వలస నేతలకుషాక్
- కాంగ్రెస్‌ను వీడి వచ్చిన నేతలకు టీడీపీ మొండిచేయి
- యలమంచిలి, ముత్తంశెట్టి, పిన్నమనేనిలకు నో చాన్స్
- నిన్నమొన్నటివరకు చక్రం తిప్పి.. నేడు పరువు పోగొట్టుకున్న నేతలు
- చేతిచమురు కూడా వదిలిన వైనం!
సాక్షి, విజయవాడ : కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశంలోకి చేరిన కొంతమంది నేతల పని పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు మారింది. నిన్నమొన్నటి దాకా మంత్రిగా, ఎమ్మెల్యేగా చక్రం తిప్పిన నేతలు నేడు పార్టీలో కనీసం సీటు కూడా దక్కించుకోలేక పరువు పోగొట్టుకున్నారు. చంద్రబాబు పంచన చేరేందుకు వీరు చేతి చమురు కూడా వదిలించుకున్నట్లు సమాచారం. ఈ నేతల దుస్థితి చూసి జిల్లా వాసులే జాలిపడుతున్నారు.
కాంగ్రెస్‌ను వీడుతున్న నేతలు మరో పార్టీ వైపు వెళ్లిపోతారేమోనన్న భయంతో గాలంవేసి తమ పార్టీలోకి లాక్కున్న చంద్రబాబు ఆ తరువాత సీట్లు కేటాయించడంలో మాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదు. దీంతో నిన్నటి దాకా కాంగ్రెస్‌లో ముందు వరుసలో కూర్చున్న ఈ నేతలు ఎన్నికలు పూర్తయిన తరువాత టీడీపీలో ఎంతమేరకు ఇముడుతారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. కాంగ్రెస్ నుంచి ఐదుగురు వలస వస్తే ఇద్దరికే సీట్లు కేటాయించారు.
కాంగ్రెస్‌తో అనుబంధాన్ని పక్కన పెట్టిన పిన్నమనేని...
కాంగ్రెస్ పార్టీకి, మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు కుటుంబానికి అర్ధ శతాబ్దం అనుబంధం ఉంది. ఆయన తండ్రి పిన్నమనేని కోటేశ్వరరావు సుమారు ఇరవయ్యేళ్లు జెడ్పీ చైర్మన్‌గా పనిచేశారు. పిన్నమనేని వెంకటేశ్వరరావు ఎమ్మెల్యేగా గెలుపొందడమే కాకుండా మంత్రిగా ఆయనకు కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది. గత ఎన్నికల్లో ఓడిపోవడంతో ఆయనకు డీసీసీబీ చైర్మన్ పదవి ఇచ్చి ఆదరించింది. అయినా ఆయన కాంగ్రెస్‌ను వీడి టీడీపీ గూటిలో చేరారు. గుడివాడ, కైకలూరు సీటు ఆశించారు. ఆయనకు చంద్రబాబు మొండిచెయ్యి చూపించారు.
ఎమ్మెల్యే రవికి అవమానమే...
విజయవాడ (తూర్పు) ఎమ్మెల్యే యలమంచిలి రవి కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశంలో చేరినా ఫలితం దక్కలేదు. గత ఎన్నికల్లో దేవినేని నెహ్రూ, గద్దె రామ్మోహన్‌లను ఓడించిన ఘనత రవికి ఉంది. నియోజకవర్గంలో ఆయనకు మంచిపేరే ఉంది. ఆయన్ను పార్టీలోకి తీసుకోవడంతో గద్దె కంటే రవికే విజయావకాశాలు ఉంటాయని భావించి చంద్రబాబు ఆయనకే సీటు ఇస్తారని అందరూ ఊహించారు. రవిని చివరి నిమిషం వరకు వరకు ఊరించిన చంద్రబాబు చివర్లో మొండిచెయ్యి చూపించారు.
డబ్బు, సీటు రెండూ పోగొట్టుకున్న ముత్తంశెట్టి...
గత ఎన్నికల్లో నూజీవీడు ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన ముత్తంశెట్టి విజయనిర్మల ఓడిపోయిన తరువాత చిరంజీవితో పాటు కాంగ్రెస్‌లో కలిసిపోయి సమాచార హక్కు చట్టం కమిషనర్ పదవి పొందారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి దిగజారిపోవడంతో ఆమె భర్త, విద్యావేత్త ముత్తంశెట్టి కృష్ణారావు కాంగ్రెస్ పార్టీని వీడి పచ్చ కండువా కప్పుకొన్నారు. అవనిగడ్డ సీటు ఇస్తానంటూ చంద్రబాబు హామీ ఇవ్వడంతో ఇటీవల జరిగిన జెడ్పీటీసీ ఎన్నికల్లో సుమారు కోటి రూపాయల వరకు ఖర్చు చేశానని ఆయన స్వయంగా చెబుతున్నారు.
ఆయనకు అవనిగడ్డ సీటు ఇవ్వకపోవడంతో కనీసం నూజివీడు సీటైనా ఇవ్వాలని కోరుతూ చివరివరకు ప్రయత్నాలు సాగించారు. అయినా చంద్రబాబు కృష్ణారావుకు మొండి చెయ్యే చూపించారు.
సీటు దక్కినా ఎదురీతే..
టీడీపీ టిక్కెట్లు పొందిన కాంగ్రెస్ మాజీ నేతలు మండలి బుద్ధప్రసాద్ (అవనిగడ్డ), ముద్దరబోయిన వెంకటేశ్వరరావు (నూజివీడు) పరిస్థితి వారి నియోజకవర్గాల్లో ఏమాత్రం ఆశాజనకంగా లేదని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ ఇద్దరు నేతల్ని స్థానిక టీడీపీ నేతలు కలుపుకోలేకపోతున్నారు. వీరికి టీడీపీ నుంచి రెబల్స్ బెడద తప్పేలా లేదు. టీడీపీ నేతలు, కార్యకర్తలు సహకరించక వీరు ఓడిపోతే రాబోయే రోజుల్లో టీడీపీలో వీరికి ఏమాత్రం గుర్తింపు ఉండదని అంటున్నారు.