ప్రభుత్వ నిర్వాకం పదో తరగతి విద్యార్థులకు శాపంగా పరిణమించింది. మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో ప్రభుత్వం మూడేళ్లుగా తాత్సారం చేసింది. హైకోర్టు, సుప్రీంకోర్టులు మొట్టికాయలు వేయడంతో ఉన్నఫళంగా ఎన్నికల నిర్వహణకు ఉపక్రమించింది. ఇప్పటికే పదోతరగతి వార్షిక పరీక్షలకు విద్యార్థులు, ఉపాధ్యాయులు సన్నద్ధమవుతున్నారు. ఈక్రమంలో పోలింగ్‌సెంటర్లు, పరీక్ష కేంద్రాలు ఒకటే కావడం...ఇన్విజిలేటర్లు, పోలింగ్ అధికారులు ఒక్కరే కావడంతో మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదముంది.
సాక్షి, కడప: ఈ నెల 30న రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. ఇదే క్రమంలో ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 15 వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించేందుకు ఇప్పటికే విద్యాశాఖ షెడ్యూలు ప్రకటించింది. ప్రస్తుతం జిల్లాలో పదోతరగతి విద్యార్థులకు ప్రీఫైనల్ పరీక్షలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో ఎన్నికల కమిషన్ మున్సిపల్ ఎన్నికల తేదీలను ప్రకటించింది.
పదో తరగతి పరీక్షలు జరిగే రోజుల్లోనే ఎన్నికలు నిర్వహించడం ఎలా సాధ్యమవుతుందని ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. పదో తరగతి పరీక్ష కేంద్రాలు, ఎన్నికల పోలింగ్ కేంద్రాలు ఒక్కటే కావడం వల్ల రెండింటి నిర్వహణ కష్టసాధ్యమని వారు పేర్కొంటున్నారు. జిల్లాలో ఎన్నికలు జరగనున్న కడప కార్పొరేషన్‌తో పాటు 7 మున్సిపాలిటీల ఎన్నికల నిర్వహణ బాధ్యతను ఉపాధ్యాయులే మోయాల్సిన పరిస్థితి. దీని కోసం దాదాపు మూడు వేల మంది ఉపాధ్యాయులు అవసరమని తెలుస్తోంది.
అంతా గందరగోళం:
పదో తరగతి విద్యార్థులను వార్షిక పరీక్షలకు సిద్ధం చేస్తూనే, ఉపాధ్యాయులు పరీక్ష విధులకు సంబంధించి, ప్రశ్న పత్రాలను తీసుకోవడం తదితరాల కోసం ఒక రోజు సమావేశం కావాల్సి ఉంటుంది. ఈక్రమంలో ఈ నెల 30న జరిగే ఎన్నికలకు పోలింగ్ అధికారులుగా, సహాయ పోలింగ్ అధికారులుగా, పోలింగ్ సిబ్బందిగా ఉపాధ్యాయులే విధులు నిర్వహించాలి. దీంతో వారికి ముందుగా శిక్షణ తరగతులు నిర్వహించాలి. పైగా 30న ఎన్నికలంటే ఈ 28న ఎన్నికల అధికారులకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. 29న పోలింగ్ కేంద్రాలకు చేరుకోవాలి. 30న ఎన్నికలు నిర్వహించి, లెక్కింపు ప్రక్రియ పూర్తి చేయాల్సిన పరిస్థితి. 30న ఆదివారం కావడం వల్ల ఎన్నికల నిర్వహణకు ఎలాంటి ఇబ్బంది లేదనుకున్నా, 27నే పోలింగ్ కేంద్రాలను ఎన్నికల అధికారులకు అప్పగించాలి. చట్టప్రకారం పోలింగ్ కేంద్రాలుగా గుర్తించిన కేంద్రాలు ఎన్నికల షెడ్యూలు విడుదలైనప్పటి నుంచి ఎన్నికల సంఘం పరిధిలోకి వెళ్తాయి. అధికారులు పోలింగ్ కేంద్రాలను అప్పుడప్పుడు పరిశీలన చేస్తుంటారు. ఈక్రమంలో 27, 28, 29 తేదీలలో కూడా పదోతరగతి పరీక్షలు ఉంటాయి. పరీక్షల కేంద్రాలనూ ముందే గుర్తించి ఎంపిక చేస్తారు. పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లను ఈ నెల25 నుంచే చేపట్టాల్సి ఉంటుంది.
ఆయా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులు జంబ్లింగ్ విధానంలో జరిగే పరీక్షలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు సీట్లను కేటాయించాలి. ఈ నెంబరింగ్‌ను, సీట్లను మార్చేందుకు వీల్లేదు. ఈ క్రమంలో ఇటు పరీక్షల నిబంధనలు ఉల్లంఘించినా, అటు ఎన్నికల విధులను విస్మరించినా చట్టప్రకారం తీవ్రమైన చర్యలుంటాయని ఓ వైపు అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఒకే సారి రెండు విధులు నిర్వహించడం ఉపాధ్యాయులకు కత్తిమీదసామే.
అధికశాతం స్కూళ్లలో పోలింగ్:
కడపతో పాటు ప్రొద్దుటూరు, రాయచోటిలాంటి పట్టణాల్లో ఓటర్లు అధికంగా ఉన్నారు. నిబంధనల మేరకు గరిష్టంగా 1400 ఓట్లకు ఓ బూత్‌ను ఏర్పాటు చేస్తారు. ఈ లెక్కన కార్పొరేషన్ పరిధిలో రెండులక్షలకుపైగా ఓట్లు ఉన్నాయి. దీంతో దాదాపు ప్రతివార్డులో ఉన్న పాఠశాల ఎన్నికలకమిషన్ స్వాధీనం చేసుకునే పరిస్థితి. ప్రొద్దుటూరులో కూడా 1.50లక్షలకుపైగా ఓట్లు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పోలింగ్‌ను నిర్వహించడం అధికారులకు తలనొప్పిగా మారింది. పైగా పరీక్షల సమయంలో అభ్యర్థుల ప్రచారం, మైకుల హోరుతో పదోతరగతి విద్యార్థుల ఏకాగ్రత దెబ్బతినే అవకాశం ఉంది.
కచ్చితంగా ఇబ్బందే.. ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం:
విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఎన్నికలు నిర్వహిస్తామని ఎన్నికల కమిషన్ వెల్లడించింది. చెప్పినంత సులభం కాదు. పదోతరగతి పరీక్షలు ఉన్నప్పుడు ఎన్నికలు నిర్వహించడం అసాధ్యం. 30న ఎన్నికలంటే 28న శిక్షణ, 29న విధులకు వెళ్లాలి. ఆ తేదీల్లో పరీక్షలు ఉన్నాయి. ఎన్నికలు, పరీక్షలు రెండింటిలో డ్యూటీలు రెండు రోజులు ముందుగానే వేస్తారు. రెండింటి విధుల నిర్వహణ ఉపాధ్యాయులకు తీవ్ర ఇబ్బందే. పదోతరగతి పరీక్షల వేళల్లో ఎన్నికలు నిర్వహించడం శోచనీయం. విద్యార్థులకు తీవ్ర ఆటంకం కలుగుతుంది. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకెళ్తాం.
- ఉద్దండం జయరామయ్య, ఎస్‌టీయూ జిల్లా అధ్యక్షుడు.
పోలింగ్ ‘పరీక్ష’
Published Wed, Mar 5 2014 2:50 AM | Last Updated on Tue, Oct 16 2018 7:36 PM
Advertisement