సాక్షి, అమరావతి: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఇస్తున్న భద్రతను ఏమాత్రం తగ్గించలేదని రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం హైకోర్టుకు నివేదించింది. జాతీయ భద్రత మార్గదర్శకాలు నిర్దేశిస్తున్న సంఖ్య కంటే ఎక్కువగానే ఆయనకు భద్రత కల్పిస్తున్నామని తెలిపింది. మార్గదర్శకాల ప్రకారం.. చంద్రబాబుకు 58 మంది భద్రతా సిబ్బంది ఉండాల్సి ఉండగా, తాము 74 మంది సిబ్బందిని కొనసాగిస్తున్నామని వివరించింది. భద్రతా సిబ్బందిని తగ్గించామని చెబుతున్న ఆయన అసలు ఏ విధంగా భద్రతను తగ్గించామో చెప్పడం లేదని కోర్టు దృష్టికి తెచ్చింది. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయనకున్న జెడ్ కేటగిరీని చంద్రబాబు ప్రభుత్వం తొలగించిందని, ప్రస్తుతం చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికీ తాము ఆయనకున్న జెడ్ ప్లస్ కేటగిరీని తొలగించలేదని పేర్కొంది. జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్న ప్రతిపక్ష నేత విషయంలో రాజకీయాలు చేయాల్సిన అవసరం తమకు లేదని తేల్చిచెప్పింది.
చంద్రబాబుకు ఎక్కడెక్కడ, ఏయే సమయాల్లో ఎంత మంది భద్రతా సిబ్బంది ఉన్నదీ లిఖితపూర్వకంగా హైకోర్టు ముందుంచింది. ఈ వివరాలను పరిశీలించిన హైకోర్టు బాధ్యతాయుతమైన ఓ అధికారిని చంద్రబాబు వద్దకు పంపి, ఆయనకు ఈ వివరాలను తెలిపితే సమస్య పరిష్కారమవుతుందని అభిప్రాయపడింది. 2004–14 వరకు చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయనకు కల్పించిన భద్రత, ఇప్పుడు కల్పిస్తున్న భద్రతను పోల్చి, వివరాలను తమ ముందుంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 9కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తనకు భద్రతను కుదించిందని, జూన్ 25కు ముందున్న భద్రతను యథాతథంగా పునరుద్ధరించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై జస్టిస్ దుర్గాప్రసాదరావు విచారణ జరిపారు.
జెడ్ ప్లస్ కేటగిరీని తొలగించలేదు
ఈ సందర్భంగా చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. చంద్రబాబుకు జెడ్ ప్లస్ భద్రతను ఎన్నడూ తగ్గించడానికి వీల్లేదని 2005లో కేంద్ర హోం శాఖ స్పష్టంగా చెప్పిందన్నారు. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబుకు 2+2 భద్రతను మాత్రమే కల్పించిందని తెలిపారు. ఈ సమయంలో ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్ స్పందిస్తూ.. తాము చంద్రబాబుకున్న జెడ్ ప్లస్ కేటగిరీని తొలగించలేదని, భద్రతను కూడా కుదించలేదన్నారు. తిరిగి దమ్మాలపాటి వాదనలు వినిపిస్తూ.. వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఆయనకు 7+7 భద్రతను కల్పించామని చెప్పారు. చంద్రబాబు మావోయిస్టులకు లక్ష్యంగా ఉన్నారని, రాజకీయ కారణాలతో భద్రతను తగ్గించడం సబబు కాదన్నారు. దీనికి ఏజీ అభ్యంతరం చెబుతూ.. జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్నవారికి భద్రతా సిబ్బంది 58 మంది ఉంటారని, తమ ప్రభుత్వం చంద్రబాబుకు 74 మందిని కేటాయించిందన్నారు. చంద్రబాబుకు ఇస్తున్న భద్రత వివరాలకు సంబంధించిన ఓ కాగితాన్ని న్యాయమూర్తి ముందు ఉంచారు. దీన్ని పరిశీలించిన న్యాయమూర్తి వివరాలను చంద్రబాబుకు తెలిపితే ఏ సమస్యా ఉండదు కదా అని వ్యాఖ్యానించారు. దీనికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఏజీ చెప్పారు. దీంతో తదుపరి విచారణను న్యాయమూర్తి ఈ నెల 9కి వాయిదా వేశారు.
చంద్రబాబు భద్రతను కుదించలేదు
Published Wed, Jul 3 2019 5:00 AM | Last Updated on Wed, Jul 3 2019 5:00 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment