సాక్షి ప్రతినిధి, అమలాపురం : జిల్లాలో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సమైక్యాంధ్ర ఉద్యమానికి వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల ‘సమైక్య శంఖారావం’ యాత్ర సరికొత్త ఉత్తేజాన్ని ఇచ్చింది. ఇడుపులపాయలో మహానేత వైఎస్ సమాధి వద్ద నివాళులర్పించిన అనంతరం ఈ నెల 2న తిరుపతిలో షర్మిల శ్రీకారం చుట్టిన సమైక్య శంఖారావం శుక్రవారం జిల్లాలో ప్రవేశించింది. జిల్లాలో రెండు రోజులపాటు యాత్ర తొలిరోజు కొత్తపేట, పి.గన్నవరం, అమలాపురం, ముమ్మిడివరం నియోజకవర్గాల్లో సాగింది. పశ్చిమగోదావరి జిల్లా సిద్ధాంతం నుంచి జిల్లాలో అడుగుడిన షర్మిలకు అడుగడుగునా సమైక్యవాదులు, ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. యాత్ర సాగిన మేరా పల్లెలకు, పల్లెలకు కదలివచ్చి సమైక్య నినాదాలతో హోరెత్తించాయి. పిల్లాపాపలతో సహా రోడ్లమీదకు వచ్చి ‘జగన్ జిందాబాద్, జై సమైక్యాంధ్ర’ అంటూ యాత్ర వెంట పరుగులు తీశారు.
మధ్యాహ్నం 12 గంటలకు జిల్లాలో అడుగుపెట్టిన షర్మిల గోపాలపురం, రావులపాడు మీదుగా రావులపాలెం మార్కెట్‌రోడ్లో సమైక్య శంఖారావం సభాస్థలికి చేరుకున్నారు. సభానంతరం రావులపాలెం నుంచి సాగిన యాత్రలో దారి పొడవునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మందపల్లి వంతెన, బోడిపాలెం వంతెన, కొత్తపేట పాతబస్టాండ్ సెంటర్, కమ్మిరెడ్డిపాలెం సెంటర్, పలివెల వంతెన, అవిడి సెంటర్, కండ్రిగ, రాకుర్తివారిపాలెం, గొల్లకోటివారిపాలెం, కముజువారిలంక సెంటర్‌లలో మహిళలు, యువత పెద్ద ఎత్తున రోడ్డుపైకి తరలి వచ్చి షర్మిలకు సమైక్య నినాదాలతో స్వాగతం పలికారు. వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ర్యాలీగా తరలి వచ్చిన మోటార్ సైకిళ్లతో ముక్కామల సెంటర్ కిక్కిరిసిపోయింది. పుల్లేటికుర్రు, కె.పెదపూడి, జయంతినగర్, అంబాజీపేట బస్టాండ్, నాలుగు రోడ్ల జంక్షన్, పార్టీ కో ఆర్డినేటర్ విప్పర్తి వేణుగోపాలరావు కార్యాలయం సెంటర్, గంగలకుర్రు మలుపు, బండార్లంక, ఈదరపల్లి వంతెన ప్రాంతాల్లో భారీ ఎత్తున తరలి వచ్చి షర్మిల యాత్రకు మద్దతుగా నిలిచారు.
పల్లె పల్లెనా అదే సంఘీభావం
రావులపాలెం సభ అనంతరం షర్మిల యాత్ర మార్కెట్ రోడ్డు నుంచి అరకిలోమీటరు దూరం కూడా లేని కళావెంకట్రావు సెంటర్‌కు రావడానికి ముప్పావుగంటకుపైనే సమయం పట్టింది. రావులపాలెం నుంచి అమలాపురం (30 కిలోమీటర్లు) రావడానికి మూడున్నర గంటలకు పైగానే పట్టింది. దారిలో ప్రతి పల్లెలో జనం సమైక్య నినాదాలతో షర్మిలకు సంఘీభావం తెలియచేసేందుకు పోటెత్తారు. పలుచోట్ల యువకులు జగన్ మాస్క్‌లతో కేరింతలు కొట్టారు. అటు రావులపాలెం, ఇటు అమలాపురం సెంటర్‌లలో సమైక్య శంఖారావం సభలకు వేలాదిగా తరలివచ్చిన జనసందోహాన్ని ఉద్దేశించి ఆమె చేసిన ఉద్వేగపూరిత ప్రసంగానికి జనం నుంచి అనూహ్య స్పందన లభించింది. షర్మిలను చూసేందుకు, ఆమె ప్రసంగం వినేందుకు రావులపాలెం మార్కెట్ రోడ్డు ఇసుక వేస్తే రాలనంతగా జనం, సమైక్యవాదులు పోటెత్తారు. అమలాపురం హైస్కూల్ సెంటర్‌లో జరిగిన సమైక్య శంఖారావం సభలో షర్మిలకు పార్టీ సీజీసీ సభ్యుడు బోస్ తలపాగా పెట్టారు. జిల్లా కన్వీనర్ కుడుపూడి చిట్టబ్బాయి అందచేసిన శంఖాన్ని ఆమె పూరించారు.
