ఎన్నికలకు సన్నద్ధం
విజయనగరం
రానున్న సాధారణ ఎన్నికలకు జిల్లా పోలీసు యంత్రాం గం సన్నద్ధమవుతోంది. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో డివిజన్‌ల వారీగా సమస్యాత్మక, అతిసమస్యాత్మక గ్రామాలను జిల్లా పోలీస్ శాఖ ఇప్పటికే గుర్తించింది.
విజయనగరం డివిజన్‌లో అతి సమస్యాత్మక గ్రామాలు 74, పార్వతీపురం డివిజన్‌లో 45, సమస్యాత్మక గ్రామాలు విజయనగరం డివిజన్‌లో 104, పార్వతీపురం డివిజన్‌లో 46, గొడవలు జరిగే అవకాశం ఉన్నవి విజ యనగరం డివిజన్‌లో 108, పార్వతీపురం డివిజన్‌లో 75, సాధారణ పరిస్థితులు ఉన్నవి విజయనగరం డివిజన్‌లో 103, పార్వతీపురం డివిజన్‌లో 203, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు 97, అధికారులు వెళ్లలేని పంచాయతీలు 4 గుర్తించినట్లు తెలిసింది. వీటిని కలెక్టర్ కార్యాలయంలోని ఎన్నికల విభాగానికి పంపించినట్లు సమాచారం. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఇప్పటికే జిల్లాలో పోలీసు అధికారుల బదిలీలను దాదాపుగా పూర్తిచేశారు.
పోలీసుల బలగాల కొనసాగింపు..
ఇటీవల సమైక్యాంధ్ర ఉద్యమం నేపథ్యంలో జరిగిన అల్లర్లను దృష్టిలో ఉంచుకుని రానున్న సాధారణ ఎన్నికలకు జిల్లా పోలీ సు శాఖ పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని నిర్ణయిం చింది. ఇప్పటికే జిల్లాలో వివిధ రకాల పోలీసు బలగాలు బందోబస్తును నిర్వహిస్తున్నాయి. వీరినే ఎన్నికల వరకు కొనసాగించే అవకాశం ఉంది. జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఆర్మ్‌డ్ రిజర్వు, సివిల్, ఎస్‌టీఎఫ్‌తోపాటు ఏసీబీ, ఆబ్కారీశాఖ తదితర విభాగాల సిబ్బందిని పూర్తిగా ఎన్నికల విధుల్లో వినియోగిస్తారు. అదనంగా జిల్లాకు 9, 10 కంపెనీల పారామిలటరీ బలగాలు వచ్చే అవకాశం ఉంది.
గిరిజన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
గిరిజన ప్రాంతాల్లో మావోయిస్టుల ప్రాబల్యం ఉండడంతో జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోం ది. మావోయిస్టుల కదలికలు ఉన్న గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఏఓబీ నుంచి జిల్లాకు ఉన్న మార్గాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే పోలీసు బలగాలు గిరి జన ప్రాంతాల్లో కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో రానున్న అదనపు బలగాలను కూడా గిరిజన ప్రాంతంలో ప్రత్యేకంగా మోహరించనున్నారు. రాజకీయ నేతలకు ఎన్నికల ప్రచారానికి వీలు కల్పించడంతోపాటు ప్రజలు నిర్భయంగా పోలింగ్ లో పాల్గొనేలా చేయడానికి అవసరమైన పూర్తి భద్రత కల్పిస్తామని పోలీసు అధికారులు చెబు తున్నారు.
అంతర్గత భద్రతపై కసరత్తు
మరో వైపు అంతర్గత భద్రతపై కూడా పోలీసుశాఖ కసరత్తు చేపట్టింది. గత ఎన్నికలు, ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో జరిగిన హింసాత్మక సంఘటనల ఆధారంగా సమస్యాత్మక గ్రామాల జాబితాను రూపొందించారు. ఈ గ్రామాల్లో అసాంఘిక శక్తులు, ఇతర వివాదాస్పద వ్యక్తులపై కన్నేసి ఉంచారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుద లైన తర్వాత పరిస్థితిని సమీక్షించి తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు.
అవగాహన సదస్సులు..
ఎన్నికల సందర్భంగా గ్రామాల్లో గొడవలు జరగకుండా ఉండేందుకు జిల్లా పోలీసుశాఖ గ్రామాల్లో అవగాహన సదస్సు లు నిర్వహిస్తోంది. విజయనగరం మండలంలోని పాత దుప్పా డ గ్రామంలో గత గురువారం రాత్రి ఒకటో పట్టణ సీఐ కె.రామారావు అవగాహన సదస్సు నిర్వహించారు.