తమ్ముళ్లకు పనుల పందేరం! | Roads Department of Roads has decided to expand major roads | Sakshi
Sakshi News home page

తమ్ముళ్లకు పనుల పందేరం!

Published Sun, Jan 6 2019 3:26 AM | Last Updated on Tue, Mar 19 2019 6:19 PM

Roads Department of Roads has decided to expand major roads - Sakshi

 సాక్షి, అమరావతి: ఎన్నికల ముందు టీడీపీ నేతలకు లబ్ధి చేకూర్చేందుకు రంగం సిద్ధమయ్యింది. ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు రోడ్ల విస్తరణ పనుల పందేరం ద్వారా వారికి నిధులు దోచిపెట్టనున్నారు. ఈ ప్రక్రియలో నిబంధనలన్నిటినీ తుంగలో తొక్కారు. పరిపాలన అనుమతులు రాకముందే టెండర్ల ప్రక్రియ ప్రారంభించారు. రోడ్ల నిర్మాణ పనుల వ్యయంతో సమానంగా విస్తరణ పనులకు వ్యయం చేసేందుకు అనుమతులిచ్చారు. వివరాల్లోకి వెళితే.. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ప్రధాన రహదారులను విస్తరించాలని రోడ్లు భవనాల శాఖ నిర్ణయించింది. ఈ మేరకు 82 పనులకు గాను రూ.500.17 కోట్లకు పరిపాలన అనుమతులు మంజూరయ్యాయి. అయితే పనులకు సంబంధించిన జీవో జారీ కాకముందే, పరిపాలన అనుమతులు రాకముందే ఈ పనులకు టెండర్లు పిలవడం గమనార్హం. సాధారణంగా ప్రభుత్వం పరిపాలన అనుమతులు మంజూరు చేయకుండా ఎలాంటి టెండర్ల ప్రక్రియ చేపట్టకూడదు.

ఇది ప్రాథమిక నిబంధన. కానీ ప్రధాన రహదారుల పనులకు పరిపాలన అనుమతులు రాకముందే టెండర్ల ప్రక్రియ చేపట్టారు. పరిపాలన అనుమతులకు సంబంధించిన జీవోలోనే ఇప్పటికే 80 శాతం పనులకు టెండర్ల ప్రక్రియ చేపట్టామని, 20 శాతం పనులు టెండర్ల దశలో ఉన్నాయని పేర్కొనడం గమనార్హం. లైన్‌ ఎస్టిమేట్‌ (ఉజ్జాయింపు అంచనా) ద్వారా టెండర్లు పిలవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పనులు పూర్తయిన తర్వాత అంచనాలు పెంచుకునేందుకు అవకాశం కల్పించే లైన్‌ ఎస్టిమేట్‌ ఆధారంగా టెండర్లు పిలవడమంటే ప్రజాధనాన్ని దోచుకునేందుకేననే ఆరోపణలు విన్పిస్తున్నాయి. 80 శాతం టెండర్ల ప్రక్రియ పూర్తయిందని చెబుతున్న ఆర్‌అండ్‌బీ అధికారులు అవి అసలు ఏ దశలో ఉన్నాయో, ఎవరెవరికి దక్కాయనే అంశంపై నోరుమెదపక పోవడం గమనార్హం. స్థానికంగా అధికార పార్టీ నేతలకు కట్టబెట్టడం వల్లే గుట్టుచప్పుడు కాకుండా వ్యవహరించారని తెలుస్తోంది.

కిలోమీటరు విస్తరణకు రూ.2.5 కోట్లా?
జాతీయ రహదారులు, రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం కిలోమీటరు జాతీయ రహదారి నిర్మాణానికి రూ.2 కోట్లు మేర ఖర్చు చేస్తారు. సుందరీకరణ, డివైడర్లు తదితరాలకైతే రూ.3 కోట్ల వరకు ఖర్చు చేస్తారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కేవలం రహదారుల విస్తరణకు కిలోమీటరుకు రూ.2 కోట్లు నుంచి రూ.2.50 కోట్ల వరకు ఖర్చు చేసేందుకు అనుమతులివ్వడం గమనార్హం. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం మున్సిపాలిటీ పరిధిలో కత్తిపూడి–పామర్రు మధ్య 1.850 కిలోమీటర్ల రహదారి పటిష్టతకు ఏకంగా రూ.5 కోట్లు కేటాయించారు. ఇదే జిల్లాలో సామర్లకోట పరిధిలో కిలోమీటరు రోడ్డు విస్తరణకు రూ.2 కోట్లు కేటాయించారు. గుంటూరు జిల్లాలో గుంటూరు–అమరావతి రోడ్డులో పొన్నెకల్లు గ్రామ పరిధిలో రెండు కిలోమీటర్ల రహదారి విస్తరణకు రూ.2.40 కోట్లు కేటాయించారు. ఇష్టమొచ్చినట్లు నిధుల కేటాయింపు ద్వారా రూ.కోట్లు కొట్టేసేందుకు, తమ్ముళ్లకు లబ్ధి చేకూర్చేందుకు పెద్దలు స్కెచ్‌ వేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు మిగిలిన 20 శాతం పనులు నామినేషన్‌ విధానంలో చేపట్టాల్సిందిగా అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు ప్రారంభమైనట్టు ఆర్‌అండ్‌బీ వర్గాలు వెల్లడించాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement