్ర రెండు ప్రాంతాల్లోనూ తీవ్ర ప్రభావం చూపనుంది. దీంతో స్థానిక ఎన్నికల్లో పట్టు సాధించటానికి.. సత్తా చాటడానికి రాజకీయ పార్టీలు శక్తియుక్తులన్నీ కేంద్రీకరిస్తున్నాయి. ఏ పార్టీకి ఆ పార్టీ వ్యూహరచనలు, అభ్యర్థుల ఎంపిక, ప్రచార కార్యక్రమాల్లో నిమగ్నమయ్యాయి.
పంచాయతీ పోరుకు నేడు నోటిఫికేషన్
రాష్ట్రంలో ఎంపీటీసీ, జెడ్‌పీటీసీ ఎన్నికల నిర్వహణలో జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయటం తెలిసిందే. రెండు రోజుల్లో పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీచేసిన తరువాత రావాలని సుప్రీంకోర్టు శుక్రవారం రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని, ప్రభుత్వాన్ని ఆదేశించటమూ విదితమే. ఈ నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లను ఖరారు చేసి శనివారం సాయంత్రం ఎన్నికల సంఘానికి సమర్పించింది. సోమవారం ఈ ఎన్నికల నోటిఫికేషన్ అంశం సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఈలోగానే నోటిఫికేషన్ జారీచేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పి.రమాకాంత్‌రెడ్డి సోమవారం మధ్యాహ్నం ఒంటి గంటకుపంచాయతీరాజ్ ఎన్నికలకు షెడ్యూలును, నోటిఫికేషన్‌ను జారీ చేయనున్నారు. నోటిఫికేషన్ వెలువడిన రెండు మూడు రోజుల తరువాత నామినేషన్ల ఘట్టం ప్రారంభమవుతుంది. వచ్చే నెల ఆరో తేదీన (ఆదివారం) పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఏప్రిల్ ఎనిమిదో తేదీన ఓట్ల లెక్కింపు ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,096 జడ్‌పీటీసీ, 16,589 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికైన వీరు పరోక్ష పద్ధతిలో 1,096 మంది ఎంపీపీ చైర్‌పర్సన్‌లను, 22 మంది జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌లను ఎన్నుకుంటారు.
నేటి నుంచి మునిసిపల్ నామినేషన్లు...
అలాగే.. పురపాలక సంఘాలు, సంస్థలకు సోమవారం నుంచి నామినేషన్ల ఘట్టం ప్రారంభమవుతోంది. మునిసిపాలిటీల్లో 3,990 వార్డులు, మునిసిపల్ కార్పొరేషన్లలో 513 డివిజన్లకు ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నెల మూడో తేదీన నోటిఫికేషన్ జారీ చేసిన విషయం విదితమే. ఆ ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా 146 మునిసిపాలిటీలు, 10 కార్పొరేషన్ల ఎన్నికలకు సంబంధించి ఆయా జిల్లాల కలెక్టర్లు సోమవారం నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు. దీంతోనే నామినేషన్ల స్వీకరణ మొదలవుతుంది. నామినేషన్లను ఉదయం పదిన్నర గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు స్వీకరిస్తారు. మునిసిపాలిటీల్లో ఎస్సీ/ఎస్టీ/బీసీ అభ్యర్థులు 1,250 రూపాయలు, ఇతర కేటగిరి అభ్యర్థులు 2,500 రూపాయల దరావత్తు చెల్లించాల్సి ఉంటుంది. ఇక మునిసిపల్ కార్పొరేషన్లలో అయితే బీసీ/ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 2,500 రూపాయలు, ఇతర కేటగిరి అభ్యర్థులు 5,000 రూపాయల దరావత్తు చెల్లించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. నగరపాలక సంస్థలకు 13వ తేదీ, పురపాలక సంఘాలకు 14వ తేదీని నామినేషన్లు దాఖలు చేయటానికి చివరి తేదీగా నిర్ణయించిన విషయం విదితమే. మునిసిపల్ వార్డులు, డివిజన్లకు నామినేషన్లు దాఖలు చేసిన వారిలో ఎవరైనా ఉపసంహరించుకోవాలనుకుంటే ఈ నెల 18వ తేదీ చివరి రోజు. వీటికి ఎన్నికలు మార్చి 30వ తేదీన జరగనున్న విషయం తెలిసిందే.