సాక్షి, అమరావతి: ప్రజల్లో శాస్త్ర సాంకేతిక రంగాలపై ఆసక్తిని పెంచేందుకు రెండు సైన్స్ సిటీ సెంటర్లు, రెండు ప్రాంతీయ విజ్ఞాన కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. తిరుపతి, విశాఖల్లో సైన్స్ సిటీలు, పులివెందుల, నెల్లూరులో ప్రాంతీయ విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. శాస్త్ర సాంకేతిక రంగాల్లో వస్తున్న పెనుమార్పులపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు నిష్ణాతులతో చర్చావేదికలు, ప్రదర్శనలు.. యూనివర్సిటీలు, కళాశాలల్లోని విద్యార్థులకు వక్తృత్వ, వ్యాస రచన పోటీలను సైన్స్ సిటీలు నిర్వహిస్తాయి. అలాగే సైన్స్ మ్యూజియమ్స్, త్రీడీ ప్లానిటోరియమ్స్, 9 డీ థియేటర్లు, సైన్స్ క్లబ్‌లను ఏర్పాటు చేస్తాయి.
దేశంలో అసోం, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో సైన్స్ సిటీలు ఏర్పాటై అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అక్కడి ప్రజలు వీటి కార్యక్రమాల పట్ల ఎక్కువగా ఆసక్తి చూపుతుండటంతో మిగిలిన రాష్ట్రాలూ వీటి ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించాయి. రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్‌కు ఆదేశాల మేరకు అధికారులు తిరుపతి, విశాఖ నగరాల్లో సైన్స్ సిటీల ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేస్తున్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో పని చేయనున్న సైన్స్ సిటీలు నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మూజియమ్స్ (స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ) సూచనల మేరకు కార్యక్రమాలు నిర్వహిస్తాయి.
కేంద్రం రూ. 30 కోట్లు,రాష్ట్ర ప్రభుత్వం రూ. 20 కోట్లు
సైన్స్ సిటీలను 50 లక్షల జనాభా కలిగిన నగరాల్లో నిర్మించాలని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలు చెబుతున్నాయి. 30 ఎకరాల విస్తీర్ణంలో రూ. 50 కోట్లతో ఏర్పాటు కానున్న ఒక్కో సైన్స్ సిటీకి కేంద్ర ప్రభుత్వం రూ. 30 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ. 20 కోట్లు అందజేస్తుంది. తిరుపతి, విశాఖల్లో వీటిని నిర్మించడానికి ప్రతిపాదనలు తయారు చేస్తున్నాం. అలాగే పులివెందుల, నెల్లూరులో ప్రాంతీయ విజ్ఞాన కేంద్రాలు ఏర్పాటు చేస్తాం. దీంతో పాటు పులివెందులలో త్రీ–డీ ప్లానిటోరియం ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేస్తాం. ముఖ్యమంత్రి సైన్స్ సిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఈ నెల 17న కోవిడ్–19ను ఎదుర్కోవడానికి యోగా ప్రాముఖ్యత అనే అంశంపై వెబినార్‌ను నిర్వహించనున్నాం.
– సైన్స్ సిటీ సీఈవో జయరామిరెడ్డి
Comments
Please login to add a commentAdd a comment