కొనసాగుతున్న సీఐడీ దర్యాప్తు
500లోపు ర్యాంకర్లపై దృష్టి
విజయవాడ, హైదరాబాద్: పీజీ వైద్యవిద్య ప్రవేశపరీక్ష (పీజీఎంఈటీ)-2014 కుంభకోణంలో తొమ్మిది మంది నిందితులకు ఈనెల 11వరకు రిమాండ్ విధిస్తూ విజయవాడ మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కె.జయకుమార్ మంగళవారం ఆదేశాలు జారీచేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూని వర్శిటీ రిజిస్ట్రార్ ఎస్.బాబూలాల్ గత నెల 24న హైదరాబాద్‌లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొత్తం 14మందిపై సీఐడీ పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. మొదటి నిందితుడు మునీశ్వర్ రెడ్డిని విచారించి ఈ వ్యవహారంలో కీలక సమాచారాన్ని రాబట్టారు.
నిందితుల నుంచి రూ.10లక్షల నగదు స్వాధీనం చేసుకున్నామని, 20 మంది విద్యార్థులు మాల్‌ప్రాక్టీసుకు పాల్పడ్డారని కోర్టుకు సీఐడీ నివేదించింది. 59 ఆధారాలతో పాటు 28 పత్రాలను సాక్ష్యాలుగా సమర్పించింది. నిందితులు మునీశ్వర్‌రెడ్డి,సాయినాథ్, ఏవీఆనంద్, భీమేశ్వరరావు, నిర్దాల జగదీప్ అలియాస్ జగదీష్, సీహెచ్ గురివిరెడ్డి, బి.శ్రీనివాస్, శ్రావణి, వెంకటేశ్వరరావులకు కోర్టు రిమాండ్ విధించింది. ఇంకా వి.సురేష్ , అవినాష్ (బెంగళూరు) భూషణ్ రెడ్డి (హైదరాబాద్), అంజూసింగ్, అభిమన్యు (ముంబై)లను అరెస్టు చేయాల్సి ఉంది. మరోవైపు మరో ఆరుగుర్ని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ముంబైకు చెందిన అమీర్ అహ్మద్‌తో పాటు మరో ఇద్దరు దళారులు, ముగ్గురు అనుమానిత ర్యాంకర్లు ఉన్నారు. బెంగళూరుకు చెందిన ప్రధాన సూత్రధారితో పాటు మరికొందరి కోసం సీఐడీ అధికారులు గాలిస్తున్నారు. సీఐడీ అధికారులు మంగళవారం కూడా విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్‌యూనివర్సిటీలో పలువురు అధికారులను విచారించారు.
వైస్ చాన్సలర్ పేషీలోని స్ట్రాంగ్ రూమ్‌లో అనుమానిత అభ్యర్థుల ఓఎంఆర్ షీట్లు, ప్రవేశపరీక్ష దరఖాస్తులను పరిశీలించారు. అలాగే ఒక బృందం కృష్ణా జిల్లా గుడివాడకు వెళ్లి కొంతమందిని విచారించినట్లు తెలిసింది. రీ-ఎగ్జామ్ పెట్టాలా లేక పూర్తి ఆధారాలు సేకరించి నింది తుల ర్యాంకులను విత్‌హెల్డ్‌లో ఉంచాలా? అనే విషయమై గవర్నర్ కార్యాలయం నుంచి ఇంకా స్పష్టమైన ఆదేశాలు రాలేదని తెలుస్తోంది.
పీజీ మెడికల్ స్కాంలో 9 మందికి రిమాండ్
Published Wed, Apr 2 2014 2:42 AM | Last Updated on Sat, Sep 15 2018 3:51 PM
Advertisement
Advertisement