8 నిమిషాల్లోనే కణుతుల గుట్టు రట్టు
సాక్షి, హైదరాబాద్: వెన్నుపూసకు సోకే అత్యంత ప్రమాదకర వ్యాధుల నిర్ధ్ధారణలో మన వైద్యులు ముందడుగు వేశారు. ఇన్నాళ్లూ వెన్ను భాగంలో ఇన్‌ఫెక్షన్లు, కణుతుల్లో క్యాన్సర్, టీబీ లక్షణాలను నిర్ధారించడానికి అనేక దఫాలుగా పరీక్షలతో పాటు జాప్యం జరిగేది. వాటికి చెక్ పెడుతూ.. ఇన్‌ఫెక్షన్లు, కణుతుల స్వభావాన్ని, వాటి ప్రమాదాన్ని ఇట్టే పసిగట్టే ‘స్క్రేప్ సైటాలజీ’ అనే కొత్త వైద్య విధానాన్ని ప్రముఖ వెన్నుపూస వైద్య నిపుణులు డా.నరేష్‌బాబు(మెడిసిటీ) కనిపెట్టారు. దీనివల్ల క్యాన్సర్, టీబీ జబ్బుల నిర్ధారణ మరింత సులువవుతుంది. సుమారు రెండేళ్ల పాటు ఆయనీ పద్ధతిపై పరిశోధన సాగించారు. వివిధ ప్రాంతాలకు చెందిన 40 మంది రోగుల వెన్నులో నుంచి కణజాలాన్ని తీసి.. స్క్రేప్ సైటాలజీ పద్ధతిలో నిర్ధారణ చేశారు.
వందశాతం ఫలితాలను సాధించారు. ఇప్పటి వరకూ వెన్నులో ఏవైనా కణుతులు ఉంటే ముందుగా ఎంఆర్‌ఐ లేదా ఎక్స్‌రేల ద్వారా గుర్తించేవారు. దీని ఆధారంగా కణితి ఉన్న ప్రాంతంలో మత్తు ఇచ్చి, నీడిల్(సూది) ద్వారా కణుతుల్లో ఉండే కణజాలాన్ని తీసి ఆ ముక్కను బయాప్సీ కోసం నేరుగా పరిశోధనకు పంపించేవారు. కానీ ఈ కణజాలం చాలాసార్లు సరిగా రాకపోవడం వల్ల, జాప్యం కావడం వల్ల రోగ లక్షణాలు వెంటనే తేలేవి కాదు. దీంతో రోగి వెన్నుకు మళ్లీ మళ్లీ మత్తు ఇచ్చి బయాప్సీ చేయాల్సివచ్చేది. అయితే, తాజా పద్ధతిలో లోకల్ అనస్థీషియా(ఏ ప్రాంతంలో కణితి ఉందో ఆ ప్రాంతంలోనే మత్తుమందు) ఇచ్చి తీసిన కణాజాలాన్ని క్షణాల్లోనే స్క్రేప్(ముక్కను రాపిడి చేయడం) ద్వారా జబ్బుకు సంబంధించిన లక్షణాలున్నాయో లేదో తెలుసుకోవచ్చు. రాపిడ్ స్టెయినింగ్ టెక్నాలజీ పరీక్షల ద్వారా క్యాన్సర్ లేదా టీబీ లక్షణాలు ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చు. ఈ మొత్తం ప్రక్రియ 8 నిముషాల్లోనే పూర్తవుతుంది.
ఈ చికిత్సా విధానం గురించి ఆదివారమిక్కడ డాక్టర్ నరేష్‌బాబు మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ కొత్త చికిత్సా విధానం వల్ల వెన్నులో ఉండే కణుతుల స్వభావాన్ని, వాటి తీవ్రతను ఇట్టే తెలుసుకోవచ్చు. అంతేకాకుండా వ్యాధుల నిర్ధారణలో కచ్చితత్వం ఉంటుంది. ఉస్మానియా వైద్య కళాశాలకు చెందిన పథాలజిస్ట్ డా.నీలిమతో పాటు గుంటూరులోని మల్లికా స్పయినల్ సెంటర్ వైద్యులతో కలిసి ఈ ప్రయోగం చేశాం. చాలాసార్లు వెన్నులో ఉండే క ణుతులను వదిలేయడం వల్ల అవి ప్రమాదకరంగా మారేవి. స్క్రేప్ సైటాలజీ వీటిని సులభంగా గుర్తించడం వల్ల ప్రాథమిక స్థాయిలోనే వైద్యం చేసుకునే వీలుంటుంది’ అని తెలిపారు.