సైదాపురం(వెంకటగిరి), న్యూస్‌లైన్ : కట్టుకున్నవాడే కడ తేర్చేందుకు ప్రయత్నించాడు. మాయ మాటలు చెప్పి కాపురానికి రమ్మని తీసుకెళుతూ మార్గమధ్యంలో కత్తితో దాడి చేసి పరార య్యాడు. తీవ్రగాయాలతో ఆమె రోడ్డు పక్కనే పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సకాలంలో స్పందించడంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. ఈ సంఘటన సైదాపురం సమీపంలోని 11వ మైలురాయి వద్ద మంగళవారం చోటు చేసుకుంది.
స్థానికులు, బాధితురాలు, పోలీసుల కథనం మేరకు.. మండలంలోని గులించెర్ల గ్రామానికి చెందిన స్వర్ణ రామిరెడ్డి కుమార్తె భారతితో పొదలకూరు మండలం తాడిపర్తి గ్రామానికి చెందిన కిరణ్‌రెడ్డికి మూడేళ్ల క్రితం పెద్దల సమక్షంలో వివాహమైంది. పెళ్లైన నాటి నుంచి ప్రతి రోజూ భర్త పెట్టే వేధింపులు భరిస్తోంది. భర్త గ్రామంలోనే మరో వివాహితతో వివాహేతర సంబంధం కొనసాగిస్తుండటంతో రెండు నెలలు క్రితమే పుట్టింటికి చేరుకుంది. గతంలో కూడా ఓ సారి ఆమెపై హత్యయత్నం చేయడంతో ఆస్పత్రి పాలై, పోలీసు కేసు నమోదైంది. పుట్టింటిలో ఉన్న భారతికి భర్త కిరణ్‌రెడ్డి మంగళవారం ఫోన్ చేసి మాయ మాటలు చెప్పి తనతో కాపురానికి రమ్మని పిలిచాడు. ఆమె భర్త మాటలను నమ్మింది. చాగణంలో భర్తతో మోటారు బైక్‌పై వెళ్లింది. 11వ మైలురాయి వద్ద దించాడు. తనతో తెచ్చుకున్న కత్తితో ఆమె చాతిపై నరికాడు. ఆమె అపస్మారక స్థితిలో పడిపోవడం, ఆ మార్గంలో ఓ కారు వస్తున్నట్లు గమనించిన కిరణ్‌రెడ్డి పక్కకు తప్పుకున్నాడు. రక్త గాయాలతో పడి ఉన్న వివాహితను చూసిన వారు ఆగి విచారించారు. ఆమెను వారు రక్షించే ప్రయత్నం చేస్తుండగా కిరణ్‌రెడ్డి పరారయ్యాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పలువురు సమాచారాన్ని స్థానిక పోలీసులకు అందించారు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని భారతిని సైదాపురం ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. అపస్మారకస్థితి నుంచి తెరుకున్న భారతి జరిగిన సంఘటనపై పోలీసులకు వివరాలు వెల్లడించింది. తన భర్తే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులకు వివరించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు ఎస్‌ఐ తెలిపారు.
కట్టుకున్నోడే కడతేర్చబోయాడు
Published Wed, Aug 28 2013 4:56 AM | Last Updated on Tue, Aug 21 2018 8:23 PM
Advertisement
Advertisement