సాక్షి, విశాఖపట్నం : వైద్య రంగానికి సవాల్ విసురుతున్న కొత్త కొత్త వ్యాధులు... ఆరోగ్యపరమైన రుగ్మతలను ఎదుర్కొనేందుకు మరింత లోతైన పరిశోధనలు జరగాల్సిన అవసరం ఉందని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ ప్రభుత్వ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి డాక్టర్ ఎల్.వి.సుబ్రహ్మణ్యం తెలిపారు. ఈ పరిశోధనలు నిరుపేదలకు చేరినప్పుడే వాటి సార్ధకత చేకూరుతుందన్నారు. విశాఖలో మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఎండోకాన్-2015 జాతీయ సదస్సు శుక్రవారం నోవోటల్‌లో ప్రారంభమైంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఈ సదస్సులో గౌరవ అతిథిగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ వైద్యరంగంలో కొత్త కొత్త పరిశోధనలు నిరంతరం జరగాల్సి ఉందన్నారు. కొత్త వైద్య విధానం కూడా అందుబాటులోకి రావాలన్నారు. ఈ రంగంలో ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ ఆధారిత విద్యా విధానం అందిపుచ్చుకోవాలని సూచించారు. ప్రపంచంలో ఏమూలనుంచైనా ఏ వైద్య రంగ నిపుణుడి అనుభవాన్నైనా క్షణాల్లో ఇక్కడి వైద్య విద్యార్థులు తెలుసుకునేందుకు వీలుగా టెక్నాలజీ అభివృద్ధి చెందాలన్నారు. ఎస్‌జీఈఐ ఆర్గనైజింగ్ కార్యదర్శి ప్రొఫెసర్ డాక్టర్ ఎన్.నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఎండోస్కోపీ రంగంలో ఎంతో అధునాతన వైద్య విధానం అందుబాటులోకి వ చ్చిందన్నారు.
వీటిని ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేసుకుంటూ వైద్య విద్యార్థులు ముందుకు సాగాలని సూచించారు. ఎస్‌జీఈఐ కార్యదర్శి పంకజ్ కె.గోయంకా మాట్లాడుతూ సొసైటీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎండోస్కోపీ నిపుణులను ఒక వేదికపైకి తీసుకొచ్చేందుకు ఏడేళ్లుగా అవిశ్రాంతంగా కృషి చేస్తుందన్నారు. ఐదేళ్ల క్రితం 700 మంది సభ్యులతో ఉండే సొసైటీ నేడు 1413కు చేరుకుందన్నారు. రాజస్థాన్, వెస్ట్‌బెంగాల్, మహారాష్ర్టలలో చాప్టర్స్ ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు.
ఈ సందర్భంగా అంతర్జాతీయ స్థాయిలో ఎండోస్కోపీ విభాగంలో వైద్యసేవలందిస్తున్న అంథనికాలు, ప్రసాద్ అయ్యర్, కె.ఫళని స్వామి, గౌరవ్ బాత్రా, యాసిన్ ముజూ, డేవిడ్‌కార్ల్, మార్క్‌బ్రోనీ, పెట్రోన్‌అకలో, నోరియా నిడియా, శ్రీరామ్ పారుపూడి, నళిని గుడాలతో పాటు సొసైటీ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్న షౌకత్ అలీ ఇజాగర్‌ను సీఎం చంద్రబాబు మెమెంటోలతో సత్కరించారు. ఎస్‌జీఈఐ గుర్తింపు పొందిన నాలుగు ఆస్పత్రుల యాజమాన్యాలకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.
కొత్త పరిశోధనలు పేదవారికి చేరాలి
Published Sat, Apr 11 2015 3:21 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement