భద్రాచలం, న్యూస్‌లైన్
భద్రాచలంను తెలంగాణలోనే ఉంచాలనే డిమాండ్‌తో చేపట్టిన ఉద్యమం ఉధృతమవుతోంది. భద్రాచలంలో టీజేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. ఆదివారం నాటి దీక్షల్లో పట్టణానికి చెందిన ప్రముఖ ప్రైవేటు వైద్యులు, మందుల దుకాణాల యజమానులు పాల్గొన్నారు. ఆసుపత్రులను మూసివేసి దీక్షల్లో కూర్చొనడంతో వైద్య సేవలు నిలిచిపోయాయి. అత్యవసర చికిత్సల కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి రోగుల ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా దీక్షా శిబిరంలోనే పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యుల జేఏసీ అధ్యక్షుడు డాక్టర్ ఎస్‌ఎల్ కాంతారావు మాట్లాడుతూ.. భద్రాచలం తెలంగాణలో ఉంటేనే అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. డివిజన్‌లో ఎక్కువగా గిరిజనులే ఉన్నారని, తెలంగాణ రాష్ట్రంలో ఉంటేనే వీరికి సకాలంలో వైద్యసేవలు అందే అవకాశం ఉంటుందని అన్నారు.
వైద్యల జేఏసీ దీక్షలకు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల వారు మద్దతు తెలిపారు. దీక్షలను ప్రారంభించిన టీజేఏసీ డివిజన్ అధ్యక్షులు చల్లగుళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ భద్రాచలంను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునేది లేదన్నారు. ఆంధ్రలో విలీనం చేయాలనే కుట్రలకు నిరసనగా ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామన్నారు. ఈ దీక్షల్లో వైద్యులు రాజశేఖర్, వీరరాఘవయ్య, రవికుమార్, జయరామిరెడ్డి, సీత, సీతారామరామరాజు, శ్యాంప్రసాద్, సుదర్శన్‌రావు, జయభారతి, చంద్రప్రసాద్, భానుప్రసాద్, విజయారావు, ప్రమీలారాణి, శ్రీధర్ వర్మ, అడిగొప్పుల శేషు, అజిత్‌రెడ్డి పాల్గొన్నారు. నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు పగడాల గంగయ్య ఆధ్వర్యంలో నాయకులు వెంకటి, సాదిక్‌పాషా, అంజమ్మ, కృష్ణవేణి, బొజ్జి, భాస్కర్ కూడా దీక్షల్లో కూర్చున్నారు. ఏపీటీఎఫ్, లంబాడా సంస్కృతి పరిరక్షణ కమిటీ సభ్యులు కూడా కూర్చున్నారు.
తెలంగాణలోనే కొనసాగించాలంటూ వీఆర్‌వోల ర్యాలీ...
భద్రాచలంను తెలంగాణలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తూ జిల్లా వీఆర్‌వోల అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎంపీడీవో కార్యాలయం నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీ పట్టణంలో ప్రధాన కూడళ్లలో సాగింది. ఈ సందర్భంగా వీఆర్‌వోల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గరిక ఉపేందర్‌రావు మాట్లాడుతూ దశాబ్దాలుగా సీమాంధ్రుల పాలనలో దోపిడీకి గురైన భద్రాచలం ప్రాంతంలో తిరిగి వారి పెత్తనమే సాగేలా ప్రభుత్వం పావుల కదపటం విచారకరమన్నారు. సంఘం భద్రాచలం డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు అట్టం లక్ష్మణరావు, కల్లూరి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీలో వీఆర్‌వోలు సున్నం రామారావు, భాస్కర్, శ్రీనివాస్, సీతమ్మ, గంగాభవాని, కారం గంగరాజు, ప్రసాద్, రాజారావు, రత్తయ్య రామకృష్ణ, వెంకటేశ్వర్లు, బ్రహ్మయ్య పాల్గొన్నారు.
బ్రిడ్జి సెంటర్‌లో రాస్తారోకో...
జర్నలిస్టు సంఘాలు చేపట్టిన 72 గంటల బంద్ మూడో రోజైన ఆదివారం పాక్షికంగా జరిగింది. దీనిలో భాగంగా బ్రిడ్జి సెంటర్లో జర్నలిస్టులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో బ్రిడ్జి రోడ్‌లో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగింది. తెలంగాణ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో బ్రిడ్జి సెంటర్‌లో రోడ్డుపై బతకమ్మలాడారు. కార్యక్రమంలో జర్నలిస్టులు బీవీ రమణారెడ్డి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి జేఏసీ తరఫున మామిడి పుల్లారావు, అలవాల రాజా, తమ్మళ్ల రాజేష్, ఎండీ బషీర్ పాల్గొన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో కళ్లకు గంతలు కట్టుకొని నిరసన తెలిపారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు ఆవుల సుబ్బారావు, అశోక్ చౌదరి, బెహరా, సతీష్, కైపు ప్రభాకర్ రెడ్డి, రామ్మోహన్‌రావు, పీసీ కేశ వ్, సాయి, రాజేష్‌కుమార్ పాల్గొన్నారు. భద్రాచలం పౌరసమితి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.
భద్రాద్రికి చేరుకున్న పాదయాత్రలు...
భద్రాచలంను తెలంగాణ రాష్ట్రంలోనే ఉంచాలనే డిమాండ్‌తో జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పాదయాత్రలు ప్రారంభిస్తున్నారు. పాల్వంచ కేటీపీఎస్‌కు చెందిన 60 మంది ఇంజనీర్లు కాటం సంజీవయ్య ఆధ్వర్యంలో బస్ యాత్ర చేపట్టి భద్రాచలం వచ్చారు. మణుగూరుకు చెందిన వంద మంది నాయకులు జేఏసీ కన్వీనర్ వలసాల వెంకటరామారావు ఆధ్వర్యంలో భద్రాచలానికి పాదయాత్ర ద్వారా చేరుకుని అంబేద్కర్ సెంటర్‌లో చేస్తున్న దీక్షలకు సంఘీభావం ప్రకటించారు. కాగా, భద్రాచలంను తెలంగాణలోనే ఉంచాలనే డిమాండ్‌తో ఈ నెల 19న జిల్లా బంద్‌కు న్యూడెమోక్రసీ, సీపీఎం పిలుపునిచ్చాయి. ఆందోళన కార్యక్రమాలలో గెజిటెడ్ ఉద్యోగుల సంఘం నాయకులు కుంజా సీతారాములు, పీఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి ఎస్‌కే గౌసుద్ధీన్, వెక్కిరాల శ్రీనివాస్, సోమశేఖర్ పాల్గొన్నారు.
నిరాహార దీక్షల్లో ప్రైవేటు వైద్యులు
Published Mon, Nov 18 2013 7:02 AM | Last Updated on Sat, Sep 2 2017 12:44 AM
Advertisement