చంద్రబాబుది మొసలి కన్నీరు..
సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు విధానాలే రాష్ట్ర విభజనకు కారణమయ్యాయని షర్మిల తన ప్రసంగంలో ధ్వజమెత్తారు. ‘నన్ను చూసి వైఎస్ భయపడ్డారంటున్నావు. అసలు నిన్నుచూసి భయపడటానికి నీకేమైనా అంటురోగాలున్నాయా?’ అంటూ ప్రతిపక్ష నేత చంద్రబాబు వైఖరిని ఎండగట్టినప్పుడు జనం ఈలలు వేసి, కేరింతలు కొట్టారు. చంద్రబాబును ఒక జోకర్‌గా భావించి వైఎస్ పగలబడి నవ్వేవారని గుర్తుచేశారు. ‘హత్య చేసి శవంపై పడి వెక్కివెక్కి ఏడుస్తున్న చందంగా విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చి ఇప్పుడు సీమాంధ్ర నష్టపోతుందంటూ ఆత్మగౌరవయాత్రతో మొసలికన్నీరు కారుస్తున్నావా చంద్రబాబూ?’ అని షర్మిల ప్రశ్నించినప్పుడు జనం ‘జై సమైక్యాంధ్ర’ అంటూ నినదించారు. రాష్ట్రం విడిపోతే ఆరోగ్యశ్రీ, ఫీజు రీ యింబర్స్‌మెంట్ వంటి వాటి గతేమిటని, ఇందుకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఏమి సమాధానం చెపుతారని షర్మిల ప్రశ్నించారు.
విభజన జరిగితే కృష్ణా, గోదావరి డెల్టాలకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయన్నారు. ఈ ప్రాంతమంతా ఎడారి కాకుండా, రాష్ట్రం ముక్కలుకాకుండా సమైక్యాంధ్రగా ఉండేందుకు వైఎస్సార్ సీపీ తరఫున భరోసా ఇచ్చారు. ‘పరిశ్రమలు, ఉద్యోగాలు అన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయి, చదువుకునే యువత చదువులు పూర్తిచేసి ఉద్యోగాల కోసం హైదరాబాద్ వైపు చూస్తున్నారు. వారందరికీ ఇప్పుడు ఎవరు సమాధానం చెపుతారు?’ అని షర్మిల సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిని ప్రశ్నించినప్పుడు యువత పెద్దపెట్టున ‘జై జగన్’ అంటూ నినాదాలు చేశారు. ఆరు నెలలు అధికారం ఇస్తే అన్నీ చక్కబెడతానన్న చంద్రబాబు వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. ‘దున్నపోతా, దున్నపోతా ఎందుకు దున్నలేదంటే పగలు ఎండ, రాత్రి చీకటి అన్నట్టు’ ఉందని ఛలోక్తి విసిరారు.
జిల్లాలో మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమైన సమైక్య శంఖారావం యాత్ర రాత్రి ఎనిమిది గంటలకు ముగిసింది. షర్మిల ముమ్మిడివరం కాపు కల్యాణమండపంలో బసచేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా షర్మిల చేపట్టిన సమైక్య శంఖారావం యాత్రకు కోనసీమ సమైక్యాంధ్ర జేఏసీ ప్రతినిధులు సంఘీభావం తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ సమైక్యాంధ్రకు కట్టుబడటాన్ని అభినందించారు.
నేడు శంఖారావం యాత్ర సాగేదిలా
సాక్షి ప్రతినిధి, అమలాపురం : సమైక్య శంఖారావంలో భాగంగా జిల్లాలో రెండో రోజైన శనివారం షర్మిల బస్సుయాత్ర ముమ్మిడివరం, కాకినాడ రూరల్, కాకినాడ సిటీ, పిఠాపురం, ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల్లో సాగనుంది. ముమ్మిడివరం కాపు కళ్యాణ మండపం నుంచి ఉదయం ప్రారంభమయ్యే యాత్ర ముమ్మిడివరం, మురమళ్ల, ఎదుర్లంక, తాళ్లరేవు మీదుగా కాకినాడ చేరుకుంటుంది. 216 జాతీయ రహదారిపై కాకినాడ మసీదు సెంటర్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కాకినాడ సిటీ కో ఆర్డినేటర్, తాజా మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి ఆధ్వర్యంలో జరిగే ధర్నానుద్దేశించి షర్మిల ప్రసంగిస్తారు. అక్కడ నుంచి సర్పవరం జంక్షన్, అచ్చంపేట జంక్షన్, చిత్రాడ, పిఠాపురం, కత్తిపూడి మీదుగా తుని చేరుకుంటారు. అక్కడ నుంచి విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలోకి యాత్ర ప్రవేశించనుంది.
జిల్లాలోకి ప్రవేశించిన షర్మిల బస్సుయాత్ర
Published Sat, Sep 14 2013 4:02 AM | Last Updated on Fri, Sep 1 2017 10:41 PM
Advertisement