ఎందుకు రాజీనామా చేయలేదు?: మేకపాటి
సబ్బం హరికి వైఎస్సార్ సీపీ ఎంపీ మేకపాటి సూటిప్రశ్న
సబ్బంహరి చెబుతున్నవన్నీ అవాస్తవాలే
సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో వైఎస్ పేరును చేర్చినందుకు నిరసనగా రాజీనామా చేస్తానన్నారు
ఢిల్లీకి వెళ్లాక మాత్రం ఏ కారణాల వల్లో రాజీనామా లేఖ ఇవ్వలేదు
జగన్ లక్ష్యంగా కుట్ర జరుగుతోంది
సాక్షి, హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును సీబీఐ ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినందుకు నిరసనగా తనతో పాటు ఎంపీ సబ్బం హరి కూడా రాజీనామా చేయాలని భావించారని.. కానీ, ఏ కారణాల వల్లోగానీ ఢిల్లీ వెళ్లిన తర్వాత ఆయన రాజీనామాపై వెనక్కి తగ్గారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ కో-ఆర్డినేటర్ కొణతాల రామకృష్ణతో కలిసి మేకపాటి సోమవారం హైదరాబాద్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. 2011 ఆగస్టు 11న సీబీఐ వైఎస్ పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చినందుకు నిరసనగా.. తమ పదవులకు రాజీనామా చేయాలని నిర్ణయించి ఢిల్లీ వెళ్లామన్నారు. సబ్బంహరి మొదట తన రాజీనామాను ఫ్యాక్స్ ద్వారా పంపించారని.. తర్వాత రాజీనామాను నేరుగా స్పీకర్‌కు సమర్పించేందుకు ఆగస్టు 24న ఢిల్లీకి తనతో కలిసి వచ్చాడని, తాను మాత్రమే లోక్‌సభ స్పీకర్‌కు రాజీనామా లేఖ ఇవ్వగా సబ్బంహరి ఇవ్వలేదని చెప్పారు.
సబ్బంహరి తమకు పాత మిత్రుడని, ఈ రోజుకూ మిత్రుడేనని... అయితే ఆయన జగన్‌మోహన్‌రెడ్డిపై ఎందుకు విషం కక్కుతున్నారో అర్థం కావడం లేదని మేకపాటి పేర్కొన్నారు. సాక్షి దినపత్రిక సర్క్యులేషన్ ఏడు లక్షలకు పడిపోయిందని సబ్బంహరి చెప్పడంలో ఏమాత్రం వాస్తవం లేదని.. ఏబీసీ (ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్స్) వివరాల ప్రకారం సాక్షి పత్రిక సర్క్యులేషన్ 12,50,664 అని మేకపాటి వెల్లడించారు. దీన్ని బట్టి సబ్బంహరి చెబుతున్నవాటిలో వాస్తవమెంతో తెలుస్తోందన్నారు. అప్పట్లో డిసెంబర్ 20న ఒకసారి, తర్వాత ఫిబ్రవరి 25, 26 తేదీల తర్వాత కూడా రాజీనామా విషయంలో స్పీకర్ తనను వివరణ కోరగా... తన వైఖరిలో మార్పు లేదని స్పష్టం చేశానని, దాంతో రాజీనామాను ఆమోదించారని మేకపాటి చెప్పారు. రాజీనామా ఇచ్చిన రోజు నుంచీ తాను పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ, కన్సల్టేటివ్ కమిటీ సమావేశాలకు కూడా హాజరు కాలేదన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీలు అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చి ఏఐసీసీ సమావేశాలకు హాజరై డ్రామాలు చేస్తున్నట్లుగా తాను చేయలేదన్నారు.
జగన్‌పై కుట్ర..
రాష్ట్రాన్ని అన్యాయంగా విభజిస్తున్న కాంగ్రెస్, తెలంగాణ ఏర్పాటుకు లేఖ ఇచ్చిన టీడీపీల నేతలు కలిసి... సమైక్యం కోసం చిత్తశుద్ధితో పోరాడుతున్న జగన్‌మోహన్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని కుట్ర చేస్తున్నారని మేక పాటి దుయ్యబట్టారు. జగన్ విభజన వాది అంటూ చేస్తున్న ప్రచారాన్ని ప్రజలెవరూ నమ్మబోరని, జగన్ గ్రాఫ్ ప్రజల్లో ఏమాత్రం తగ్గలేదని ఆయన స్పష్టం చేశారు. ఇది తాను ప్రజల్లో పర్యటించి వచ్చి చెబుతున్న మాట అని, ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్‌ను గెలిపించడానికి కంకణబద్ధులై ఉన్నారని చెప్పారు. జగన్‌పై ప్రజల్లో ఉన్న అభిమానం ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికి తిరునాళ్లుగా మారుతుందన్నారు. సమైక్య రాష్ట్రంలోనే ఎన్నికలు జరిగే అవకాశముంది కనుక తెలంగాణలో కూడా వైఎస్సార్ కాంగ్రెస్ చెప్పుకోదగిన సంఖ్యలో సీట్లు గెలుచుకుంటుందని చెప్పారు.